2949* వ రోజు ...... ....           23-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

పెరిగిపోతున్న పనిదినాలు: @2949*

గురువారం - 23.11.23 వేకువ 4.11 ల గాయతూ 6.04 వరకూ ప్రవర్ధిల్లిన 29 మంది శ్రమదానం గంగులవారిపాలెం దారిలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు నుండి కొలిమి మేస్త్రీ గారి ఇంటి దాక! ప్రతిష్టిత పొగడ చెట్లు 2, తెగిపడినవి బోగన్ విలియా, ఏడాకుల చెట్ల కొమ్మలు!

ఇవి గాక - ఇక్కడికరకిలోమీటరు దూరాన నలుగురైదుగురు సుందరీకర్తల నిన్నటి తరువాయి పూల మొక్కల క్రమబద్ధీకరణం. గంటన్నరకు పైగా వాళ్ళ పట్టుదలతో మురుగు కాల్వ రోడ్డు రెండు ప్రక్కలా అడవి తంగేడు పూల చెట్ల కొమ్మలు క్రమశిక్షణ నేర్చుకొన్నవి.

సన్ ఫ్లవర్ వీధి దాక ఈ బాటలో నేడు జరుగదగ్గ పనులన్నీ జరుగుతాయనుకొన్నా - నిన్నటికన్న కార్యకర్తల సంఖ్య తగ్గినందువల్లనేమో - మధ్యనే ఆగినవి!

నిన్న మొన్న నరికి రోడ్డు వార ఉంచిన కొమ్మల ముక్కలు అక్కడికి సమీపంలోని గృహస్తుల కోరికపై ఒక కార్యకర్త మోసికెళ్లగా వారికి వంట చెరకు కానున్నవి!

నేను చూసినంతలో ఈ ఉదయం కష్టమైన 2 పనులు -

1) మురుగు కాల్వ ఒడ్డున నిలిచి, ఘాటు వాసనల చెట్ల కొమ్మలు నరకడమూ, వాటిని మురుగు నుండి బైటకు తీయడమూ,

2) ముళ్ల కొమ్మల్తో సహా వ్యర్థాలన్నిట్నీ ట్రాక్టర్ లో నింపడమూ.

మొదటి పనిలో ఐదారుగురు కత్తి కార్యకర్తల శ్రమా,  రెండో దాన్లో - సకాలంలో వ్యర్ధాలలో వృక్షాల లోడింగు కోసం ఆరేడుగురి ఉరుకులూ పరుగులూ! స్వచ్ఛ చల్లపల్లి వీధుల్లో ఇవి సాధారణ సన్నివేశాలే గాని - నా వరకు మాత్రం ప్రతి వేకువా ప్రతి కార్యకర్త శ్రమదానమూ విస్తు గొలిపే దృశ్యమే!

ఇవేవీ కల్పిత వర్ణనలు కాక - నేటి కాలంలో ఊహకందని - ఈ ఊళ్ళో మాత్రమే జరిగే నిత్యకృత్యాలు కావడమే అందుక్కారణం!

6.15 కు పల్నాటి భాస్కరుని స్వచ్ఛ - సుందర నినాదాలూ, శివబాబు ప్రవచనాలూ, కాక - డి.ఆర్.కె. గారి సమీక్షా వచనాలూ, అప్పటి దాకా ఆగిన వరుణ దేవుని ఆగమనమూ!

రేపటి శ్రమ వేడుక కూడ గంగులవారిపాలెం వీధిలోని సన్ ఫ్లవర్ అడ్డ రోడ్డు దగ్గరే కలుసుకొని, జరుపుకుందాం!

ప్రస్తుతింపదగనిదా?

ఎవరి మూత్ర విసర్జనో – ఎవ్వరి ఉచ్చిష్టములో

ఎవరి ముక్కు చీదుళ్లో - ఎవరి ఎంగిలాకులో

కశ్మలాల తొలగింపే కార్యకర్త బాధ్యతగా

ప్రతి వేకువ నెరవేర్చుట ప్రస్తుతింపదగనిదా?

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   23.11.2023.