దశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 7
“ఊరు టేకుపల్లి – ఉనికి చల్లపల్లి
వృత్తి ఇంజనీర్ – ప్రవృత్తి వేఱు
స్వచ్చ - చల్లపల్లి సంతోష మితనిది
క్షణము ఆపలేడు చేయు పనిని!”
ఇది మన కవి గారు నామీద రాసిన పద్యమండి! 64 ఏళ్లలో 25 ఏళ్లు చల్లపల్లిలోనే గడిపానండి. చేసింది సివిల్ ఇంజనీరు ఉద్యోగం – విశ్రాంత జీవనం కోమలానగర్ లో.
చాల మంది రిటైర్మెంట్ అనేది జీవితం చివరి దశ అనుకొంటారు. చేతులు ముడుచుకొని ఓ-ఓ-ఓ-అదే పనిగా కూర్చొనీ, పడుకొనీ ‘విశ్రాంతి’ పేరుతో బద్ధకంలోకి జారుకొంటారు.
నేను కూడా అలా ఇంటి నాలుగ్గోడలకు పరిమితమై పోవచ్చూ, ఏవైనా ప్రైవేటు పనులు చేసి సంపాదించొచ్చూ-గాని, కోడూరు చెక్ పోస్టు వెంకటేశ్వరావు గారి పుణ్యమా అని చల్లపల్లి శ్రమదాన ఉద్యమంలో దూరానండి.
అప్పుడు తెలిసొచ్చింది-నిజమైన సామాజిక బాధ్యతేదో-నిస్వార్ధంగా ఊరి కోసం పనిచేయడంలో ఏ సంతృప్తి ఉందో-మంచి అలోచనా పరుల సాంగత్యంలో శ్రమించడం ఎంత ఆరోగ్యప్రదమో-ఒక చక్కని సమూహంతో ఒక మంచి పని చేస్తూ ఎన్ని మంచి సంగతులునేర్చుకోగలనో-అని!
ఐతే-నేను చేసిన పెద్ద తప్పును కూడ చెప్పాలండి-అది ఇంత మంచి ఆదర్శమైన శ్రమదానంలో ఆలస్యంగా చేరడమే! సరే-అయిందేదో అయిపోయింది-ఇకముందు ఈ ఉద్యమ ఆశయం నెరవేరేదాకా ఇందరి సాహచర్యంలో పని చేయాలనేదే నా నిర్ణయం!
- అంబటి బసవశంకరరావు.
18.10.2024