3131* వ రోజు...........           26-May-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా!

      కార్యకర్తలకు 100 శాతం సంతృప్తి నిచ్చిన  శ్రమదానం @ 31-31*

అది ఆదివారం – 26 వ మే-2024 నాటిది; నిన్నటి నిర్ణయానుసారంగా బెజవాడ బాటలోని ప్రజాపరిషత్ కార్యాలయ భవనం ప్రాంతంలో  జరిగినది; చల్లపల్లిలోని 22 వార్డులకు గాను 3 ఊళ్ల నుండి 30 మంది ‘సామాజిక బాధ్యులు’ గా చెలామణి ఔతున్న చాదస్తులు పాల్గొన్నది; ½  కిలోమీటరు రహదారి మీద వాళ్ల చెమట చిందించినది.

          వేకువ 4. 15- 6.05 వేళకు పరిమితమైనదీ- సహృదయులకు స్ఫూర్తిదాయకమైనదీ!  బహుశా ఏ పొరుగూరి మనిషో గాని 60 ఏళ్లు దాటిన, వామపాదంలో లోపమున్న  ఒక జిజ్ఞాసి 10 నిముషాలు ఆగి, కార్యకర్తల వీధి శుభ్రతా కృషిని వాకబు చేసి, "అసలిలాంటి వేలాది రోజుల శ్రమదానం రాష్ట్రం- దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా! " అని ఆశ్చర్యపడినది ! (At the Same time - ఇప్పటికీ చల్లపల్లిలో కొందరసలు పట్టించుకోనిది కూడ!)

          నిన్నటిలా కాక - ప్రకృతి ఈ వేకువ శ్రమదాతలకు సహకరించింది. కాకపోతే ఉక్కపోత మాత్రం తప్పలేదు! పనిచేయకుండా అక్కడ టీ దుకాణం దగ్గర వేడి టీ తాగుతూ బాతాఖానీ వేస్తున్న ఇద్దరికే చెమటలు కారితే - నిచ్చెన్లెక్కి కొమ్మల్నరికే- చీపుళ్లతో వీధుల్ని తుడిచే,  పారల్తో రోడ్డు మార్జిన్లను చెక్కి డిప్పలకెత్తి ట్రాక్టర్ లో తరలించి వీధి గుంటల్ని పూడ్చే, NTR విగ్రహం దగ్గర దంతెల్తో  డ్రైన్ తుక్కును లాగే కార్యకర్తల సంగతి చెప్పేదేముంది?

          అసలీ అననుకూల ఉక్కపోత వేకువలో ZP పాఠశాల దగ్గర చెట్లను సుందరీకరించే పన్లూ, నిన్న బాగుచేసినచోటే మళ్లీ తుక్కులు ప్రత్యక్ష మైతే ఓపిగ్గా ఏరుకొచ్చే చౌకబారు(?) చేష్టలూ, బస్ షెల్టరు ఇరుకు సందులో దూరి గోనె సంచినిండా దిక్కుమాలిన చెత్తా చెదారాల్ని లాక్కొచ్చే వింతలూ- పైగా ఇవన్నీ చేస్తూ సంతోషించడాలు చల్లపల్లిలో కాక ఎక్కడ కనిపిస్తవి?

          ఈ మధ్య కొన్నిమార్లు 20 మందే వస్తున్నట్లు కాక ఈ రోజు 30 మంది శ్రమదానమూ, పనివేళ ప్రేలే జోకులూ - 2 గంటల కార్యక్రమం వీరెవరి సొంతానికీ కాక-గ్రామానికంకితం కావడమూ - నాకైతే ఇవన్నీ విశేషాలే!

        మండల పాలనా భవనం దగ్గర 15 నిముషాల సమావేశంలో

1) నందేటి వాని త్రిగుణాత్మక నినాదాలు కాక,

2)DRK గారి సమీక్షా ప్రసంగం కాక,

3)  శేషు గాయకుని పేరడీ పాట కాస్త సరదాగా ఉన్నా - కొందరికి కాస్త అనుచితం అనిపించింది.

బుధవారం వేకువ కూడ మన పరస్పరాభివాదాలు మండల పరిషత్ కార్యాలయం వద్దనే!

    అంకితులు మన చల్లపల్లికి 104

ఎవ్వరీ స్వచ్ఛోద్యమానికి వెన్నుదన్నుగ నిలిచినారో

ఆదివారం పుస్తకంతో ఆంధ్రజాతిని కుదిపినారో

మూలతత్వం తెలిసి జగతికి ముందుగా చాటించినారో

అట్టి వీ.వీ. సుబ్బారావును అందరం గుర్తుంచుకొందాం !

- నల్లూరి రామారావు

26.05.2024