కోడూరు వేంకటేశ్వరరావు - 13....           27-Oct-2024

 దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 13

కోడూరు – గూడూరుచల్లపల్లి

          69 ఏళ్ల జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొంటేనూ, పదేళ్ళ స్వచ్చంద శ్రమదానాన్ని తలచుకొంటేనూ గుర్తొచ్చిన మాటలండి! నేను-వేంకటేశ్వర్రావును-ఇంటి పేరు కోడూరు గాని, పుట్టినూరు (పెద) గూడూరు, రిటైరయిందీ-స్థిరపడిందీ చల్లపల్లి.

          పొట్ట తిప్పల కోసం చేసింది చెక్ పోస్టు ఉద్యోగం-గూడుకట్టుకొన్నది కోమలానగరం-ఇప్పుడు హాయిగా రోజూ ప్రొద్దున్నే చేసుకుపోతున్నది శ్రమదానం!

          కేవలం 133 రూపాయల తొలి నెల జీతగాణ్ణి! ఇప్పుడైతే డబ్బు విలువ మారి, ఉన్న ఊరికి చాతనైన శ్రమతోబాటు-నెలనెలా 520/- ఇవ్వగలుగుతున్నాను. ఇది శ్రమదాన ఖర్చులో ఒక నీటిబొట్టేగాని-నాకదొక తృప్తి!

          నా ఆకారమూ, బరువూ, ఆరోగ్యమూ తెలుసుగా-వాటి అదుపు కోసం NTR పార్కులో నడవడమొక్కటే రిటైరయ్యాక నా వ్యాయామం. అదే మూలకి? స్వచ్ఛ చల్లపల్లి కోసం జరిగే శ్రమదానంలోకి వచ్చాక-అక్కడ గంటన్నర పాటు చెమటల్లో నేనే నంబరువన్ ని!

          తోటి కార్యకర్తలకీ, డాక్టరు గారికీ చాల సార్లు చెప్పానండి-ఈ వేకువ గంటన్నర శరీర శ్రమా, పెద్దల ఆదరణా, DRK గారి వైద్య పర్యవేక్షణా, ఇంతమందితో రోజూ అనుభవాలు పంచుకోపోవడమూ... లేకపోతే ఎప్పుడో టపా కట్టేసే వాణ్ణి!

          ఊరి కోసం పనిచేస్తున్న తొలి రోజుల్లో ఈ డాక్టర్లనీ, దాతల్నీ శ్రమదాతల్నీ చూస్తుంటే బాధేసింది. “అరె! ఈ ఊళ్లో-ఇతర కారణాలతో వచ్చి స్థిరపడిన వాళ్లు చల్లపల్లి కోసం ఇంతింత కష్టబడుతుంటే-దీనెమ్మసిగదరగా-ఇక్కడి స్ధానికులు సగం మంది కసలు పట్టనే పట్టదే” అని!

          నిజం చెపుతున్నాను-బాధేసినప్పుడు కోపమూ-ఒక్కోసారి ౠతులు కూడ వస్తాయండి!

          మధ్యలో ఎప్పుడైనా-మూడు నాలుగు కిలోమీటర్ల దూరంగా జరిగే శ్రమదానానికి వెళ్లలేకపోతే   చాల వెలితిగా ఉంటుంది!

          ఈ ఊరు పూర్తిగా బాగుపడేదాక-మన టీము సంతోషంగా శ్రమదానం చేస్తూనే ఉందామండి!

- కోడూరు వేంకటేశ్వరరావు. 

   27.10.2024.