శ్రమదాన యజ్ఞం
(గానం – నందేటి శ్రీనివాస్ ; రచనం – ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు)
॥ శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం
చల్లపల్లి స్వచ్చతకు నిబద్ధులం - ఆమె ముఖపద్మంపై చెరగని నవ్వులం ॥
చల్లగ వీస్తూ - జనుల అలసట తీర్చే
గాలి అడిగిందా ప్రతిఫలాన్ని నిన్నూ - నన్నూ!
ఫలములనిచ్చీ - ప్రాణవాయువు పెంచే
చెట్టు ఋణం తీర్చుమొనగాడున్నాడా అసలూ!
తప్పటడుగును దిద్దీ - సాంప్రదాయము తెలిపే
సమాజ ఋణం చెల్లించుట కర్తవ్యం కాదా!
ఏసుక్రీస్తు గాంధీజీ ఏ ప్రతిఫలమాసించిరి?
ఎందుకు తమ బ్రతుకులట్లు బలిదానం కావించిరి?
॥ శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం ॥
మొండి శిలలను చెక్కీ – జీవకళ పుట్టించే
శిల్పి పనితనమే మన వేకువ శ్రమదానంలో
స్వచ్ఛ – శుభ్రతలద్దీ - వీధి వీధిని దిద్దే –
అందచందాలను సృష్టించు ప్రయత్నం మనదీ!
గ్రామ సేవలకు రమ్మని అందరినభ్యర్థిద్దాం –
కదలి వచ్చు సమైక్యతకు ఘనస్వాగత మర్పిద్దాం
కలిసొస్తే ఒక దండం! రాకుంటే సహస్రం!
కర్మఫలిత మాసింపక కదం త్రొక్కుదాము మనం
॥ శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం ॥
ప్రజలను చీల్చే - కులమత గోడలుకట్టే
శ్రమను అవమానించేంతటి దుస్వార్ధ పరులమా మనం?
కశ్మలాలను ఊడ్చీ - ఒడలి చెమటలు చిందే
స్వచ్చ - రమ్య - మాన్య చల్లపల్లి రూపకర్తలం
స్వశక్తిని నమ్మీ - ఊరి స్వస్తత నిలిపీ
అసలాగక అలుపెరుగక జరిపే ప్రస్థానంలో
తమ తపస్సు ఫలితంగా తమ ఊళ్ళో ప్రజలెల్ల
చిరాయువులై సుఖశాంతులతో వర్ధిల్లాలనుకొను
॥ శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం
చల్లపల్లి స్వస్తతకు నిబద్ధులం - ఆమె ముఖ పద్మంపై చెరగని నవ్వులం॥