1946*వ రోజు....           10-Mar-2020

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1946* వ నాటి స్వచ్చతా కృషి.

 

ఈనాటి వేకువ బ్రహ్మ ముహూర్తం నుండి 2 గంటల పైగా నిర్వహింపబడిన గ్రామ స్వచ్చ – సుందరీకరణ కృషిలో 30 మంది పాత్ర ఉన్నది. (ఇద్దరు అతిథులు, ఇద్దరు ట్రస్టు కార్మికులతో సహా) కృషి విస్తరణ మాత్రం గ్రామంలోని – బయట మూడు చోట్లకు ! త్రిముఖంగా నడిచిన ఈ రోజు స్వచ్చోద్యమ వివరాలు:

1. ముందుగా ముచ్చటించదగింది గ్రామ రక్షక సైనికుల ప్రయత్నం. శివరామపురం దారిలో 3 వారాల క్రిందట ఊడగొట్టిన తారు పెచ్చుల్ని వీరు ట్రాక్టర్ లో నింపుకొని, RTC బస్ ప్రాంగణ ప్రవేశ మార్గంలోని పెద్ద గుంటను, పడమటి వీధి- పోతురాజు గుడి దగ్గరి ఐదారు గుంటల్ని పూడ్చారు. అవసరమైన మేరకు పెద్ద పెచ్చుల్ని చిన్నవిగా మలిచారు. ఈ ముఠా రోడ్లు వేసే వృత్తినిపుణులు కాదు గాని- వీరి శక్తి వంచన లేని కృషితో నిత్యం వేలాది వాహనాల సామర్ధ్యం పెరుగుతున్నది:  వాహన చోదకుల సౌకర్యం ఇనుమడిస్తున్నది!

2. 20 మందికి పైగా కార్యకర్తలు- తమ ఇంటి వీధి గ్రామ పొలిమేరలను అధిగమించి, 2 కిలో మీటర్ల దూరంలోని శివరామపురం దారికిరుప్రక్కల వ్యర్ధాలను తొలగించి, తామే అంతకుముందు నాటి, సాకి పెంచిన చెట్ల-పూల మొక్కల పాదుల్ని సరిదిద్ది, ఊడ్చి మేకల డొంకకు దక్షిణ దిశ దారిని ఆహ్లాదకరం చేశారు. (ఆ చలి- మంచులో కూడ వీరి వంటి చెమటను,త్రాగుతున్న సీసాల కొద్ది మంచి నీటిని గమనించాను). 

3. ఇక సుందరీకరణ శ్రామిక-కళాకారుల కమ్మ్యూనిష్టు వీధిలో గత 10 రోజుల కృషి నేడు కూడ కొనసాగింది. నల్లని మకిలి పట్టిన ఎత్తైన గోడల్ని గోకి, స్నానం చేయించి, ట్రక్కు మీద నిలబడి ప్రైమరు పూయడం 6.50 నిముషాల దాక జరుగుతూనే ఉన్నది. ఇది ఈ పది రోజుల్లో వీరు సుందరీకరిస్తున్న నాలుగవ ఇంటి ప్రహరీ. మరొక్క ఇంటి గోడను కూడ అందగిస్తే- వీధి వీధంతా స్వచ్చోద్యమ నినాదాలతో రంగు రంగుల పూల తీగల బొమ్మల తో కనువిందు చేస్తుంది!

ఈ ముప్పేట శ్రమదానాలు కాక, వేకువనే ట్రస్టు కార్మికులిద్దరు- ఎండలు ముదురుతున్నందున – నీళ్ల ట్యాంకరుతో వేలాది చెట్ల కు ప్రాణ ధారలందిస్తూనే ఉన్నారు.

నేటి గ్రామ సుందరీకరణ కృషి సమీక్షా సమావేశంలో:

- దాసరి రామ కృష్ణ ప్రసాదు డాక్టరు గారు కరోనా కల్లోలం గురించి, మనం చూపవలసిన అప్రమత్తత గురించీ, వివరించగా 

- రేపు ఉదయం 9.00 కు సాగర్ టాకీస్ సమీపంలో స్వగృహంలో- తన కుమార్తె (వాకా మౌనిక) వివాహ విందు-వేడుకలకు శ్రీనివాస రావు కార్యకర్తలను ఆహ్వానించారు.

రేపటి మన గ్రామ కర్తవ్య నిర్వహణం కూడ శివరామపురం దారిలోనే నిర్వహిద్దాం!

            ఆనాడు x ఈనాడు

అయోమయం-అనాకారి తనం రాజ్యమేలి నట్టి-

బాహ్య మల విసర్జనలతొ స్వస్తత చెడి పాడుబడిన

నా గ్రామం వీధులన్ని నయన మనోహరమైనవి

స్వచ్చ సైన్యం నిజంగానే సమూలంగా మార్పు తెచ్చిందే! 

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 10/03/2020

చల్లపల్లి.    

4.10కు శివరాంపురమ్ రోడ్డులో