పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
స్వచ్ఛ సైన్యం ఊరి మెరుగుదల చర్య - @3037*
21-2-24-బుధవారం వేకువ 20+3 గ్గురి ప్రయత్నం సామాన్యమైందే మీ కాదు. వారు 3 కిలోమీటర్ల దూరాన్ని దాటుకొని4.20 కే చేరుకొన్నది చిల్లలవాగు ప్రక్క శ్మశానానంతర చెత్త కేంద్రానికి; చివరి ఐదారుగురు చెత్త పనులు ముగించింది 6.28 కి ; ఇళ్లకు చేరుకొన్నది 6.50 కి!
45 పని గంటలు వీళ్లు చలీ- మంచుల్లో, చేసిన ఉద్యోగాలేమంటే.
- 2 ట్రాక్టర్ల చెత్త గుట్టను సంపద వనరుగా మార్చడం!
- అందుగ్గాను ముగ్గురు వంతున ఆరేడు బృందాలుగా విడివడడం!
- మొదటి త్రిమూర్తులు కదిలిస్తే కంపు గొడుతున్న గుట్టను దంతెతో కుళ్ళగించి, డిప్పల కెత్తి, ఎత్తు పీటల మీద ఆసీనులైన వారి నడుమ పోస్తుండడం!
- చుట్టూ డిప్పలు పేర్చుకొని, సదరు వ్యర్థాల్ని ఏరి ఏడెనిమిది రకాలుగా విభజించడం సుఖాసీనుల వంతు!
- ఒక్కో రకాన్ని ఒక్కో భారీ గోనె సంచిలో నింపే పని ట్రస్టు సూపర్ వైజర్ ది!
- ఇంకో పెద్దాయన ఈ శ్రమ సన్నివేశాల్ని ఫోను కెమెరాలో బంధించడం!
- ఇలా విడగొట్టి, నింపిన భారీ సంచులు 50-60 సిద్ధంగా ఉన్నవి!
- రెండవ సేంద్రియ ఎరువు దిబ్బ పూర్తికావచ్చింది.
రేపు మళ్లీ వెల్లూరు శ్రీనివాసన్ గారు వస్తున్నారని తెలిసింది.
6.40 కి జరిగిన సమావేశంలో:
కస్తూరి విజయ్ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలిచ్చి, సర్పంచితో సహా 2 వారాలుగా కార్యకర్తల కష్టానికి బాధపడి, చెత్త సేకరణ దశలోనే వ్యాపారులు, గృహస్తులు విడగొట్టిన వ్యర్థాల్నందించవలసిన అవసరాన్ని మైకు ప్రచారంతో చాటించాలని సూచించగా,
కార్యకర్తల, పంచాయతీ కార్మికుల ముక్కు చిక్కాల నిమిత్తం షణ్ముఖ శ్రీనివాసుని 500/- విరాళం గ్రామ సర్పంచి స్వీకరించగా,
చర్చల తర్వాత రేపటి పని స్థలం కూడ ఈ డంపింగ్ యార్డు వద్దనే అనే నిర్ణయంతో నేటి కార్యక్రమం ముగిసింది!
వస్తు వినిమయ పాటవంతో
జనాభా విస్ఫోటనంతో- వస్తు వినిమయ పాటవంతో
సదవగాహన లేమితోనే సకల కాలుష్యాల భూతం
ఆపకుంటే జీవరాసులు అంతరించే పెను ప్రమాదం
అందుకే గద కార్యకర్తల అలవిమాలిన నిత్యయత్నం!
- నల్లూరి రామారావు
21.02.2024