దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 14
శివరామపురం - కొత్తూరు నుండి!
“అంటే సగటున ప్రతి వేకువా 3-4 కిలోమీటర్లు దూరం వచ్చి మరీ చల్లపల్లికి శ్రమదానం చేస్తున్నాడు” అని నా గురించి అప్పుడప్పుడు ఏవో రాస్తుంటారు; “సొంత పన్లూ, వ్యవసాయం పన్లూ సర్దుబాటు చేసుకొని, రోజూ గంటన్నర రకరకాల వీధి శుభ్రతలు చేస్తున్నాడు – అదీ ఊరు కాని చల్లపల్లి ఊరి కోసం అని కూడ అంటే వింటుంటాను!
ప్రస్తుతానికి ఒకరిద్దరమే గాని – ఒక దశలో మా ఊరు వాళ్లం ఏడెనిమిది మందిమి పాల్గొనే వాళ్ళం. దసరా-దీపావళి-సంక్రాంతి లాంటి పెద్ద పండగల్నే వీధి పనులు చేసే చోటనే జరుపుకొనే కొత్త సంస్కృతి మొదలయింది-స్వచ్ఛ చల్లపల్లిలో!
‘నాకేం లాభం?’ అని ఆలోచించడంమాని-‘నాఊరి సౌకర్యం కోసం-లైక్ మైండెడ్ మిత్రులతో కలిసి, రోజుకొక గంటన్నర ప్రయత్నిస్తే పోయేదేమిటి? ఊరు కళకళలాడుతూ ఉంటే మనమూ హాయిగా బ్రతకొచ్చు గదా!”అనే పాజిటివ్ దృక్పథంలో 10 ఏళ్లు పనిచేయడం పెద్ద విశేషమే!
ఐతే-స్వచ్ఛ కార్యకర్తల “స్వచ్ఛ- శుభ్ర-ఆనంద-ఆరోగ్య చల్లపల్లి” అనే కలమాత్రం ఇంకా సశేషమే! అందుకే-“ఏ ఫలితమైనా కష్టంతోనే వస్తుంది, దానికి సహనం అవసరం..” అనే DRK గారి మాటలు యదార్థమండి. కాబట్టి-మనం అనుకొన్నది సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం.
కార్యకర్తలమైతే ఏదో ప్రొద్దున్నే వస్తున్నాం-చేయగలిగినంత బాధ్యత చేసి వెళ్తున్నాం! మరి ఇందరు కార్యకర్తలను సమన్వయించడమూ, అటు ప్రభుత్వం పోకడల్నీ-ఇటు ప్రజల మనోభావాల్ని పరిగణించుకొంటూ ఇన్ని వేల రోజులు ఇంత ఖర్చును తట్టుకొంటూ ఈ ఉద్యమం బండిని పట్టాలు తప్పకుండా నడిపించడం ఎవరికి-ఎలా సాధ్యపడుతున్నదో ఆలోచించారా?
9-11-24-శనివారం-మన శ్రమదానోద్యమ దశమ వార్షికోత్సవం కోసం ఎవరి అభిప్రాయాలు వాళ్లు వ్రాయడంలో మాత్రం మనలో కొందరికి చిన్న అభ్యంతరమేనట!
“ఏదో గొప్పలు సాధించినట్లు మనకు మనమే ఏవేవో రాసుకోవాలా? చేయగలిగినంత చేసుకుపోతే చాలదా?” అని!
“మనం మంచి పననుకొని చేసింది పదిమందికీ తెలిస్తే-నచ్చిన వాళ్లు ఉత్సాహపడతారేమో!” అని మరికొందరి ఆలోచన!
“మనం సరైన దారిలో వెళ్తున్నాం-ఇంకో ఐదేళ్ళో పదేళ్ళో పడితే పట్టనీ-ప్రభుత్వాలూ, ప్రజలు సహకరిస్తే ఈ ఊరును అనుకొన్నట్లు మార్చగలం” అనే నమ్మకం నాది!
- మల్లంపాటి ప్రేమానంద్
27.10.2024.