ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1939* వ నాటి అకుంఠిత దీక్షలు.
నిన్నటి స్వచ్చ సైన్య సమష్టి నిర్ణయానుసారం ఈ వేకువ 3.58 నుండి అవసరార్ధంగా 6.20 (నిర్ణీత పని నిలుపదల సమయం 6.00 మాత్రమే) దాక పాక్షిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతంలో – బందరు జాతీయ రహదారి మీద స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ రూపంగా నిర్వహించబడిన గ్రామ బాధ్యతలలో పాల్గొన్న 35 మంది ధన్యులూ పేరుపేరునా అభివందనీయులు!
ఎందుకంటే తమ గ్రామ పారిశుధ్యం లోపించినపుడు ఈ కార్యకర్తలు స్వచ్చందంగా అందుకు పూనుకొన్నారు; ఏ మురుగు కాల్వ అడుగు ముందుకేయక మొరాయించినా – అందులో మొలబంటిలోతులో దిగి వీరు బాధ్యత వహించారు. రహదార్లను రంగు రాళ్ళతో, పూలవనాల సౌరభంతో సుందరీకరించారు; పరమ అధ్వాన్నంగా ఉండే శ్మశానాలను, కర్మభవనాలను, బస్ ప్రాంగణాలను నవీకరించి, వీధుల గోడలను సంత ప్రాంగణాన్ని ఆహ్లాదకరం చేశారు; గత ఆరేళ్లుగా 2 లక్షల పది వేల పని గంటల శ్రమదానంతో, కోట్లాది చెమట బిందు స్రావంతో ఆనందంగా కష్టిస్తున్న వీరికి కాక నా అభినందనలు, అభివందనాలూ ఇంకెవరికి?
ఇక నేటి శ్రమదాన విశేషాలు :
- 15 మంది కార్యకర్తలు 6 వ నంబరు పంట కాలువ వంతెన నుండి పెద్ద మసీదు వరకు రహదారి మీద ఇసుక, దుమ్ము, రాతి ముక్కలు ఊడ్చుకొంటూ వెళ్లారు. 6.15 నిముషాల తర్వాత తిరిగి వస్తూ తమ స్వహస్తాలతో శుభ్ర – సుందరీకృతమైన ½ కిలోమీటరు జాతీయ రహదారిని చూసుకొని వీరు పరిశీలించడం గమనించాను.
మిగిలిన కార్యకర్తలు – ముఖ్యంగా మహిళామ తల్లులు పింగళి నరసింహమూర్తి గారి ఇంటి ఎదుట మొక్కల దుకాణ అవశేషాలను - మట్టి – ప్లాస్టిక్ కవర్లను త్రవ్వి, వేరు చేసి ట్రక్కులో నింపడం ఒక పండుగ వాతావరణం అనిపించింది. (వీరిలో ఒక యువతి గంటకు పైగా కూర్చొని ప్లాస్టిక్ కవర్ల మట్టిని ఒలుస్తూ ఉంటే – మసక వెలుతురులో దూరం నుండి నాకొక కూరలమ్మిలాగా, ఉప్పు చేపల విక్రేతలాగా అనిపించింది!) నిస్వార్ధ శ్రమదానం లో కూడా వీరి స్పర్దను చూస్తుంటే
“స్వర్దతే వర్దతే శ్రమదాన విద్యా” అనాలనిపిస్తున్నది.
6.40 కు కాఫీ – టీ ఆస్వాదనా సమయంలో ఒక వాజ్ఞిపుణ కార్యకర్త విరిగిపోయిన డిప్పలతో, అరిగి - విరిగిపోయిన చీపుళ్లతో రెండు గంటలు పనిచేయడంలోని అనవసర – అత్యధిక కష్టాన్ని ప్రస్తావించడం విన్నాను.
మధ్య మధ్య విరామం పాటిస్తూ వస్తున్న కస్తూరి విజయ్ (అభిప్రాయ ప్రకటనారహితంగా) ముమ్మారు ఎలుగెత్తిచాటిన గ్రామ స్వచ్చ – సుందర సంకల్ప నినాదాలాతో 6.50 నిముషాలకు నేటి బాధ్యతలకు తెరపడింది.
రేపటి స్వచ్చంద గ్రామ కృషి కోసం బండ్రేవుకోడు పెదకళ్లేపల్లి దారి వంతెన దగ్గరి చంద్ర హాస్పిటల్ దగ్గర కలుసుకొందాం.
స్వచ్చోద్యమ అరదశాబ్ది
స్వచ్చ సైన్య మవలీలగ ఆరదశాబ్ది శ్రమించెనా!
స్వార్ధ రహిత సేవలతో బాధ్యతతో తరించెనా!
ఇరవయ్యొకటవ శతాబ్ది ఈ వింతకు సాక్ష్యామా!
ఈ చరిత్ర ప్రపంచానికే ఒక ఆదర్శమా!!
నల్లూరి రామారావు
స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
మంగళవారం – 03/03/2020
చల్లపల్లి.