పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!
శ్రావణ శుక్రవారపు శ్రమవేడుక వేంకటాపురమందే! @2856*
18.8.23 వేకువ డజను మందితో ఆ వేడుక చెరువు గట్టున 4.23 కే మొదలై చివరకు వాళ్ల సంఖ్య 34 దాక వెళ్ళి, 6.52 దాక - మొత్తం 2 ½ గంటల పాటున్నది. అసలైన స్వచ్ఛ - సుందర కార్యకర్తలు 22 మంది కాగా – స్ధానికులు మిగిలిన వాళ్లు.
ఒకరిద్దరు తప్ప - అందరూ సంకల్పితంగానో అసంకల్పితంగానో తలా ఒక చెయ్యి వేసినవాళ్ళే! అలా – ఏ నలభై చేతులో కలిపిన కోలాహలం మీరు దృశ్యరూపంలో కూడ చూడవచ్చు - బరువైన చెత్త బండి చక్రాలొక చోట బురదలో దిగిపోతే, సొంత ప్రారంభం (self start) కోల్పోయిన సదరు ట్రాక్టర్ ను 20 మంది రోడ్డు మీదకి త్రోసిన వీడియో గమనించండి!
అది సరే - 22 మంది వర్షం శీలాన్ని శంకిస్తూనే 3.30 కు ముందే లేచి, నాల్గింటికే బయల్దేరి, గుంటల - చెరువుల రోడ్డు మీదుగా 5 కిలోమీటర్లు పయనించి, వేంకటాపురం 4.20 కే చేరుకోవడాన్నీ -
ఊరు కాని ఊరు చెరువు గట్టు మీది పొదల్నీ, కొబ్బరి బొండాల - తాటి పండ్ల – ప్లాస్టిక్ చెత్తల - సీసాల - ఎండు పుల్లల - నానాకంగాళీనీ వంచిన నడుములెత్తక శుభ్రపరచడాన్నీ-
శస్త్ర చికిత్సల కత్తులు పట్టే చేతులు గునపం, పార, నక్కు, చీపుర్లు ధరించి పొరుగూరి వీధి పారిశుద్ధ్యానికి పాల్పడడాన్ని -
- ఎలా అర్ధం చేసుకొని, అనుసరించి, అభినందించాల్నో నాకైతే అర్ధం కాకున్నది!
వేంకటాపురం రహదారి పచ్చతోరణం పని నాలుగవ నాటిది నిండా 100 గజాలైనా లేదు గాని, అక్కడ నాటిన చిన్నా - పెద్దా చెట్ల, పూల మొక్కలు నలభై మూడే గాని, ఆ బురద నేలలో జంగిల్ తొలగించి, త్రాడుతో కొలతలు వేసి, చెరువు గట్టు బారునా మొక్కల కొలువుకు పెద్ద శ్రమే అక్కరపడింది.
జాగ్రత్తగా సర్ది - త్రొక్కితేనే ఆ పొదలు - గుబుళ్ల వ్యర్థాలు పెద్ద ట్రాక్టర్ నిండి ఎంత ఎత్తుకు చేరిందీ ఫోటోలో చూడవచ్చు,
మొదట్లో కాస్త బెరుకుగా ఉన్నా గ్రామస్తులు - ముఖ్యంగా నలుగురు పిల్లలెంత ఉత్సాహంగా పనిచేశారని?
నాలుగు రోజులు పాటుబడినందుగ్గాను – రెండు వైపులా 2.2 కిలోమీటర్ల నిడివిలో 403 పుష్ప, ఫల జాతుల మొక్కలక్కడ కొలువు తీరాయి. ఇక సంవత్సరకాలపు సంరక్షణ కోనేరు ట్రస్టు వారి - వేంకటాపురం/శివరాంపురం గ్రామస్తుల జాగరూకతతో ఈ రహదారి ఫల - పుష్ప సౌరభ సంభరితమై ఈ ప్రాంతానికొక క్రొత్త ఆకర్షణ కావడమే తరువాయి!
6.48 వేళ - సమీక్ష సందర్భంగా తొలుత మాలెంపాటి పెద్ద డాక్టరు గారి నినాదాలూ, రహదారి సుందరీకరణ ముగించిన సంతృప్తులూ, సవరణలూ వివరణలూ ముగిసి - ఏ 7 గంటలకో కార్యకర్తలిళ్లు చేరారు!
మన శనివారపు ప్రాభాత గ్రామ బాధ్యతల కోసం వేకువనే కలుసుకోదగిన చోటు సినిమాహాలు బైపాస్ వీధిలోని భారతలక్ష్మి వడ్లమర దగ్గరే!
చాప క్రింద నీరులాగ
కథ ముగించి మిన్నకుండె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
స్థానిక సంస్థలు సైతం చప్పబడెను - విరమించెను
స్వచ్ఛోద్యమ చల్లపల్లి చాప క్రింద నీరులాగ
ఏళ్లకేళ్ల ప్రస్థానం ఎలా నిర్వహిస్తున్నది?
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,
18.08.2023.