పల్నాటి అన్నపూర్ణ - 5....           15-Oct-2024

 దశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 5

ఇంకో దశాబ్దం పట్టినా సరే!

            ఇప్పుడు వందమందికి పైగా స్వచ్ఛ - సుందర - కార్యకర్తల కుటుంబం మనది, ఐదేళ్లనాడు ఎవరికి ఎవరమో గాని, ఇప్పుడు మన ఊరి సంక్షేమానికి పాటుబడే ప్రయత్నంలో ఒకరికి ఒకరంఆని మన శ్రమదానోద్యమ సారధి ఒక సందర్భంలో వ్రాసిన మాటలండి!

            ఈ కుటుంబం ఆశయాలు, ఆచరణల వారసత్వమే చల్లపల్లి భవిష్యత్తుకు కాపలాదారండి. పైసా  ప్రయోజనం ఆశించని చెత్త పనుల్లో ఈ ఊళ్లో తప్ప ఇంతమంది చిన్నా-పెద్దా-రకరకాల వ్యక్తులు సిద్ధపడడమూ, పదేళ్లుగా డబ్బూ కాలమూ, శ్రమా చేయడం ఇంకెక్కడైనా జరుగుతుందా చెప్పండి!

            ఇదెట్లా సాధ్యం? ఇదెంతవరకూ నిజం? అసలు వేకువ 4.15 కే వీధుల్లోకి వచ్చి - గంటన్నర పాటు రోడ్లు ఊడ్చి, డ్రెయిన్లు బాగుచేసి, చెట్లు నాటి... ఇదేమీ గ్రాఫిక్ కాదు గదా!అనే అనుమాన నివృత్తి కోసం ప్రభుత్వ పెద్దలూ, సామాజిక పరిశీలకులూ వందలూ వేల మంది వచ్చి ప్రత్యక్షంగా చూసి వెళుతున్నారు గదా!

            ఎక్కడెక్కడి వాళ్ల అపనమ్మకాల దాక ఎందుకు తండ్రీ! ఒక్కోసారి ఇంట్లో తీరికగా కూర్చొని 3264* రోజుల శ్రమదాన విశేషాలనీ, శ్మశానాల అద్భుతాలనీ, ఊళ్ళోనూ - చుట్టు ప్రక్కలా పెరుగుతున్న 32 వేల  చెట్లనీ, ఇంత వానల్లో కూడా పొంగక నడుస్తున్న మురుగు కాలవల్ని, కర్మకాండల భవనాలనీ, NTR. పార్కులోని, సెంటరులోని, నాగాయలంక రోడ్డులోని స్వచ్చ సుందర టాయిలెట్లనీ, వీధుల పరిశుభ్రతనీ తలుచుకొంటే నాకే  ఇది కలా నిజమా? ఇన్ని మార్పులు జరిగింది మన ఊళ్ళోనా?” అని ఆశ్చర్యం కలుగుతుందే!

            నా సంగతంటారా - ఇది మా అమ్మమ్మ గారి ఊరూ, ఇలాంటి శ్రమదాన చిత్ర విచిత్రాలకు చోటూ, ముఖ్యంగా సమాజాన్ని పట్టించుకొని ఎన్నెన్ని త్యాగాలైనా సునాయాసంగా చేసే డి.ఆర్.కె, పద్మావతి, శంకర శాస్త్రి, గురవారెడ్డి, వరప్రసాదరెడ్డి....(మన్నించండి - ఈ లిస్టు చాలాచాలాపెద్దది..) వంటి గొప్పవాళ్లూ, సొంత పన్లు మానుకొనైనా ఊరి కోసం నిలబడే శ్రమ త్యాగధనులూ ఉన్న చల్లపల్లి!

            మరి - వీళ్ల సాహచర్యంలో స్వార్థం లేకుండ ఊరంతటి మంచి కోసం జరిగే శ్రమదానంలో పొల్గొనడమూ, సోదర కార్యకర్తలకు అప్పుడప్పుడు తినుబండారాలు చేసిపెట్టడమూ నాకు చాల సంతృప్తి! ప్రమాదంలో కాలు దెబ్బతిని సంవత్సరం పాటు ఈ శ్రమదాన అదృష్టానికి దూరమయ్యాను.

            ఇలాంటి బాధ్యతల్నుండి ఇన్ని వేకువలు దూరంగా ఉంటున్నా సహిస్తున్న నా కుటుంబానికీ, వందల మార్లు  నన్ను వాళ్ళ వాహనాల మీద శ్రమస్థలానికి చేరుస్తున్న డాక్టరు శివప్రసాదు, షణ్ముఖ శ్రీనివాసు... వంటి వారికి కృతజ్ఞతలు.

            ఇంకో 10 ఏళ్లు పట్టినా సరే - మన చల్లపల్లి దేశానికొక ఆదర్శంగా, తీర్ధయాత్రాస్థలంగా మారాలని, మన శ్రమజీవనం ఒక మోడల్ గా ఉండి, అన్ని ఊళ్ళూ బాగుపడాలనే, అందుకు నా వంతు కృషి చేస్తూనే ఉండాలనీనా ఆకాంక్ష!

- పల్నాటి అన్నపూర్ణ

    15.10.2024