1950*వ రోజు....           14-Mar-2020

 

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1950* వ నాటి స్వార్థ రహిత శ్రమ వినోదాలు.

1949 రోజుల లాగే- ఈ రోజు వేకువ కూడ – 37 మంది కార్యకర్తల స్వచ్చంద శ్రమదానం నిరాటంకంగా నెరవేరింది. గ్రామంలోని రెండు చోట్ల, గ్రామం వెలుపల-శివరామపురం దారిలోను వీరు 3 ముఠాలుగా విడిపోయి, ఊరికి ఏది మేలనుకొన్నారో ఆ పని నెరవేర్చి సంతృప్తి చెందారు.

- 15 రోజులు పైగా కొనసాగుతున్న కమ్యూనిస్టు వీధి సుందరీకరణ చర్యలు నేడు కూడ కొనసాగటం సరే- నానాటికీ ఇక్కడ ఉత్సాహ-ఉద్విగ్న వాతావరణం నెలకొంటున్నది! రానురాను ఊరిలోని ఔత్సాహిక కళాకారులిక్కడి సమీకృతమౌతున్నారు.

- ఊరికోసం ఏ స్వచ్చ కార్యకర్తలెంచుకొన్న బాధ్యతలు వారివే! ఎంతటి శ్రమనైనా ఇష్టపడే కార్యకర్తలు ఈ రోజు కూడ మరిన్ని తారు రోడ్ల పెచ్చుల్ని తెచ్చి, అవసరం మేరకు వాటిని బద్దలు కొట్టి, బస్టాండు దగ్గర, అవసరమైన ఇతర చోట్ల గుంటలు పూడ్చడం వంటి కార్యకర్తల శ్రమ విన్యాసాలు అందరూ తప్పక చూడదగినవి:- అందం కోసం కొన్ని చెట్ల కొమ్మలు నరికి, తాటి చెట్ల మట్టలు ఊడగొట్టి, డ్రైనులో దిగి, అన్ని విధాలా వ్యర్ధాలను పోగులు చేసి, ఖాళీ సారా సీసాలను గుట్టలుగా ఏరి- అడుగడుగునా స్వచ్చ-శుభ్రతల సాధనలో తల మునకలౌతున్న ఈ కర్మిష్టులుకాక మరెవరు ధన్యులు? నేటి కార్యకర్తలలో 7 ఏళ్ల పిల్లల నుండి 82 ఏళ్ల పెద్దల వరకు అందరిలోను ఉత్సాహికమే- తమ ఊరి మేలు కోసం కొంతైనా శ్రమిస్తున్న సంతృప్తే!

6.40 కి కమ్మ్యూనిష్టు వీధిలో జరిగిన స్వచ్చోద్యమ దైనందిన సమీక్షా సమావేశంలో:

1) దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు ఫిబ్రవరి మాస ఆదాయ వ్యయ చిట్టాను వివరించారు- ఒక లక్షా 32 వేల లోటు-(ఆదేమో పద్మావతి గారి వంతు!) 

2) బాల కార్యకర్త- మద్దాల ప్రిన్సి ముమ్మారు స్వచ్చోద్యమ సంకల్ప నినాదాలను పలికి 6.45 కు నేటి కార్యక్రమాన్ని ముగించింది.

3) నందేటి శ్రీనివాస్ “ ఆ చల్లని సముద్ర గర్భం-దాచిన బడబానలం”(దాశరథి రచన) పాటతో ఉత్సాహం నింపాడు.

రేపటి మన కర్తవ్య దీక్షను శివరామపురం దారిలోను, కమ్యూనిష్టు వీధిలోను, ఇంకా అవసరమైన చోట్ల నిర్వహిద్దాం!

         కాలంమారిపోయెనుగద

బాధ్యతసలు పట్టనట్లు-స్పందించని కాలం అది

గ్రామ బాధ్యతొకటొకటిగ కలిసి మోయు సమయం ఇది

నాకోసం నేను కాదు- మనకోసం మనమంటూ

స్వచ్చ సైన్యం నిజంగానే సమూలంగా మార్చివేస్తుందా!

 

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 14/03/2020

చల్లపల్లి.    

 

3.58 కు శివరాంపురమ్ రోడ్డులో
బాల కార్యకర్త ప్రిన్సి
బస్టాండ్ లో ని గోతులను పుడుస్తున్న కార్యకర్తలు