పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా!
మూడు వేల నూట 20* వ నాటి వీధి శ్రమ!
తమ ఊరి మేలు కోసం ఈ బుధవారం (15-5-24) వేకువ జరిగిన వీధి పారిశుద్ధ్యం అక్షరాలా 24 మంది సాధించినది, 4.20 - 6.05 కాలపరిమితి కలది, ముఖ్యంగా 3 చోట్ల ప్రవర్థిల్లినది. ఎప్పటిలాగే 2 డజన్ల కార్యకర్తలకు సంతృప్తినిచ్చినది, మరియూ 2 వీధుల గుండా సొంత పనుల మీద వెళ్లే - వచ్చే 100 మందికి పట్టనిది!
మన జాతికి స్ఫూర్తిదాయకుడైన ఒకానొక మహాకవి ‘భిక్షు వర్షీయసి’ గేయంలో
“(దిక్కులేని) ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది.
ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగెతొండ...”
అనే కవితా పంక్తులు గుర్తురావా – తమ ఊరి వీధుల దుస్థితిని పట్టించుకోని కొందరు గ్రామస్తుల్ని చూస్తే? ఈ పాతిక ముప్పై – నలభై మంది శ్రమత్యాగమూర్తులుండబట్టి గాని - వేలాది కళావిహీన పల్లెల్లో చల్లపల్లీ ఒకటై పోయేదే!
ఈ పూట 3 చోట్లా శ్రమించిన సంగతులేవో చూద్దాం!
1) ఆదివారం లొంగని నారాయణరావు నగర్ - ప్రభుత్వాసుపత్రి కూడలి కశ్మలాల్ని తొలగించే పనిలో ఏకంగా డజను మంది వారం రోజుల పాటు జరిగిన డ్రైన్ల మరమ్మత్తునూ, రోడ్డు మార్జిన్ల ఎగుడు దిగుడు సవరణలనూ సాధించడం. ఇప్పుడొక్క మారు ఎవరు చూసినా శ్రమదాన ఫలితమేదో తెలుస్తుంది.
2) బెజవాడ రోడ్డులో పడమర వైపున నలుగురు కత్తులతో - దంతెలతో ప్రోగేసిన 3 వ్యర్ధాల గుట్టలు.
3) విద్యుత్ ఉపకేంద్రం దగ్గర బాగుపడిన డ్రైనూ, దాని గట్టూ సంస్కరించిన ఏడెనిమిది మంది కృషి! వీరిలో ముగ్గురు వికాసకేంద్రం దక్షిణపు రోడ్డు వైపూ వెళ్లారు.
సమీక్షా సమావేశంలో స్వచ్ఛ - సుందర గ్రామ సాధక నినాదాలు ప్రకటించిన వారు SBI మాజీ ఉన్నతోద్యోగి పృధ్వీశ్వరరావు!
హిందూ శ్మశాన వాటిక కోసం 4000/- విరాళ మిచ్చినవారు వేముల అర్జునరావు గారు! నేటి కష్టాన్ని గుర్తించి, కీర్తించినది డాక్టర్ DRK గారు!
రేపటి వేకువ మన పనులు 1) 6 వ నంబరు పంటకాల్వ వంతెన వద్ద, 2) బెజవాడ బాటలోని పెట్రోలు బంకు దగ్గర అని నిర్దేశింపబడినది!
అంకితులు మన చల్లపల్లికి – 92 & 93
అరుగో పల్నాటి వీర స్వచ్చోద్యమకారులు
వైద్య రంగమున శ్రమించు ఔద్యోగిక సోదరులు
భాస్కరుని, రాజబాబు స్వచ్ఛ – శుభ్ర సేవలు
ఋణగ్రస్తులగావించెను చల్లపల్లి ప్రజలను!
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
15.05.2024