దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు - 11
దేశచరిత్రలో నిలిచిపోయే ఒక శ్రమదానం!
అన్ని పనుల్లోనూ శ్రమే ఉంటుంది. కానీ స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల శ్రమ నివేదనలో మాత్రం మెదడునూ, హృదయాన్నీ రంగరించి, సమన్వయించడం ఉంటుంది.
చల్లపల్లితో స్వచ్ఛ కార్యకర్తలది బిడ్డా-తల్లీ సంబంధమనిపిస్తున్నది. తన బిడ్డ ఒంటి మాలమూత్ర మలినాల్ని తల్లి స్నానంతో వదిలించి, హత్తుకొని ముద్దాడినట్లే – కార్యకర్తలు ప్రతి ఉదయమూ వీధులూడుస్తారు, డ్రైన్లు బాగు చేస్తారు, హరితాలంకరణం చేసి అనిర్వచనీయ ఆనందం పొందుతారు.
అ స్వచ్ఛ కార్యకర్తలు ఒక వ్యక్తి కాదు – అదొక సామూహిక శక్తి! అసలది ఈ కాలపు సామాజిక నాయకత్వం! ఆ సామూహిక శక్తి ఐచ్ఛికంగా గ్రామానికి సకల సపర్యలూ చేస్తుంది, తన కష్టార్జితాన్ని లక్ష్య సాధనకు ఖర్చు చేస్తుంది!
మనలో కొందరి రోజువారీ జీవితం దైవ పూజతో మొదలౌతుంది. స్వచ్ఛ చల్లపల్లి శ్రమదాతలు – డాక్టర్లూ, ఉపాధ్యాయులూ, గృహిణులూ, విశ్రాంత వయోధికుల రోజు మాత్రం నూటికి 90 మంది ఏమాత్రం ఇష్టపడని వీధి పారిశుద్ధ్యంతో మొదలౌతుంది!
మన సమకాలంలో స్వచ్ఛ-శుభ్ర-హరిత-సౌందర్య భావనలే సామాజిక విలువలనుకోవాలి. వీటిని In corporate చేసి, ప్రణాళికలు రచించి, 10 సంవత్సరాలు నిర్వహించి, సాధించిన సామాజిక ఆనంద ఆరోగ్యాలూ, కాలుష్య నివారణా, సామాజిక ప్రయోజనాన్ని గరిష్టం చేస్తున్నాయి. నిజమైన మానవాభివృద్ధి అంటే ఇదే మరి!
వైజ్ఞానిక భావనల్ని మనిషి జీవనతత్త్వంలోకి అనువదిస్తున్న రూపశిల్పులారా! అనుదిన కర్మిస్టులారా! అభివందనలు!
- బి. వీరాంజనేయులు, రెటైర్డ్ ప్రిన్సిపాల్
చిలకలూరిపేట
22.10.2024