దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు - 8
అద్భుతాలకే అద్భుతం మీ స్వచ్ఛ సుందర శ్రమదానోద్యమం!
అది ప్రస్తుతానికి చల్లపల్లికే సొంతం! ఎప్పటికైనా కాక తప్పదు రాష్ట్ర – దేశవ్యాప్తం! దాంతో మాత్రమే సాధ్యమౌతుంది వికసిత నవీన భారతం! నా ఊరికి సుదూరంగా – భూగోళం రెండో అంచున – కనెక్టికట్ లో కూర్చొని – దశాబ్ద కాలంగా నా చల్లపల్లిలో జరిగిపోతున్న ఒక వింత సామాజిక విప్లవాన్ని తలుచుకొన్నప్పటి నామనోగతం ఇదీ----
చిన్నప్పుడు పుస్తకాలలో చదివాను – ‘పంచమహాపాతకాలు’ అని! ఇప్పుడు చల్లపల్లికి పాతిక – ముప్పైవేల కిలోమీటర్ల దూరంలో కూర్చొని ఆలోచిస్తున్నాను – అక్కడి ‘పంచమహాద్భుతాల’ గురించి!
• అందులో తొలి అద్భుతం డాక్టరు DRK గారు – ఆయన వందేళ్ల తర్వాత మళ్లీ చల్లపల్లిలో తిరుగాడుతున్న ఒక మినీ గాంధీ! ఇన్ని రకాల వ్యక్తుల్ని సంఘటితపరచడమూ, చిక్కుల్ని చిక్కటి చిరునవ్వుతో ఎదుర్కోవడమూ, సమన్వయించడమూ ఆయనకే చెల్లింది!
• ద్వితీయ అద్భుతం Dr.పద్మావతే! ఆమె చురుకూ, చొరవా, సాహసమూ, కష్టించే తత్త్వమూ, తెగించే గుణమూ లేకుండా ఈ చల్లపల్లి శ్రమ దానోద్యమ ప్రయాణం ఇంతదూరం వచ్చేదేకాదు!
• అసలు స్వచ్ఛ కార్యకర్తల కృషే పరమాధ్భుతం! ఎవరో ఆశ పెడితే, భ్రమపెడితే, ఆదేశిస్తే జరిగే శ్రమదానం ఇట్లా ఉంటుందా? సరైన సామాజిక చైతన్యంతో అంతరంగాలు ప్రజ్వరిల్లకుండానే దశ వసంతాలపాటు – 4 లక్షల పనిగంటలు చెమటోడ్చారా?
• ఆస్పత్రి సిబ్బందికీ, ఊళ్ళో శ్రమదానానికీ, కార్యకర్తల దైనందిన కష్టానికీ సమన్వయమెలా కుదిరింది? సముద్రపు ఉప్పూ, చెట్టు మీద ఉసిరికా ఎలా కలిసాయి?
కార్యకర్తలకు వైద్య సహకారమూ, కంప్యూటర్ సేవలూ, వారి పనిముట్ల మరామత్తులూ, కాఫీకప్పులు కడిగి, చేతొడుగులు ఉతికి బైటకు తెలియకుండా ఆస్పత్రి ఉద్యోగులు చేసే సేవలెన్నో గదా!
తమ కష్టార్జితాన్ని స్వచ్చోద్యమానికి వెచ్చిస్తున్న దాతల సంగతలా ఉంచితే-
• ఇంత పెద్ద ఉద్యమంలో ఇంకో అద్భుతం 76 ఏళ్ల పెద్దాయన! ఈ దశాబ్దకాలపు పనీపాటుల గురించి ఆయన సుమారు 4 వేల పద్యాలు వ్రాశాడు, ఎక్కడెక్కడో ఉంటున్న నా బోటి ప్రవాసుల కళ్లకు కట్టినట్లు – అన్ని సందర్భాలలో – అన్ని రకాలూ కలిపి 4 వేల పేజీల వ్యాసాలు తయారు చేశారు!
మహా భారత కథలోలాగే ఆధునిక ధృతరాష్ట్రులకు స్వచ్ఛ-సుందరోద్యమ (కాలుష్యం మీద) భారత యుద్ధ విశేషాల్ని ఎప్పటికప్పుడు వర్ణించే నవీన సంజయుని పాత్ర ఆయనది!
- సురేష్ నాదెళ్ల, కనెక్టికట్, U.S.A.
21.10.2024