3124* వ రోజు...........           19-May-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా!

గ్రామ పారిశుద్ధ్య శ్రమవినోదం - @3124*

         ఆదివారం వేకువ సమయాన (19.5.24) 4.18 నుండి 6.06 దాక సదరు వినోదం 23+4 మందిది. సుమారు నెలనాళ్ల నుండీ ఆ సందడి విజయవాడ వీధిలోనే! ఐనా సుమారు 1 ½ కిలోమీటరు దాటని పరిస్థితే!

         ఈ పూట కూడ స్వచ్ఛ కార్యకర్తలు పెట్రోలు బంకు దగ్గరే ఆగారు, నిన్నటిలాగే రెండు బృందాలుగా విడిపోయారు, బృందాల మధ్య దూరం ½ కిలోమీటరు. ఎవరి వీధి మెరుగుదల ప్రయత్నం వారిది, గంటా ఏభై నిముషాల పిదప ఎవరి సంతృప్తి వారిది, అది ఇప్పటికీ కొందరు గ్రామస్తులు గ్రహించలేనిది!

         తొలి బృందం మళ్లీ తలపడింది NTR పార్కు దగ్గరి మురుగు అఘాతం వద్దనే, వాళ్ల చేతులు ధరించింది కత్తీ-దంతె అయుధాలనే, వాళ్ల తెల్లని బట్టలు పులుముకొన్నది కంపుగొట్టే చిక్కని - నల్లని మురుగు చుక్కలనే, తొలగించి, బైటకు లాగింది మురుగు నీటినడ్డుకొంటున్న పనికిరాని పిచ్చి - ముళ్ళ మొక్కలనే, పనికొస్తాయనిపించే మెట్టతామర పూల మొక్కలనే!

         ఇంకెవరికైనా “వీళ్ళొక తిక్కలోళ్లనో – మొండి వాళ్లనో” అనిపిస్తుందేమోగాని నా దృష్టిలో వీళ్ళే వీరాధివీరులూ, శూరులూ!

         మహిళలెక్కువగా ఉన్న 2 వ కార్యకర్తల గుంపు మళ్లీ గాంధీ స్మృతి వనం ఎదుటి వీధి భాగాన్ని పట్టుకొన్నది. వానలకి వీధి మార్జిన్ల మట్టి రోడ్డెక్కి, నదిలో ఉండాల్సిన ఇసుక దాంతో కలిసి, రోడ్డును మూసేస్తుంటే, తక్కిన గ్రామస్తుల్లా చూసి, సహించలేని బలహీనులు కదా – ఆ 60-70 గజాల బారునా – ముఖ్యంగా సిమెంటు గోడౌను వద్ద ఈ 13 మంది కష్టం చూసే తీరాలి! పారలతో చెక్కిన, గునపాలతో పొడిచిన ఫలితంగా ఎవరి గూళ్ళు పట్టుకుపోయాయో రేపు తెలియవచ్చు!

         ఇక లోడింగు బ్యాచ్ ఉంది - వాళ్ళు మరొకమారు – అపార్ట్మెంట్ల ప్రాంతం మొదలు పెట్రోలు బంకు దాక వ్యర్ధాల గుట్టల్ని ఎత్తి ట్రాక్టర్ లో చేర్చారు. వీధి గుంటలు పూడి, రోడ్డు విశాలంగా, శుభ్రంగా ఉన్నదంటే - అది ఈ 2 వ - మూడవ కార్యకర్తల బృందాల కష్టమే!

         తుది సమావేశంలో గోళ్ల వెంకటరత్నం 3 మార్లు నినదించిన స్వచ్చోద్యమ నినాదాలు! శేషు పాడిన (జొన్నవిత్తుల పేరడీ) “పిబరే చిన్నరసం” అనే గేయం విన్నారు కదా. మరి ‘సీతారామకళ్యాణం’ ప్రాత సినిమా గీతానికి నా అనుకరణనూ చిత్తగించండి :

“చల్లపల్లి శ్రమదాన విశేషం చూతము రారండి -

సంఘ చైతన్య స్ఫూర్తి వినోదం పొంది తిరిగి పొండి చల్లపల్లి

చూచు వారలకు వింత వింతగా – చేయువారలకు ప్రోత్సాహముగా

మైకు పాటలతో వీనుల విందుగ - మధ్య మధ్యలో చతురోక్తులతో చల్లపల్లి శ్రమ

మురుగు గుంటల గడ్డి లాగుతూ - ముళ్ళ పిచ్చి మొక్కలు తొలగిస్తూ

గృహిణులు - వైద్యులు - బడి పంతుళ్ళూ - పిన్నలు పెద్దలు వేకువ జామున

చల్లపల్లి శ్రమదాన విశేషం చూతము రారండీ

సంఘ చైతన్య స్ఫూర్తి వినోదం పొంది తిరిగి పొండీ

         (బుధవారం వేకువ మన పునః కలయిక NTR పార్కు దగ్గరనే)

      అంకితులు మన చల్లపల్లికి – 97

అంత అవకరం ఉన్నా అది కేవల భౌతికమే

తగిరిశ సాంబయ్య గారి ధైర్యం ప్రశంసార్హమే

అతి గొప్ప కళాశాల కధ్యక్షతతో బాటుగ

స్వచ్ఛ – సుందరోద్యమ సంబంధం స్తవనీయమే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   19.05.2024