2862* వ రోజు ....           24-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

2862*వ వీధి పారిశుద్ధ్య వేడుక!

          గురువారం (24.8.23) వేకువ కూడ అదే వరస - వీధి సుందరీకరణమే! అదే గ్రామ విభాగం గంగులవారిపాలెం సమీపమే! అదే వేకువ సమయం - 4.14 కే! కాకపోతే నిన్నటి కన్న కార్యకర్తల సంఖ్య కాస్త మిన్న - 24! పని స్వభావం కూడ అదే - చెట్లు, పూల మొక్కల కొమ్మలకు కొంచెం క్రమశిక్షణ నేర్పడమూ, పాదుల్ని సరిదిద్దడమూ, రహదారి ఊడ్పులూ, కొసరుగా 4 మొక్కల్నాటడమూ,

          క్రమం తప్పకుండా మన వాట్సప్ మాధ్యమ స్వచ్చోద్యమ రోజువారీ నివేదికల్ని చదివే కొందరికొక సందేహం రావచ్చు వారం రోజులుగా ఒకే రోడ్డు - ఒకే భాగంలో ఇందరు కార్యకర్తలు ఏం పొడుస్తుంటారని!

          ఏ రోజైనా 30 మంది - 100 నిముషాలకు పైబడిన శ్రమ వివరాల్ని మొత్తం వీడియో తీయుటగాని, మీరు చూచుట గాని కుదరదుగనుకనే వీలైన ప్రతి గ్రామస్తుడూ కనీసం వారానికొక్కమారైనా వచ్చి. పాల్గొనాలని అభ్యర్థించేది!

          ఈ కార్యకర్తల గుంపులో సగం మంది మరీ పరిపూర్ణతావాదులు! (Perfectionists) చిన్నపనైనా పెద్ద పనైనా తమకు నచ్చిందాక మెరుగుపరుస్తూనే ఉంటారు.

          ఉదాహరణకి - మొక్కలకి క్షుర కర్మ నిపుణుడొకాయన ఈ పూటంతా డిప్పల మీదికెక్కి - కత్తెరతో ఓ డజను పూల చెట్ల ఆకృతుల్ని మాత్రమే తీర్చిదిద్దాడు. తనకు సంతృప్తికరంగా పని నెరవేరిందా అనేది మాత్రమే తప్ప ముళ్లు వంటికి గుచ్చుకొన్నయ్యా అన్న సంగతతనికి పట్టదు! కాల్వ నీటి గట్టున కలుపు తీసే ఇద్దరికి కట్లపాము తటస్థ పడినా పని ఆపరు!

          అప్పుడప్పుడూ సందర్భానుసారంగా ఛలోక్తులూ - పగలబడిన నవ్వులూ షరా మామూలే ! పాతిక మందిలో ఏ ఒక్కరి సొంతమూ కాని వీధి పారిశుద్ధ్య పని సంస్కృతొకటి  రూపుదిద్దుకొనే మహత్తర కాలమది! వ్యక్తుల శ్రమనూ, చెమటనూ ఊరి ప్రయోజనం కోసం ఏకోన్ముఖ  లక్ష్యం దిశగా సద్వినియోగిస్తున్న అరుదైన సన్నివేశమది!

          నడకుదురు మార్గంలో తప్ప ఏ బాట వెంటైనా మొక్కలు నాటి పెంచే ఖాళీ దొరకదు ప్రస్తుతానికి!

          ఇలా - పెద్ద చెట్లను క్రమబద్దీకరించడమూ, క్రొత్తగా నాటిన వాటి సంరక్షణగా ముళ్ల కంపలు చుట్టడమూ, వేలాది చెట్లకు నీరందించడమూ, మొక్కల కుదుళ్ల కలుపులు తీసి, పాదులు సవరించడమూ వంటి పనులే ప్రస్తుతానికి!

శ్రమదానం ముగింపు వేళా విశేషాలు :

నేటి కృషి పట్ల DRK గారి సంతృప్తీ,

రక్తదాన కర్ణుడు కస్తూరి విజయుడు పలికిన ఊరి స్వచ్చ- పరిశుభ్ర సౌందర్య సాధక నినాదాలూ-

          రేపటి వేకువ కూడ ఇదే గంగుల వారిపాలెం వీధి కాలువ వంతెనే మన కలయిక ప్రదేశమనే నిర్ధారణా!

          నామోషీ ఏమున్నది?

ఇది మినహా గ్రామాలకు ప్రత్యామ్నాయ మేమున్నది

పుట్టి, పెరిగి, బ్రతుకు ఊరు పుట్టెడు కాలుష్యంలో

చిక్కుకొనగ శ్రమదానం చేస్తే తప్పేమున్నది?

నా వీధులు ఊడ్చుటలో నామోషీ ఏమున్నది?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   24.08.2023.