దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు - 10
మనసులోని మాట
నా పేరు గంధం బృందావన కుమారుడు; చాల కాలం నుండి పద్మావతి ఆస్పత్రిలో కాంపౌండరుడు; వేకువ శ్రమదాన కాలంలో కొందరు చమత్కారంగా పెట్టిన పేరు ఆల్ రౌండరుడు!
ఏదో ఆస్పత్రిలో ఉద్యోగం చేసుకుంటూ - నారాయణరావు నగర్లో ఉంటూ - తోచిన కాడికి వేకువ శ్రమదానంలో పాల్గొంటున్నాను. అంతవరకూ ఫరవాలేదుగాని, 'స్వచ్ఛ - సుందర చల్లపల్లి' కి కార్యకర్తల సేవల్ని గురించి రచించమంటే నా వల్ల అయే పనా?
ఆలోచనలు కొన్ని ఉన్నాయి గాని, కాగితమూ-కలమూ - అభిప్రాయం వ్రాయడమూ అంటే మాటలా?
చెట్టెక్కి వంకర టింకర కొమ్మలు నరకమనండి - వీజీగా నరికేస్తాను; మురుగు కాల్వల్లో దిగి బాగుచేయమంటే రడీ; రంపంతో ఏవైనా దుంగల్ని కోయమన్నా - డిజైన్లు చెక్కమన్నా అభ్యంతరం లేదు. మా కార్యకర్తలొకరిద్దరైతే – వాళ్లు బలే మాటకారులు – 3,4 భాషలు మాట్లాడేస్తారు - వాళ్ళైనా “స్వచ్ఛ- సుందరచల్లపల్లి” ని గురించి రాయమంటే ఎంతవరకు రాయగలరో అనుమానమే !
మాలో అరేడుగురికి ఎవరో-ఎప్పుడో గాని నిక్ నేమ్ పెట్టారండి-”రెస్క్యూటీమ్” అని ! రోడ్డుమీది తాడి, కొబ్బరి దుంగల్ని, గాలికి పడిన పెద్ద కొమ్మల్నీ లాక్కొచ్చి, రోడ్ల భద్రతకు అమరుస్తామనీ, గుంటల్ని పూడుస్తామనీ, గోడలెక్కి బరువు పనులు చేస్తామనీ అలా పిలిచారట!
స్వచ్ఛ కార్యకర్తలు చల్లపల్లికి సేవలు చేస్తున్నారనుకొంటారు. సేవలేంటండి-అవి బాధ్యతలని స్వచ్ఛ చల్లపల్లి పెద్దలెప్పుడూ చెప్పేమాటండి. మరి - ఆ బాధ్యతలు తీరుస్తూ మేం పొందే ఆనందం సంగతి?
నావిషయమే తీసుకొంటే ఈమాత్రం ఆరోగ్యంగా – దృఢంగా - 20 కిలోల బరువు తగ్గించుకుని ఇట్లా ఉన్నానంటే ఈశ్రమదానం వల్లనే గదండీ! అందుకనే....
“జై స్వచ్ఛ - సుందర - ఆరోగ్య - చల్లపల్లి!”
- బృందావన్.
20.10.2024