3132* వ రోజు....... ....           27-May-2024

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

3132* వ నాటి రెస్క్యూ శ్రమదానం!

         సోమవారం కదా – ఆ పూట వీధి శ్రమదానం మీద హక్కు గ్రామ భద్రతా దళానిది కదా - అందువల్ల - ఒక రెస్క్యూ వీరుడి మోకాళ్లు అరిగిపోయి కదలకపోగా, మరొక విశ్రాంతోద్యోగి వైద్య పరీక్షార్ధం బాగ్య నగరానికి చేరుకోగా ముగ్గురు మాత్రం 4.22 వేకువ సమయాన గస్తీ గది వద్ద కున్నూ, ఏడెనిమిది నిముషాల్లో 3 కిలోమీటర్ల  దూరాన శివరామపురం దగ్గరికిన్నీ చేరుకొన్నారు.

         అక్కడ మరొక గట్టి పార్ట్ టైమ్ స్వచ్చ కార్యకర్త నిప్పుకు గాలిలాగా తోడయ్యాడు. వీళ్ళలో ఎవరెప్పుడు పసిగట్టారో గాని – క్రొత్త శివరాంపురారంభంలో ఒక పాడైపోయిన భారీ కాంక్రీటు విద్యుత్ స్తంభం పడి ఉండడాన్నీ - ఎవ్వరూ పట్టించుకోక పోవడాన్ని కనుగొన్నారు.

         ఎందుకూ పనికిరావనుకొన్న - రహదారి ప్రక్కన అడ్డదిడ్డంగా పడున్న ఇలాంటి డజన్ల కొద్దీ ఎక్కడెక్కడి ఇనుప, సిమెంటు స్తంభాల్ని గతంలో రోడ్ల మార్జిన్ల భద్రతకూ, పొందికకూ ఉపయోగించిన అనుభవం ఈ రెస్క్యూ టీమ్ వాళ్లది!

         వాళ్లు నలుగురే కావచ్చు – అది టన్నున్నర బరువైన స్తంభమే కావచ్చు – ½ గంటలో కావలసిన పని 2 గంటలు పట్టొచ్చుగాక – సడలని పట్టుదలతో దాన్ని ట్రాక్టరు సాయంతో గంగులవారిపాలెం – బండ్రేవుకోడు వంతెన దగ్గరకు చేర్చడమూ, రోడ్డువార సర్దడమూ చేయగలిగారు.

         వీళ్ల శ్రమదమల్ని చూస్తుంటే 30 ఏళ్ళ నాటి కేతు విశ్వనాథరెడ్డి నవల “అతడు అడవిని జయించాడు” అనే నవల గుర్తొస్తున్నది!

         శంకర శాస్త్రి గారి శ్రమదానోద్యమ ముక్తాయింపు నినాదాలతో నేటి శ్రమదానం ముగిసింది.

    అంకితులు మన చల్లపల్లికి – 105

‘సిటికేబుల్’ సహకారంతో ఆ కళ్లేపల్లి చంద్ర

అంతులేని మద్దత్తును అంది పుచ్చుకొన్నది

చారిత్రక శ్రమదానపు ప్రతి వేడుకలో ఉండే

అతని జ్ఞాపకాలిప్పుడు అందమైన స్మృతులే!

- నల్లూరి రామారావు

 

   27.05.2024