దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు - 9
ఎంత ప్రయత్నించినా..
నన్ను ‘మట్టా మహాలక్ష్మి’ అంటారండి. 30 ఏళ్లకు పైగా 1) చల్లపల్లి వైద్యశాల 2) పద్మావతి ఆసుపత్రిల్లో నర్సు ఉద్యోగమండి. వక్కలగడ్డ నుండి సైకిలు మీద వచ్చి పోతుంటాను.
నా జీవితానికి నర్సు ఉద్యోగం ఒక భాగమైతే – స్వచ్చ సుందర చల్లపల్లికి శ్రమదానం నా ఆనందమనుకోండి.
“రోజుకొక గంటన్నరపాటు ఉన్న ఊరికి మంచి చేస్తే వచ్చే తృప్తీ, 30-40 మందిమి ఏదో ఒక వీధిని తీర్చిదిద్దిన ఆనందమూ వేరనుకోండి.
ఎవళ్ళనీ దోచుకోకుండా – ఏ కొంపలూ ముంచకుండా – తోటివాళ్లకి ఏ చిన్న ఉపకారం చేసినా అది పుణ్యకార్యమే కదా!
ఎవరికి వాళ్ళం ఒంటరిగా ఈ పనులు చేయగలమేమో ప్రయత్నించండి – దేనికైనా మంది బలం కావాలి. నేను మా గూడెంలో బజారు చెత్తను ఊడుస్తూ – రండిరా అబ్బాయిలూ అంటే ఒక్కడైనా వస్తే ఒట్టు!
అలాంటిది ఈ చల్లపల్లి నిజంగా మంచి ఊరండి – వేకువ 4-00 కే 40-50 మంది చీపుళ్ళేసుకొని, గొర్రులు తీసుకొని 10 ఏళ్లుగా పనులు చేసుకుపోవడమంటే మాటలా?
చీకటితో రోడ్డెక్కానంటే - అక్కడ అన్నీ పనులూ చేసేస్తాను. ఒకటి – రెండుసార్లు ట్రాక్టరెక్కి చెత్తను సర్దినట్లు గుర్తున్నది. చదువుకొనే రోజుల్నుండీ పాటలు పాడే అలవాటుని అప్పుడప్పుడూ శ్రమదానం ముగిశాక కూడా పాటిస్తున్నాను.
వారంరోజుల పాటు మన డాక్టరు గారు, మేడం గారూ ఇక్కడ ఉండనపుడు మనమంతా ఇంకా మంచిగా వీధి పనులు చేయాలని నా కోరిక!
- ఎం. మహాలక్ష్మి
22.10.2024