1948* వ రోజు....           12-Mar-2020

  

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1948* వ నాటి కొన్ని ఉద్వేగ క్షణాలు.

 తమ గ్రామ బాధ్యతలు మరచిపోని 30 మందికి పైగా కార్యకర్తలు ఈ వేకువ 3.59 నుండి 2 గంటల 15 నిముషాల పాటు ఊరిలోని, ఊరి బయట-మొత్తం 4 ప్రాంతాలలో ప్రణాళికా బద్ధంగా నెరవేర్చిన ముప్పేట కర్తవ్యాల వివరాలిలా ఉన్నాయి:

- 20 మందికి పైగా గ్రామ మిత్రులు శివరామపురం-మేకల డొంక వంతెనల నడుమ- కత్తులతో, దంతెలతో, చీపుళ్లతో సాధించిన స్వచ్చ-శుభ్రతలు చూచి, గుర్తుంచుకోదగినవిగా ఉన్నాయి. ముఖ్యంగా కత్తి వీరుల కృషి-మూడు చోట్ల దారి ప్రక్కన పడిన తాడి కాయలు నారు మడి వలె మొలకెత్తి, పెరుగుతున్న మొక్కల్ని నేల మీద చతికిల బడి, చాక చక్యంగా- కత్తి మొన వాదరలు చెడిపోయేంతగా, గంటన్నర పాటు సమూలంగా పెకలించడం-ఎంత కష్టమైన పనిని ఎంత ఇష్టంగా చేసి, చెమటలు కక్కారో చూడవలసింది!

- గ్రామ కీలక-రద్దీ ప్రదేశాల భద్రతకు కంకణం కట్టుకొన్న ఐదారుగురు నిన్న తాము వేంకటాపురం దగ్గర, ట్రాక్టర్ నిండా సేకరించి తెచ్చిన తారు పెచ్చుల్ని పెద కళ్లేపల్లి దారి వంతెన దగ్గర, బైపాస్ మార్గం విజయవాడ రోడ్డు లో కలిసే చోట ఉన్న పెద్ద గుంటలోనూ, బస్ స్టాండ్ లోపల ఉన్న ఐదారు గుంటల్లోను సర్ది రావడానికే గంటకు పైగా శ్రమించారు.

- సుందరీకరణ దళం నానాటికీ తన సంఖ్యా బలం పెంచుకొంటున్నది – స్థానిక (కమ్యూనిస్టు వీధి)మహిళలు క్రమంగా వీరితో చేరి, ప్రహరీ గోడల్ని కడిగి శుభ్ర పరచడంలో సహకరిస్తున్నారు. “వృక్ష ప్రకృతితో తాదాత్మ్యం చెందుతున్న యువతి” ప్రహరీ గోడ మీద కొలువు తీరి, ఆ వీధి ప్రయాణీకులను ఆకర్షిస్తున్నది! 

- ఇదే ఉషోదయాత్పూర్వంగ్రామ వీధుల మొక్కలకు నీరు పోస్తున్న ట్రస్టు కార్మికులు కూడ గ్రామస్తులు గుర్తుంచుకోదగిన వాళ్లే! 

నేటి శ్రమదాన సమీక్షా సందడిలో దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు సుదూరంలో ఉండి కూడ చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని గమనిస్తున్న గుంటూరు ప్రముఖులిద్దరు- పుస్తకాల(లంకా) సూర్యనారాయణ, అయ్యన్ రావు గార్ల రాక (ఆదివారం ఉదయం) ను ప్రస్తావించారు. 

ఐదారేళ్లుగా స్వచ్చోద్యమ చల్లపల్లి తో మమేకమైపోయిన- రెండు నెలలుగా దావణ గెరె’(కర్ణాటక)లో ఉంటున్న 82 ఏళ్ల ఔత్సాహికుడు వేమూరి అర్జునరావు మాష్టారు- కూర్చొని, నేటి స్వచ్చ సుందర కృషిని గమనించి, సంతృప్తి పొంది, కాఫీ ఖర్చుల నిమిత్తం 700/- ఇచ్చి, రెండు నెలల తర్వాత సోదర కార్యకర్తల్ని కలిసిన ఉద్వేగంతో గ్రామ స్వచ్చ-సుందర నినాదాలను ముమ్మారు ప్రకటించి-6.45 కు నేటి మన బాధ్యతా నిర్వహణకు స్వస్తి పలికారు.

డాక్టర్ మాలెంపాటి గోపాల కృష్ణయ్య గారు ప్రతి నెలా ఇచ్చే 2000/- లను ఈ రోజు కార్యక్రమంలో అందచేశారు.

రేపటి మన నిరంతర- చిరంతర శ్రమదాన కృషి కూడ శివరామపురం దారిలో నేటి కార్యక్రమం ముగిసిన వద్ద నుండి ప్రారంభిద్దాం!

          వివరిస్తా-ప్రకటిస్తా

బాధ్యతలకు దూరంగా పారిపోవు పని గాదని-

దేశ హితం- గ్రామహితం దేదీప్యం కావాలని-

స్వచ్చందం గానె ఊరి బాధ్యతలను మోస్తామని-

ఒక ప్రతిజ్ఞ- దీక్ష బూను ఉద్యమ కారులు వీళ్లని...

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 12/03/2020

చల్లపల్లి.    

 

3.59 కు శివరాంపురమ్ రోడ్డు లో