దశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 2
- నడకుదురు లీలా బ్రహ్మేంద్ర
(జర్నలిస్ట్ – ఆంధ్రజ్యోతి దినపత్రిక)
ఆ రోజు జనవరి 1..2015. కొత్త సంవత్సరం ప్రారంభం. ప్రతి ఏటా కొత్త సంవత్సరం రోజున సెంటరులో ఉండి 12 గంటలు అయిన తర్వాత అందరికీ శుభాకాంక్షలు తెలియచేసి సెంటరులోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయానికి వెళ్లి పూజ చేసి ఇంటికి వెళ్లిపోయేవాడిని.
స్వచ్ఛ చల్లపల్లి ప్రారంభం తర్వాత నేను కూడా వెళ్లాలని అనుకున్నా తెల్లవారుజామున లేవలేక మొదట్లో సాహసం చేయలేదు. అప్పటికే కార్యక్రమానికి వెళుతున్న ఈఓ దాసి సీతారామరాజు గారు, వీఆర్వో తూము వెంకటేశ్వరరావు గారు సరదాగా రమ్మని అడుగుతూ ఉండేవారు.
కొత్త సంవత్సరం నుంచీ వెళ్లాలని నిర్ణయించుకుని ప్రతి ఏటా గడిపేట్టు కాకుండా రాత్రికి ఇంటికి వెళ్లి పడుకున్నా. గుడికి వెళ్లే ఆనవాయితీని సైతం వదిలేసి స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమానికి వెళ్ళాను. ఆ రోజు నుంచీ చాలా రోజులు వెళుతూనే ఉన్నా. ఆ రోజు స్వచ్ఛ సేవలో పాల్గొనటం ఎంతో పవిత్రంగా భావించాను.
బైపాస్ రోడ్ లో తొలి రోజు సేవ. డాక్టర్ గారు పెట్టిన పీడీఎఫ్ లో ఉన్న నారాయణ రావు నగర్ బోర్డు ఆ రోజునే బయటపడింది. పిచ్చి చెట్లు..ముళ్ల కంపతో ఆ బోర్డు మూసుకుపోయి ఉండేది. జనవరి ఫస్ట్ తారీఖున ఆ బోర్డుకు మోక్షం వచ్చినట్లయింది.
స్వచ్ఛ చల్లపల్లిలో పాల్గొన్న తొలి రోజు అదో మర్చిపోలేని జ్ఞాపకం.
2014 నవంబర్12వ తేదీన ప్రారంభమైన స్వచ్ఛ సేవా యజ్ఞం పదేళ్ల పాటు నిర్విరామంగా, స్ఫూర్తి వంతంగా సాగుతుందని చాలా మంది ఊహించి ఉండరు. ఇదొక అద్భుతం.
- 10.11.2024.
***
*స్వచ్ఛ సేవలో ఎస్ఐ సుధాకర్*
స్వచ్ఛ చల్లపల్లి తొలిరోజుల్లో చల్లపల్లి ఎస్ఐ గా పనిచేసిన సుధాకర్ గారు కొన్ని రోజులు తెల్లవారుజామున స్వచ్ఛ కార్యకర్తలతో కలిసి హుషారుగా శ్రమదానంలో పాల్గొనేవారు. బైపాస్ రోడ్ లో విజయ నగర్ కాలనీ, అశోక్ నగర్, రాధా నగర్, పాత ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో డ్రెయినేజీ లో మురుగు పనులు చేసేప్పుడు సుధాకర్ గారు గొర్రు పట్టుకుని పనులు చేశారు. జూన్ ఒకటవ తేదీ ఎస్ఐ గారు పాల్గొన్న ఫొటో ఇది. అప్పటికి ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు. ఉదయాన్నే నేను వచ్చిన తర్వాత ఆయనకు ఫోన్ చేసి.. రమ్మని అడిగితే వచ్చారు. చాలా హుషారుగా మనతో కలిసిపోయారు. ఆ తర్వాత కొందరు అధికారులు సైతం మన కార్యక్రమానికి బాగా సహకరించారు.
సీఐ దుర్గారావు గారు అనుకుంటా.. ఎవరైనా చెత్త రోడ్డు మీద వేస్తే షాపు వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చేవారు. వాళ్ళతోనే చెత్త ఎత్తించేవారు.
కొత్తగా వచ్చిన సిఐ గారు ఈశ్వరరావు గారు ఇటీవల గంగులవారి పాలెం రోడ్డు దగ్గర కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నేను ఆ విషయాన్ని గుర్తు చేసి..మీ సహకారం అప్పుడప్పుడూ అయినా ఇవ్వండి అని అడిగాను.
- 11.10.2024
డాక్టర్ గారు ఫొటోలకు దొరికేవారు కాదు
స్వచ్ఛ చల్లపల్లి ప్రారంభించిన తొలి రోజుల్లో డీఆర్కే గారు ఫొటోలకు దొరికేవారు కాదు. వీఆర్వో తూము వెంకటేశ్వరరావు, ఈఓ దాసి సీతారామరాజు గారు తెల్లవారుజామున సేవకు వెళుతుండేవారు. మీరు వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని కాస్త ఫొటో తీయండి అని చెబితే డాక్టర్ గారు ఫొటోలకు దూరంగా ఉంటున్నారు అనేవారు. ఒకటి రెండు సార్లు ఈఓ గారు ఎలాగోలా ఫొటోలు తీశారు. తీరా ఆ ఫొటోలు చూస్తే అందులో డాక్టర్ గారు సరిగా కనిపించేవారు కాదు. ఈ ఫొటోలు పేపర్ కి పనికివస్తాయా అని అడిగితే..మేమేం చేయం బాబూ డాక్టర్ గారు కెమెరాకు దొరికితేనా అనేవారు రాజుగారు.
సరే అని..నేను స్వచ్ఛ కార్యక్రమానికి వెళ్ళటం ప్రారంభించిన తర్వాత ఫొటోలు తీసేందుకు ప్రయత్నించినా మా కెమెరాకు చిక్కకుండా డాక్టర్ గారు పనులు చేసుకుంటూ వెళ్లిపోయేవారు.
నన్ను వద్దండీ కార్యకర్తలను తియ్యండి అంటూ సున్నితంగా వారించేవారు. డాక్టర్ గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకని భావించి ఒక్కోరోజు ఒక్కో కేటగిరీలో ఫొటోలు తీసేవాడిని. ఒక రోజు మహిళలు పనులు చేసేలా, ఓ రోజు వృద్ధులు, ఓ రోజు పిల్లలు ఇలా ఒక్కోరోజు ఒక్కో ఫొటో ఎంచుకుని ఆ రోజు పేపర్ కి ఆ ఫొటో వాడేవాడ్ని. ఆంధ్రజ్యోతి కి ఆ ఫొటో వాడుకోవటంతో పాటు మిగిలిన తోటి జర్నలిస్ట్ మిత్రులకు కూడా వార్త పంపటం, ఫొటోలు షేర్ చేయటం చేసేవాడిని. అలా తొలిరోజుల్లో ప్రతి రోజూ వార్తలు ఇచ్చేవాళ్ళం. మాఉద్దేశ్యం స్వచ్ఛ కార్యక్రమం కొన్ని రోజుల పాటు బాగా ప్రచారం కావాలన్న ఆశ. డెస్క్ వారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. రోజూ ఏమిటి అని గానీ..అప్పుడప్పుడూ ఇవ్వండని గానీ ఏ రోజూ అనలేదు.
ఓ రోజు వివేకానంద డిగ్రీ కళాశాలలో కార్యక్రమంలో(ఏ కార్యక్రమం అనేది ఖచ్చితంగా గుర్తులేదు) పాల్గొనేందుకు అప్పటి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారు వచ్చారు. కవరేజి కి వెళ్లిన విలేకరులను పిలిస్తే శివప్రసాద్ గారి ఛాంబర్లో కూర్చున్నాం. స్వచ్ఛ చల్లపల్లికి మీవంతు సహకారంగా ఏం చేస్తారు అని బుద్ధప్రసాద్ గారు అడిగారు.
మేము చేయగలిగింది కవరేజ్ మాత్రమే..మావంతు కవరేజ్ ఇస్తున్నాం, కానీ డాక్టర్ గారు ఫొటోలకు దొరకటం లేదు. ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్పాను.
ప్రచారం కోరుకోకపోవటం మీ గొప్పతనం కావచ్చు కానీ, కార్యక్రమం గురించి ప్రజలకు తెలియాలి, ఇంకా ఎందరో స్ఫూర్తి పొందాలి కదా అని బుద్ధప్రసాద్ గారు డాక్టర్ గారితో అన్నారు. ఆ తర్వాత డాక్టర్ గారి వైఖరి లో కొంత మార్పు వచ్చింది. అయితే వారు హైలెట్ కావాలనేలా కాకుండా స్వచ్ఛ ఉద్యమం ప్రాచుర్యం కోసం మాత్రమే ఆసక్తి చూపేవారు.
ఒక జర్నలిస్ట్ గా స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ ప్రాచుర్యానికి నావంతు బాధ్యత నూటికి నూరుపాళ్లు నెరవేర్చాననే అనుకుంటాను. స్వచ్ఛ ఉద్యమ ప్రస్థానంలో మాకూ కొన్ని పేజీలు ఖచ్చితంగా ఉన్నాయనే అనిపిస్తుంది. ఆ భావన చాలా సంతోషంగానూ, ఒకింత గర్వంగానూ అనిపిస్తుంది.
స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం పదేళ్లు నిర్విరామంగా కొనసాగడం అంటే నాయకత్వం వహించిన డాక్టర్ డీఆర్కే గారి సహనం, వ్యక్తిత్వమే ప్రధాన కారణం. డాక్టర్ గారి మీద గౌరవంతో ఈ ఉద్యమంలో వారి అడుగులో అడుగులు వేసే స్వచ్ఛ కార్యకర్తలు దొరకటం ఉద్యమం చేసుకున్న అదృష్టం.
- 12-10-24
***