పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
3036* వ నాటి శ్రమ సంగతులు!
20-2-24 - మంగళవారం వేకువ కూడ పెద్దమార్పులేవీ లేకుండ - ఇంచుమించు పునరావృతమైన అవే శ్రమదానరీతులు! ఆ 15 + 2 మందే - శాశ్వత మూసివేతకు గురైన అదే డంపింగ్ కేంద్రం ఎదుటే – 4:19 – 6:15 మధ్యస్తంగా ఆ రెండు గంటల సమయమే!
24 గంటలైనా నిలవుండక – 12 గంటలకోమారు 20 వార్డుల్నుండి వచ్చి చేరిన 11 ట్రాక్టర్ల వ్యర్థాలే! అందువల్ల క్రమంగా తగ్గుతున్న క్రుళ్ళు వాసనలు! ఇందులో దాదాపు 9 ట్రక్కుల చెత్తకు – నిన్న ట్రస్టు కార్మిక సోదరులు గాని, ఈ వేకువ స్వచ్చంద శ్రమదాతలు గాని పరిష్కారం చూపడమంటే ఎంత గొప్ప సంగతి!
డిప్పలు బోర్లించి కూర్చోనవసరం లేకుండా పని చేసుకొనేందుకు శంకర శాస్త్రి గారు కొనిచ్చిన ఎత్తు పీటలు ఉపయోగపడినవి! ముగ్గురు ముగ్గురు చొప్పున - చుట్టూ డిప్పలమర్చుకొని ఆర్గానిక్ వ్యర్ధాలు, గడ్డర్ లో వేసే గట్టి వస్తువులు, పలచని - గట్టి ప్లాస్టిక్ సామాన్లు, చిత్తు కాగితాలు, ఇంకా నాలుగైదుగా చెత్తను విభజించి - ఆయా డిప్పల్లో నింపడం ఈ విద్యాధికుల, గృహిణుల, ఉద్యోగుల, వృద్ధుల నిత్యకృత్యమైపోయింది 10 రోజులుగా.
ఐనా - స్పందించి, ఊరి సంక్షేమదాయక శ్రమదానానికి క్రొత్త వారి మద్దతు గాని, విసుగు చెంది, ప్రాత వారు నిరాశచెంది, తమ ప్రయత్న విరమణ గాని లేదు! ఒకరికి బాత్ రూమ్ లో కాలు బెణికి, ఒకాయన అమెరికా ఎగిరెళ్లి, ఇద్దరు శ్రీలంకలో ఉండి,.... ఇలా నేటి శ్రమదాతల సంఖ్య తగ్గింది!
క్రొత్తగా కార్యకర్తలు వచ్చి, చేరేందుకు ఇదేమన్న వీధులూడ్చే పని కాదు - 99 శాతం మంది బొత్తిగా ఇష్టపడిని – శ్మశానం దగ్గరి క్రుళ్లు చెత్త పని! నెల జీతానికైనా చాలినందరు ముందుకు రాక – మరో వంక గ్రామీణ భారతానికాదర్శ గ్రామంగా రూపొందే గడువు తక్కువగా ఉన్న పరిస్థితి!
ఇన్ని ప్రతికూలతల మధ్య ఒక్కటే ఆశాకిరణం - పదేళ్లుగా చల్లపల్లి ఔన్నత్యానికి కంకణం కట్టుకొన్న స్వచ్ఛ కార్యకర్తల అంతులేని ఆత్మ విశ్వాసం!
నేటి స్వచ్చోద్యమ నినాద ప్రదాత కాకలు తీరిన స్వచ్ఛ కార్యకర్త/రైతూ శ్రీమాన్ సజ్జా ప్రసాద్!
ఈ వారమంతా మనం కష్టించవలసినచోటు – చెత్త సంపద కేంద్రం వద్దే!
స్పందించని వారి కొరకు
ఎన్నాళ్ళని సొంతూరిని ఇంతగ సేవించగలరు!
వైయక్తిక బాధ్యతలను వాయిదాలు వేయగలరు!
వెగటు లేక - విసుగు లేక కసవులూడ్చు చుండగలరు!
స్పందించని వారి కొరకు శ్రమను సమర్పించగలరు!
- నల్లూరి రామారావు
20.02.2024