పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
స్వచ్చోద్యమ పని దిన ప్రత్యేక సంఖ్య - @3033*
శనివారం(17-2-24) వేకువ సమయాన చిల్లలవాగు ప్రక్కన 28+5 గురి (మొత్తం మళ్ళీ అదే సంఖ్య – 33!) శ్రమ కూడ సామాన్యమైనది కాదు, ప్రక్కన శ్మశానం కాని, వాంతులు తెప్పిస్తున్న మిగలక్రుళ్లిన వ్యర్ధాలు గాని, స్వచ్ఛ కార్యకర్తల్ని తప్ప జనాన్ని చుట్టుముట్టి వణికిస్తున్న మంచూ చలీ గాని - ఏవి సాధారణ పరిస్థితులు?
అలనాడు ప్రజల పాపాలను శిలువగా మోసిన జీసస్ వలె ఈనాడు చల్లపల్లి 20 వార్డుల కాలుష్య భారాన్ని మోస్తున్న స్వచ్ఛ కార్యకర్తలు! పంచాయతీలు ఆర్ధిక పరిపుష్టంగా ఉంటే - ఇంటి ముందు కొచ్చిన చెత్త ట్రాక్టరుకు - గృహస్థులు వ్యర్ధాల్ని నాలుగైదు రకాలుగా విడగొట్టి అందిస్తే – ఏ వార్డుకావార్డులోనే చెత్తను ఎరువుగా మార్చుకొంటే - స్వచ్ఛ కార్యకర్తలకింతటి శ్రమ ఉండకపోను!
చల్లపల్లి పంచాయతి కార్మకుల్లాగా అన్ని ఊళ్ల పారిశుద్ధ్య కార్మికుల్లో “ఈ ప్రతి వ్యర్ధమూ ఊరికొక సంపద వనరే” అనే స్పృహ వస్తే గ్రామాలన్నీ ఆర్థిక సమతులంగా, ఆరోగ్యంగా ఉండవా?
ఎక్కడెక్కడి వాలంటీర్లూ ఎప్పుడు లేస్తారో గాని - వేకువ 4.15 కే ఊరికి 2-3 కిలోమీటర్ల దూరంగా శ్మశన స్థలాంతర్గత చెత్త కేంద్రానికి ఇంతటి చలినీ మంచునూ ఛేదిందుకొని రావడమే వింత!
వచ్చాక 2 గంటల పాటు గ్రామ సమాజంలో తమ గౌరవస్థాయిని వదిలేసి, పారిశుద్ధ్య కార్మికుల అవతారమెత్తడమే విచిత్రం! తప్పనిసరి తద్దినంగా, మ్రొక్కుబడిగా కాక క్రుళ్లిన చెత్త పనుల్లో సంతృప్తిని వెదుక్కోవడమే చిత్రాతి చిత్రం!
‘ఈ పూట 3 ట్రాక్టర్ల చెత్తను విభజించి, ఎరువుకు సిద్ధం చేశాం” అని సంతోషించే స్వచ్ఛ కార్యకర్తల్నేమనుకోవాలి? పదేళ్ల నుండీ వీళ్ళ పుణ్యకార్యాలివేగాని, గత పది రోజుల ప్రయత్నాలు మరీనూ!
6.35 వేళ నేటి తమ పని సమీక్షా సందర్భంలో కొందరు ‘ఆదివారాల్లో కేవలం వేకువనేకాక సాయంత్రాలు కూడ మనం పని చేస్తే ఎలా ఉంటుంది’ అని ప్రతిపాదించారు!
1) పైడిపాముల వారి పదవి తృతీయ వార్షిక సమయంలో కాంపౌండర్ శేషు గారి బిస్కట్ల పంపిణీ పూర్వక అభినందనా, ‘మనకోసం మనం’ ట్రస్టుకు 500/- విరాళమూ,
2) హీరో షోరూమ్ - దాసరి వారింటి పెండ్లికి రేపటి సాయంత్రం ఆహ్వానమూ,
3) చల్లపల్లి పంచాయితీకి ప్రాత తుక్కు వ్యాపారి గణేషుని 12,001/- చెల్లింపూ,
నేటి సమావేశపు మరికొన్ని విశేషాలు!
కాస్త తర్జన భర్జనల పిదప రేపటి వేకువ శ్రమదాన కేంద్రం కూడ చెత్త కేంద్రమే అనే ప్రకటనతో నేటి కార్యక్రమం ముగింపు!
ఇది గద శ్రమదానమనగ
ఇది గద శ్రమదానమనగ – ఇదె అంకిత భావ మనగ
వట్టి కబుర్లకు బదులుగ గట్టి మేలు చేయుటనగ
సమైక్య శ్రమ వేదికనగ - చక్కని ఆదర్శమనగ
గ్రామ తక్షణావశ్వక ప్రతి చర్యంటే ఇదే!
- నల్లూరి రామారావు
17.02.2024