పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?
శ్రమదానంలో ఇది 3133* వ విజయం!
మంగళవారం నాటి సదరు విజయగాథ 4+3 మంది స్వచ్ఛ కార్యకర్తలది; వేకువ 4.20 నుండి 6.35 దాక సంఘటిల్లినది; గంగులవారిపాలెం వీధి, పెదకళ్ళేపల్లి బాట, బందరు జాతీయ రహదార్లకు విస్తరించినది; పని చిన్నదిగా అనిపించినా 2 గంటలకు పైగా రెస్క్యూ దళం వారి చెమటలు ధారలుగా కార్చినది!
శ్రమ విలువ తెలియని ఎవరికైనా –
“2 కాంక్రీటు కరెంటు స్తంభాలను కిలోమీటర్ల కొద్దీ దూరం నుండి తరలించారు” అనీ,
“గంగులవారిపాలెం వీధిలో బండ్రేవుకోడు మురుక్కాల్వ రోడ్డుకు వాటితో భద్రత కల్పించారు” అనీ –
‘కట్టె – కొట్టె – తెచ్చే’ శైలిలో వ్రాస్తే ఏమర్ధమవుతుంది?
స్వచ్ఛ - కారకర్తల సుదీర్ఘ దశాబ్దకాల ప్రయత్నం ఆంతర్యం తెలియాలన్నా, నిస్వార్ధ శ్రమజీవన సౌందర్య సాక్షాత్కారం కావాలన్నా,
ప్రతి చల్లపల్లి పౌరుడూ అన్ని రోజులు కాకున్నా అప్పుడప్పుడైనా స్వచ్ఛంద శ్రమదానంలో పాల్గొనాలి, కార్యకర్తల్తో సహానుభూతి చెందాలి!
సాగర్ ఆక్వా పరిశ్రమ దగ్గర ఎప్పుడో పడిపోయి, నేలలో - చెట్ల ఆకుల్లో పూడిపోయిన – ఏ శాఖకూ పట్టని - ఒక భారీ కాంక్రీటు స్తంభాన్ని పిలక పట్టుకొని 1 ½ కిలోమీటరు లాక్కుపోవడాన్ని,
జాతీయ రహదారి ప్రక్కన అనాథగా పడున్న అంతే భారీ స్తంభాన్ని 5 గురు కార్యకర్తలు బలాత్కరించి, గంగులవారిపాలెం వీధిలోకి చేర్చి, అమర్చడాన్నీ –
అప్పటి కార్తకర్తల బలప్రయోగాన్నీ - గడ్డపారలు వంగిపోవడాన్ని నేను స్వయంగా చూసి – పాల్గొనబట్టి కొంతైనా తెలిసింది!
ఆ పని స్తలంలోనే 3133* వ నాటి బ్యానర్ సాక్షిగా తూములూరి లక్ష్మణ నామధేయ కార్యకర్త నినదిస్తున్న చిత్రాన్ని గమనించండి!
ఇక - బుధవారం వేకువ మన రెగ్యులర్ శ్రమదానానికి నాందిగా అందరం కలువదగిన చోటు మండల ప్రజాపరిషత్ కార్యాలయమే!
అంకితులు మన చల్లపల్లికి – 106
పరిశ్రమనే నడుపుతాడా – గ్రామ వీధులనూడ్చుతాడా –
స్వచ్ఛ సుందర కార్యకర్తా – ఊరి కోసం ప్రముఖ దాతా?
మొత్తానికి కోటీశ్వరుండే - వంశనామం గుత్తికొండే
విపుల సంస్కరణాభిమానే - విజయలక్ష్మీ సమేతుండే!
- నల్లూరి రామారావు
28.05.2024