3122* వ రోజు...........           17-May-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా!

నేటి శ్రమదానం 3122* వది!

            అనగా కేలండరు ప్రకారం 17-5-2024 నాటిది, గురువారం గుర్తు కలది, వాతావరణం సందేహాస్పదంగా ఉన్నా సరే - 4.18 కే శ్రీకారం చుట్టుకొన్నది. వాన దేవుడి ప్రతాపంతో కాస్తంత తడబడినది! అనిశ్చిత వర్షాగమనంలోనూ, అష్టాదశ స్వచ్ఛ కార్యకర్తల ప్రమేయం కలది!        

నిన్నటి నిర్ణయానుగుణంగా కార్యకర్తలాగినది పెట్రోలు బంకు వద్దనే గాని - వారు 2 ముఠాలుగా విడివడి పనిచేసినది మాత్రం

1) విజయా కాన్వెంట్ - ప్రభుత్వ ఆస్పత్రి వీధిలోనూ,

2) 6 వ నంబరు పంట కాలువ వంతెన వద్దనూ...

            రెండు చోట్లా వరుణుని దెబ్బకు ఆటంకాలు కలిగి, పనులనుకొన్నంతగా పూర్తి కాలేదు!

            మొదటి బృందం పని - గత 2 నాళ్ళ రకరకాల వ్యర్ధాల లోడింగు, వీధి రెండు డ్రైన్లలోని కొమ్మ - రెమ్మలూ, ఆకులలములూ, చెత్త - చెదారాలూ, ట్రాక్టరులోకెక్కించే  ప్రయత్నాన్ని 2 మార్లు వర్షం ఆటంక పరిచింది.

            రెండవ ముఠా గునపాలు, పారలు, డిప్పల్తో పంట కాలువ దగ్గర చేయాలనుకొన్నది ఏ ప్రభుత్వశాఖవారో త్రవ్వి వదిలేసిన గుంటల పూడిక, సాధించాలనుకొన్నది ఆ గుంటల్లో ఏ ద్విచక్ర వాహనాలో చీకట్లో పడిపోరాదనే సదాశయాన్ని! ఒక్క గుంట పూడ్చారో లేదో - భారీ వర్షానికి తొందరెక్కువయింది – మరో గుంట మిగిలిపోయింది!

            6.10 కి వాన కాస్త తెరపిచ్చింది - పెట్రోలు బంకు ఆవరణలో సజ్జా ప్రసాదు నాయకత్వంలో అందరూ ముమ్మారు స్వచ్ఛ సుందరోద్యమాన్ని నినాదాలుగా కీర్తించి,

            రేపటి వేకువ కూడ ఈ విజయవాడ బాటలోని బంకు వద్దనే కలిసి, ఆగిపోయిన పనుల్ని ప్రారంభించాలని నిర్ణయించారు!

       అంకితులు మన చల్లపల్లికి – 95

జర్నలిస్టు మహాశయుడు లీలాబ్రహ్మేంద్రుడు

చల్లపల్లి స్వచ్చోద్యమ శ్రమదాన మమేకుడు

ఉద్యమ ప్రతి దశలోనూ ఉన్నదతనిపాత్ర

సానుకూల పాత్రికేయ స్వచ్చోద్యమ యాత్ర!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త          

   17.05.2024