ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1944* వ నాటి మార్పులు.
వేలాది దినాల స్వచ్చ ప్రయత్నంలాగే ఇవాళ కూడా వేకువ 4.00 కే పెదకళ్లేపల్లి దారిలోని మేకలడొంక దగ్గర – తమ ఇళ్ల నుండి సగటున 3 కిలోమీటర్ల దూరంలో – ఆగిన స్వచ్చ సైన్యం 6.20 దాక తన గ్రామ మెరుగుదల కోసం పాటుపడింది. ఇందుకు కలిసి వచ్చిన సభ్యులు 38 మంది ఆ బాల స్త్రీ వృద్ధులు, సాంతం క్రొత్తవారు కాదు గాని – దుబాయి నుండి దాసరి స్నేహ, యార్లగడ్డ అగ్రహారం నుండి సౌమిని, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి సుబ్బారావు, కాంపౌండర్ శేషుల స్వచ్చోద్యమ పునరంకితం నేటి విశేషం!
ద్విముఖంగా సాగిన రెండు గంటల శ్రమదాన వివరాలు:
- సుందరీకరణ ముఠా ఈరోజు తన సంఖ్యాబలం పెంచుకొని, సామ్యవాద (కమ్యూనిస్ట్) వీధిలో మొన్న ప్రారంభించిన ప్రహరీ గోడ మీది నినాదాల, స్వచ్చతా ప్రేరక చిత్రలేఖనాల కృషిని కొనసాగించింది.
- పాతికమంది కార్యకర్తలు మేకలడొంక వంతెన నుండి శివరామపురం దిశగా రోడ్డుకు రెండు ప్రక్కల రెండున్నర్ర డిప్పల ఖాళీ మద్యం సీసాలు ఏరి, కత్తులతో పిచ్చి మొక్కలను నరికి, ఎండిన తాటి కాయల్ని పోగులు చేసి, పొలం వైపు గల ప్లాస్టిక్ వ్యర్ధాలను సమీకరించి, ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి తరలించారు. పని జరిగిన జాగానంతటిని నలుగురు మహిళలు ఊడ్చి శుభ్రపరిచారు.
డి. ఆర్. కె. డాక్టరు గారి చరవాణి పనిచేయక, కొన్ని ఛాయాచిత్రాలు వాట్సాప్ లో ఎక్కలేదు గాని, మైకు నుండి వినిపిస్తున్న అశ్లీలత లేని, ఆహ్లాదకరమైన స్వచ్చోద్యమ ప్రేరక గీతాల నడుమవచ్చే పోయే వాహనాల రొదల మధ్య – రోజుటిలాగే కార్యకర్తల కర్తవ్య దీక్షకు లోటు రాలేదు.
6.40 సమయంలో మహిళా దినోత్సవాన్ని పునస్కరించుకొని మన స్వచ్చోద్యమ అంకిత గాయకుడు శ్రీనివాస్ పాడిన “ఎక్కడమ్మా! నీవు లేనిది – ఏమిటీ నువు చేయలేనిది? ..... అనే పాట అందర్నీ ఆకర్షించి, ఆలోచింపజేసింది. నేను వ్రాసిన – తాను అప్పుడే చూసిన మరొక పాటను కూడ తొలి ప్రయత్నంలోనే పాడి, మెప్పించిన మన ఆస్థాన గాయకుని అభినందించక తప్పదు! “ప్రేమయాత్రలకు బృందావనమూ నందనములఏలనో....” అనే సినిమా పాట వరసలోని ఆ గీతాన్ని చిత్తగించండి....
శ్రమైక జీవన సౌందర్యాలను చాటిచెప్పుటకు ఉందిగా
స్వచ్చ సంస్కృతికి నిలువుటద్దమై – చల్లపల్లి ఒకటుందిగా
ll శ్రమైక జీవన ll
స్వచ్చ సైనికుల – ట్రస్టు కార్మికుల చెమట బిందువుల సాక్షిగా
శ్మశానాలు – రహదారులు – వీధులు స్వచ్చ సుందరములాయెగా
ll శ్రమైక జీవన ll
సుమ సుందర ఉద్యాన పరిమళం – శుభ సందేశము పంపగా
చల్లపల్లి ప్రతి పర్యాటకునకు – స్వర్గధామమై పోయెగా
ll శ్రమైక జీవన ll
ప్రతి గ్రామం మా చల్లపల్లి వలె – స్వచ్చ శుభ్రతలు నేర్వగా
సమస్త దేశం ఆరోగ్యం – ఆనందం తాండవం చేయదా
ll శ్రమైక జీవన ll
ఆర్య – ఆరవ్ లు పోటీపడి, వంతులేసుకొని ఉత్సాహం నింపుతూ ముమ్మారు వినిపించిన స్వచ్చ – సుందర సంకల్ప నినాదాలు ప్రతిధ్వనించి నేటి మన శ్రమదాన వేడుక ముగిసింది.
రేపటి మన శ్రమదానం కోసం గ్రామ – మూడు రోడ్ల ప్రధాన కూడలి ఎదురు చూస్తున్నది!
ఇది ఒక సంకల్ప బలం.
ఇన్ని స్వచ్చరహదారులు – ఈ రంగుల పూదోటలు
ఇంత శుభ్ర కాల్వ గట్లు – ఈ శ్మశానముల సొగసులు
బస్టాండుల, ఆఫీసుల, బడుల, గుడుల శౌచం
ఐదేళ్ళ సుదీర్ఘ స్వచ్చ సైనిక సంకల్ప బలం!
నల్లూరి రామారావు
స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
ఆదివారం – 08/03/2020
చల్లపల్లి.