దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు - 12
కార్యకర్తల కృషి చల్లపల్లికి ఆశాదీపం!
నలుకుర్తి (చిన్న) కృష్ణకుమారి అనే నేను చాలాకాలం నుండి పద్మావతి ఆస్పత్రిలో నర్సుగా పనిచేయుచుంటిని. అసలు ఊరు పెదకళ్ళేపల్లి దగ్గర ఒక కుగ్రామం. అద్దె నివాసం చల్లపల్లి 18వ వార్డులో.
స్వచ్ఛ సుందర చల్లపల్లి శ్రమదానానికీ, నాకూ సంబంధమేమిటీ, అనుబంధమేమిటీ, అభిప్రాయమేమిటీ అనేదేగా ఇప్పుడు చెప్పవలసింది!
అది చాలా సింపుల్! 9 ఏళ్లనాడనుకొంటా – మా డాక్టరు సారూ, మేడం గారూ ఒక సూచన చేశారండి – “మీలో ఆసక్తి ఉన్నవాళ్లు ఊళ్లో ప్రతి వేకువా జరుగుతున్న శ్రమదానంలో పాల్గొనవచ్చు – అది మీకూ, గ్రామానికీ మంచిది” అని!
సార్ చెప్పేదేదైనా మాకు వేదవాక్యమే గాని, చేయవలసిందేమైనా మామూలు పనాండి – ఊరివీధుల దుమ్ము ఊడవడమూ, ఎంగిలాకులెత్తడమూ, రోడ్లమీది నానారకాల చెత్తను డిప్పలకెత్తి మోయడమూ గదా! కాస్త మధనపడినా-
వెళ్ళి పనుల్లో దిగి, ఒక్కోరోజూ గడిస్తేగాని అర్ధం కాలేదండి – మేం చేస్తున్నదెంత మంచిపనో – గ్రామానికెంత అవసరమో – ఆ మంచి పనుల్తో రోజువారీగా ఎంత సంతృప్తో – చేయగాచేయగా ఏళ్లు గడిచేకొద్దీ ఊరెంతగా మారిపోయిందో!
పంచాయతీకేమో ఈ పనులకి శక్తి చాలక – వీధుల్లో చెత్త పేరుకుపోయి, కుళ్లు వాసనలొచ్చి, ఈగలూ, దోమలూ దినదినాభివృద్ధి చెందితే – మనలాంటి వాళ్లమన్నా పూనుకోకపోతే చల్లపల్లి ఏమైపోయేదండి!
నా ఇరుగు-పొరుగు వాళ్లని బ్రతిమాలినా – ఏదో అమాసకో పున్నానికో తప్ప ఈ పనులకు కలిసిరాకపోవడం కాస్త బాధగానే ఉంటున్నదండి!
మనం మాత్రం మానకుండా శ్రమదానం చేస్తూనే ఉండాలని నా మనవి!
- నలుకుర్తి కృష్ణకుమారి
23.10.2024