2857* వ రోజు....           19-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

1 వ వార్డు సంతృప్తికర సేవలు @2857*
ఎందుకోగాని మరీ 4.12 కే సేవలు మొదలై గంటన్నరకు పైగా సుమారొక 100 గజాల బైపాస్ వీధి చెప్పుకోదగ్గంతగా బాగుపడింది. ఇందులో పాల్గొన్న సీనియర్ వైద్యులు, గ్రామ సర్పంచ్, గృహిణులు, వ్యాపారులు, రైతులు తదితరులు. బాలికల ప్రభుత్వ వసతి అశోక్ నగర్ 1 వ వీధి వరకు వాళ్ళ కృషి కొనసాగింది.
వడ్లమర వీధి మలుపు దగ్గర - క్రొత్త భవన నిర్మాణం వల్ల పోగుపడిన వ్యర్ధాలూ, కామినేని భవన సముదాయం వద్ద మురుగు కాల్వల తుక్కులు, రోడ్డుమీదకి వ్యాపిస్తున్న 2, 3 చెట్ల కొమ్మలు ఇంకా యధావిధిగా ఖాళీ మద్యం సీసాల, నీళ్ళ సీసాల ఏరివేతలు ఈ 100 నిమిషాల శ్రమతోనే మెరుగుపడిపోయినవి.
మరీ ముఖ్యంగా ఒకానొక నాపరాళ్ళు దుకాణస్తుడి, అతనితో ఉన్న మరో ముగ్గురి కఠిన శ్రమ ఎంతగా సఫలీకృతమయిందో వాట్సప్ చిత్రాల్లో గమనించండి. 3.30 కే మేల్కొని, 4 గంటలకే ఇల్లు వదలి పని చోటుకు చేరుకుని చీపుళ్లో, గొర్రులో, కత్తులో ధరించి ఊరి బాధ్యతలకు పూనుకోవలసిన అవసరం ఈ 23 మందికి ఎందుకు కలిగిందో వీలైతే ఆలోచించండి!
ఈ గుంపులో వేకువ చీకటిలోనే 69 ఏళ్ల, 84 ఏళ్ల పెద్దలకేమి తొందర కలిగిందో అర్థం చేసుకోండి.
"నా సంగతి నేను చూసుకుంటే - నా లాభం నేను దక్కించుకుంటే - కాదు గూడదు అంటే నా ఇంటి దగ్గర నేను ఊడ్చుకుంటే చాలు కదా?" అని ఈ స్వచ్ఛ కార్యకర్తలు అనుకుంటే ఈ చారిత్రాత్మక చల్లపల్లి కేవలం 9 ఏళ్లలో ఇంత స్వచ్ఛ సుందరంగా, రాష్ట్రానికీ, దేశానికీ ఈపాటి ఆదర్శంగా మారి ఉండేదా?
ఇదే వీధిలో ఒక అపార్ట్మెంట్ దగ్గర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేవీ వాడకుండా జరుగుతున్న హరిత వేడుకను గమనించారా?
6.15 సమయంలో ఈ నాటి శ్రమదానానికి ముగింపు పలుకుతూ గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలను పలికింది పైడిపాముల కృష్ణకుమారి గారు. అందరి ఆమోదంతో రేపటి శ్రమదానం వేదిక సైతం ఈ సినిమా హాలు బైపాస్ మార్గంలోని విజయ్ నగర్ రెండవ వీధి నుండేనని ప్రకటించింది మన స్వచ్ఛ వైద్యుల వారు.
మ్రోగిస్తూ - విచలిస్తూ ....
బాధించే అశుభ్రతలు, వేధించే కశ్మలాలు శోధిస్తూ - స్వచ్ఛతలను సాధిస్తూ -
రుగ్మతల ని
రోధిస్తో శ్రమ వేడుక సాధిస్తూ - తొమ్మిదేళ్ళ ప్రస్థానం విజయభేరి మ్రోగిస్తూ -
విచలిస్తూ ....
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,
19.08.2023.