3034* వ రోజు...........           18-Feb-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?       

ఆదివారం నాటిది 3034* వ శ్రమదానం!

          18.2.24 వ వేకువ ప్రయత్నమన్నమాట!  ప్రయత్నీకులు 30 మంది, స్థలం యధా ప్రకారం మూతబడి న డంపింగ్ కేంద్రం, సమయం 4.18 6.15 మధ్యస్థం !

           భారీ మంచుతో చెలిమి చేస్తూ చలిగాలి వీస్తేనేం 2 ట్రాక్టర్ల  చెత్త గుట్ట ఎదురుగా ఉంటేనేం ఆ తుక్కు నుండి క్రుళ్లు కంపు వస్తుంటేనేం- ఇందులో ఎవరు వెనకాడారు? సగటున గంటన్నర పైగా ఆహార వ్యర్థాల్నీ, ఏడెనిమిది రకాల తడీ పొడీ వస్తువుల్నీ ఏరి, వేర్వేరు డిప్పల్లోనూ - తద్వారా భారీ గోతాల్లోనూ నింపక మానారు?

          మర్యాదస్తులుమనుకొంటూ శ్మశానం దగ్గరకు వేకువనే రానివారూ, సహజ బద్దకానికి హేమంత ఋతు చలి తీవ్రత తోడై మంచాలు దిగని వారూ, పదేళ్ల గ్రామ శ్రమదానోద్యమం తరవాత కూడ ఈ పారిశుద్ధ్య కృషి బొత్తిగా పట్టనివారూ పోను-పాతిక వేల జనాభాకు ప్రాతినిధ్యం 0.1% శాతమన్నమాట!

          ఈ వేకువ సమయాన ఊరి బాధ్యత మోసిన కష్ట జీవుల్లో కొందరైతే గంటన్నరకు పైగా బోర్లించిన డిప్పల మీద కూర్చొని, నిర్విరామంగా  పని చేస్తూనే ఉన్నారు.

           ఈ ముగ్గుర్నలుగురు చొప్పున ఈ ఆరేడు బృందాల ఎదుట డిప్పల్తో చెత్తను తెచ్చి పోసే వాళ్లు ముగ్గురూ, విడగొట్టిన వ్యర్థాల్ని విడివిడిగా పెద్ద గోనె సంచుల్లో నింపేది ఇద్దరూ!

           చెత్త గుట్ట దగ్గరే నిలబడి దంతెల్తో లాగి, సాధ్యమైనంతవరకక్కడే విభజిస్తున్న ముగ్గురూ

స్థూలంగా నేటి వేకువ పని స్వభావమిదీ!

           షరా! చల్లపల్లి ఊరి స్వచ్ఛ - సుందరీకరణ శ్రమ ఈ7. 00 తోఏమీ ఆగదు; 

          వేంకటాపురం రోడ్డులో కూలీల రహదారి మెరుగుదల శ్రమా, అవసరమనుకొన్న మరికొన్ని చోట్ల మనకోసం మనం ట్రస్టు కార్మికుల కృషీ, రెండు పూటలా చెత్త సేకరణకు పంచాయతీ ఉద్యోగుల కష్టమూ రోజంతా కొనసాగుతూనే ఉండునని ఇందు మూలముగా తెలియ జేయడమైనది!

           కాలుష్యాల మీద జరిపే ఈ ముప్పేట దాడి లేకుంటే స్వచ్ఛ- పరిశుభ్ర- సుందర చల్లపల్లిపేరు సార్థకమయేదెట్లు?

6.40 కి జరిగిన తుది సమావేశ వివరాలు :

- గోళ్ల వేంకట రత్న నామధేయుని నినాదాలూ,

- అర్థాంతరంగా ఆగిన అడపా వారి సూక్తులూ,

- నడకుదురు బాటలోని RK కన్వెన్షన్ లో హీరో పోరూమ్ దాసరి వారి పెళ్లి సందడికి సాయంత్రం 7.00 తరువాత వెళ్ళవలసిన సంగతీ,

- రేపటి వేకువ కూడ మన శ్రమ స్తలం డంపింగ్ కేంద్రమనే విషయమూ...

        

          చక్కని ఊరేదనగా

3 వేల రోజులుగా ముమ్మర శ్రమ వేడుక గల,

స్వార్థం వాసన తగలక త్యాగం వెలుగులు సోకిన

స్వచ్ఛ కార్యకర్తలున్న చక్కని ఊరేదనగా

శుభ్ర స్వచ్ఛ- సౌందర్యం సాధించిన చల్లపల్లి!

- నల్లూరి రామారావు

   18.02.2024