పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా?
శ్రమ దినాల వరుస సంఖ్య 2858*
ఆదివారం - అనగా ఆగస్టు మాసపు 20 వ వేకువ - 1వ వార్డుకు చెందిన ఉప మార్గపు వడ్లమర వీధి ఎదుటనే కార్యకర్తల 4.13 కాలపు ఛాయాచిత్రము కనిపించుచున్నదా? శుభకార్యముహుర్తాలుండబట్టి కాని, నేటి కార్యకర్తల సంఖ్య ఏ నలుబదిగానో ఉండేది.
- ఇప్పుడైనా - కొంచెం ఆలస్యమైతే అయింది గాని, సదరు బలగం 32 గా తేలింది. కావాలంటే మీరెవరైనా కంచు కాగడా వేసి, వెదకండి - 6 లక్షల భారతీయ గ్రామాల్లో ఇలా 30 మంది ఊరి బాధ్యతలు నెత్తికెత్తుకొని, తొలి బ్రహ్మ కాలానికే రోడ్లెక్కి, బాట మార్జిన్ల - మురుగ్గుంటల దిక్కుమాలిన కాలుష్యాల మీద దండెత్తిన దృశ్యం కనిపిస్తుందేమో!
అందుకే ఈ ప్రాచీన చల్లపల్లి గ్రామం కాస్తా నవ వసంతాలకే "స్వచ్ఛ - సుందర చల్లపల్లి"గా పరివర్తన చెందింది. ఏ కాస్తో సామాజిక స్పృహ ఉన్నవాళ్లకు తప్ప ఈ స్వచ్ఛ కార్యకర్తల లక్షలాది పనిగంటల శ్రమదాన పరమార్ధం బోధపడకున్నదిగాని - ఈ శ్రమదాతల సంఖ్య ఏ రెండొందలో ఉంటే - ఊరింకెంత కళాకాంతుల్తో సౌకర్యాలతో - పూల సువాసనలతో విరాజిల్లేదో!
నేటి శ్రమదాన వివరాల కొస్తే :
- ఇందులో మొదటి బ్యాచ్చి అపార్ట్మెంట్ల వెనుకున్న దుకాణం రెండు ప్రక్కలా, పిచ్చి మొక్కల - తీగల - ప్లాస్టిక్ పరికరాల మీద కత్తుల్తో, దంతెల్తో, ఒక్కోమారు వట్టి చేతుల్లో దాడి చేశారు!
- మురుగు కాల్వ అంచు మీద తాపీగా కూర్చొని, కొడవలితో గడ్డి తొలగిస్తున్న ఒకాయన్ని - 'ఆ నాలుగ్గజాల జాగాని గంటసేపు చెక్కుతూనే ఉంటావా?' అని కొందరు చమత్కరించడాన్నీ,
- కరెంటు తీగల్ని క్రమ్మేస్తున్న ఉత్తరపు ప్రక్క చెట్ల కొమ్మల్ని బరువాటి - పొడవాటి గడ కత్తితో అదుపు చేస్తున్న ఇద్దరు పనిమంతుల్నీ,
- కాస్త లేటుగా వచ్చినా చకచకా గడ్డీ - కొమ్మరెమ్మల - ప్లాస్టిక్ తుక్కుల సకల వ్యర్ధాల్నీ ట్రక్కులోకి చేరవేస్తున్న నలుగురైదుగురి పని ఒడుపునూ,
- చివర్లో సమయం మిగిలి, పనిచాలనపుడు అశోక్ నగర, రెండు వీధుల్లో 15 - 20 గజాల దాక శుభ్రపరుస్తున్న బాధ్యుల్నీ - అందులో ఇద్దరు చిన్న పిల్లల్నీ సాలోచనగా పరికించాను!
ఏమైనా - ఈ 1, 3 వార్డు నివాసులు స్పందనే - చైతన్యమే వేఱు!
6.20 సమయపు మీటింగులో ల్యాబ్ రవీంద్ర ప్రకటించిన ఊరి స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలకు కార్యకర్తల స్పందన తరువాత -
బుధవారం వేకువ మన శ్రమదానం బండ్రేవు కోడు కాల్వవంతెన (గంగులపాలెం దారిలో) గా నిర్ణయించారు. ఇందులో మార్పుండవచ్చనేది మంగళవారం సాయంత్రపు వాట్సప్ లో తేలగలదు !
దృఢ నిర్ణయమయ్యాక దీటుగ చేయక తీరదు
ఏదైనా ఊరి కొరకు - చేదైనా అది తప్పదు
స్వార్ధానికి కానందున సంశయమసలుండబోదు
స్వచ్ఛోద్యమ చల్లపల్లి చరితార్థం కాకపోదు!
- నల్లూరి రామారావు
(ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త)
20.08.2023.