2861* వ రోజు ....           23-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

2861* వ వేకువ సమయపు శ్రమ వివరాలు!

          బుధవారం (23.8.2023) బ్రహ్మకాలంలో 4.18 కే అవి మొదలై, 6.09 దాక సంభవించాయి! ఊరి వీధుల సుస్థితి నిమిత్తం సదరు శ్రమకారులు 22 మంది! మెరుగులు దిద్దుకొన్నచోటు మళ్లీ గంగులపాలెం మురుగు కాల్వ వంతెన దగ్గరే! - ప్రధానంగా బాటకు ఉత్తర దిశగానే!

          ఏ రోజుకారోజు తమ ఇంటినీ, పరిసరాల్నీ శుభ్రపరచుకోవడంలో బద్దకించే వాళ్లను చూశాం; అసలు ఉదయం 7-8 గంటలైనా మంచాల వంటి పెట్టుకొనే వాళ్లనీ చూశాం, అందుకు భిన్నంగా - తమ ఊరూ, వీధీ, ఇల్లూ కాక  మూడు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి, 4.15 కే వీధి పారిశుద్ధ్యానికి దిగే ఈ పాతిక ముప్పై మంది కార్యకర్తల్ని తొమ్మిదేళ్లుగా చూస్తూనే ఉన్నాం.

          ఇకపై చూడవలసిందల్లా సగం మంది గ్రామ పౌరుల్లో ఎప్పటికి చురుకుదనం వచ్చి, ఊరంతా తమ ఇల్లుగా భావించి, స్వచ్ఛ శుభ్రతలు పెంచి, ప్రతి వీధినీ నందనంగా మార్చుకొంటారనేదే! ఇప్పటికిప్పుడు కాకున్నా మరో నవ వసంతాలకైనా అది జరగక తప్పనిదే!

ఇప్పటికైతే :

          శివరాంపురం నుండి - కోమలా నగర్ అటు చివర్నుండి - విజయ నగర్ నుండి (అందరూ వయోధికులే) ఇటు మూలన బందరు ఉపమార్గం దాక వేకువనే వచ్చి, కత్తీ, గోర్రూ, చీపుర్లూ పట్టి ఊరి అందానికి పాటుబడుతున్న రమణీయ దృశ్యాలే నన్ను ఆకట్టుకున్నవి!

          ఇంటి బాధ్యతలతో సరిపెట్టుకోక - ఉద్యోగ విధుల్తో సంతృప్తిపడక - స్వార్ధ భావనలకు చెల్లు చీటీలు వ్రాసి సామాజిక భావనల్ని ప్రోదిచేస్తున్న గృహిణుల్నీ, గత/ ప్రస్తుత ఉద్యోగుల్ని చూస్తే ఉత్తేజం కలగకేంచేస్తుంది?

          ఏనాటి శ్రమ జీవన సౌందర్యం ఆనాటిదే గాని - ఏ పూట వీధి మెరుగుదల సంతృప్తి ఆపూటదే గాని - అవన్నీ కార్యకర్తలకు దైనందిన అనుభవ వేద్యాలే గాని. ఈ దారిన వచ్చే - వెళ్లే గ్రామస్తులు కొన్ని నిముషాలు నిదానించి, ఈ నాటి గంగులవారిపాలెం బండ్రేవుకోడు కాల్వ గట్టు వీధి పచ్చదనాన్నీ, పరిశుభ్రతనీ, పూల వైభవాన్ని చూసి - అదెలా సాధ్యపడిందో గుర్తిస్తే చల్లపల్లికి మరిన్ని మంచిరోజులు వచ్చినట్లే! ఎదురుచూద్దాం!

కొంచెం ఎక్కువ సమయమే తీసుకొన్న సమీక్షా సమావేశంలో:

- చాల రోజుల ఎడం తరువాత వచ్చి, కార్యకర్తల్తో కలిసిన B.D.రాంప్రసాద్ ప్రకటించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ,

- తిరుచ్చిలో తమిళ సాంప్రదాయక వైవాహిక వివరాలు,

- DRK సహాధ్యాయి Drహమీద్ గారి, మరొక అజ్ఞాత దాతృత్వ సంగతులూ

          రేపటి వేకువ కూడ మన శ్రమదాన క్షేత్రం ఇదే గంగులవారిపాలెం వంతెన వద్దనే!

          ప్రజ్వలించు నవ సంస్కృతి

శ్రమదానమె తప్పయితే గ్రామానికి కీడయితే

లవలేశం ప్రయోజనం రాని వెర్రి చేష్టయితే -

ఈ విజ్ఞులు తొమ్మిదేళ్లు ఎలా చేయగల్గుతారు?

ప్రజ్వలించు నవ సంస్కృతి బాటను నిర్మించగలరు?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   23.08.2023.