పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
సోమవారం - 3035* వ వేకువ కూడ 17 మంది శ్రమ!
19.2.24 న సైతం వేకువ 4.18-6.15 సమయంలో శ్మశానం ప్రక్క చెత్త గుట్టల పనే వాళ్ళెంచుకొన్నారు. శ్రమ జీవుల సంఖ్య తగ్గినా, శ్రమ పరిమాణం గాని, నాణ్యత గాని తగ్గలేదు.
వార్డుకొక్కరు చొప్పునైనా లేని ఈ శ్రమదాతలు ఈ వేకువ 2 గంటల్లో విభజించిన తుక్కు కాస్త తక్కువగా ఒక ట్రాక్టరు. అంతకు ముందు సోమ మంగళవారాలు ఐదారుగురు రెస్క్యూ టీమ్ పేరిట ఊళ్లో ఏ వీధిలో తక్షణావసరాలుంటే అక్కడ వాలి, సరి చేసి వచ్చేవారు!
ఇక ఈ 2 వారాల్నుండైతే - స్వచ్ఛ కార్యకర్తలంతా రెస్క్యూ దళమైపోయారు! వెళ్తున్నది శ్మశానం, డంపింగ్ కేంద్రాలకు, చేస్తున్న పనైతే క్రుళ్లి, కంపుగొట్టుతున్న వాటి నడుమ కూర్చొని, పరీక్షగా ఏడెనిమిది విధాలుగా ఏరి, వాటిని అమ్మేందుకో - కంపోస్టు ఎరువుగా మార్చేందుకో సిద్ధపరచడం!
దీనర్థం - ఇళ్లలో ఉత్పన్నమయ్యే చెత్తను దాని పుట్టుక దగ్గరే 4 రకాలుగా విడగొట్టడమనే పనన్నమాట వీళ్లిక్కడ చేస్తున్నది! అభివృద్ధి చెందిన దేశాల్లో 90-100 ఏళ్లనాడు జరిగిన పని-మన దేశంలో మన కాలంలో జరుగుతున్నదనుకోవాలి! ఈ స్వచ్ఛ సుందరోద్యమ నాటకానికి - చెత్త నుండి సంపద సృష్టి రూపకానికి దేశ గ్రామీణ ప్రాంతంలో తొలిసారి నాందీ - ప్రస్తావనలన్న మాట!
ఇక్కడి సుదీర్ఘ దశాబ్ద కాల శ్రమదాన నాటక పాత్రధారులు ఎంత ధన్యులో - వాళ్లు తెరతీస్తున్న క్రొత్త చరిత్ర ఎంత సార్థకం కానున్నదో గుర్తు చేసుకోండి!
ఎంత ప్రయత్నించినా, నెలకు 9-10 వేల జీతమిస్తామన్నా, ఈ కార్యకర్తలు చేస్తున్న పనికి - 20 వేల మంది జనాభా నుండి 50-60 మంది కూడ ముందుకు రాలేదట!
ఏడెనిమిది రోజుల్నాడు మొదటి ఎరువు దిబ్బ సిద్ధమైతే – మళ్ళీ నిన్న 2 వ ఎరువు గుట్ట తయారౌతున్నది. ఊరి నిండా, చుట్టూ చెత్త ఉన్నది. దాన్ని సంపదగా మార్చే మానవ శక్తి – కార్యకర్తలు, ఉద్యోగులే ఇప్పుడవసరం! ఈ 2-3 నెలలే అందుకు కీలకం! ప్రయత్నం నెరవేరితే ఆర్థికంగా పంచాయతీకి, ఆరోగ్యపరంగా - ఊరికి తక్షణ ప్రయోజనం!
6.35 కు నేటి శ్రమదాన సాంప్రదాయక నినాదాలకు చొరవ చేసిన వారు శివబాబు,
రేపు వేకువ కూడ ఇదే పనికి - ఈ చెత్త సంపద కేంద్రం వద్దే కలవాలనే నిర్ణయం అందరిదీ!
ఇది సవనం అనవచ్చా?
పావులక్ష జన హితముకు పాతిక మంది పాటుబడుట,
దశాబ్ది పైగా వదలక దాని కొరకు యత్నించుట-
ఇది వ్యసనం అందామా? ఇది సవనం అనవచ్చా?
చాదస్తంగ మిగులుతుంద-ఆదర్శం ఔతుందా?
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
19.02.2024