3135* వ రోజు....... ....           30-May-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

గ్రాఫ్ పెంచుకొన్న 3135* వ నాటి శ్రమదానం!

         శని - ఆదివారాలు కాకున్నా, 30.5.24 (గురువారం) వేకువ ఎందుకోగాని గ్రాఫ్ 27 కు పెరిగింది. ప్రాత వాళ్లలో ఇద్దరూ, బొత్తిగా క్రొత్త వాళ్ళిద్దరూ శ్రమదాతల సంఖ్యా బలం పెంచారు, తెల్లారే కొద్దీ వీధి పారిశుద్ధ్యం పనులు ఊపందుకొన్నాయి, బెజవాడ వీధిలో HDFC బ్యాంకు మొదలు జాతిపిత స్మృతి వనం దాక అర కిలోమీటరు దాక సామాజిక కర్తవ్య క్రీడ కళకళలాడింది!

         బ్యాంకు ఆవరణలో 4.16 కు కనిపించింది 9 మంది కార్యకర్తలే గాని, ఒక్కో నిముషం గడిచేకొద్దీ ఆ బలగం ఒక దశలో 27 కు ప్రాకింది. పని వేళ 6.05 దాక, పని చోట్లు ఆ రహదారిలోనే 3 - గాంధీ స్మృతి వనం, NTR పార్కు, రెవిన్యూ కార్యాలయాలు.

         HDFC బ్యాంకు ఆవరణా, వెలుపరి చిరు ఉద్యానమూ, ఎదుటి - ప్రక్క రోడ్లూ తెల్లారే పాటికి చేసేదిలేక రకరకాల తుక్కులూ - దుమ్మూ ధూళీ వదిలించుకొన్నాయి! చెట్ల కొమ్మలు తీరుగా కనిపిస్తున్నాయి. అక్కడొక వయస్సు మళ్లిన ఉపాధ్యాయోద్యోగీ విశ్రాంత చెక్ పోస్టు బాధ్యుడూ ఉండడంతో ఉన్న కార్యకర్తల్ని మించి సందడి కనిపించింది. క్రొత్తగా శ్రమదానంలో చేరిన ఉపాధ్యాయునికీ, సచివాలయోద్యోగికీ మంచి కాలక్షేపమన్న మాట!

         NTR పార్కు దగ్గర మురుగు కాల్వ దగ్గర పని పూర్తయినట్లే ఉన్నది. అక్కడ మిగిలిన ఒకే చెట్టుకు ఇద్దరు ప్రసాదులు నున్నగా క్రాపు వేశారు!

         ఇక మిగిలిన వాలంటీర్లు అంతకుముందేం చేశారో గాని - నేను చూసేప్పటికి గాంధీ విగ్రహావరణలో పనులు చేస్తున్నారు. తరువాత డంపింగ్ యార్డుకు వెళ్లారని తెలిసింది.

         40 నాళ్ళకు పైగా నెమ్మదిగా సాగిన వీధి పారిశుద్ధ్యం

         రేపటి నుండి వేగవంతమవుతుందని ఒకాయన అంటే విన్నాను.

6.20 కి జరిగిన సమీక్షా - కబుర్ల మీటింగులో :

1) శివబాబు గారు నినదించిన స్వచ్చ- సుందరోద్యమాశయాలూ,

2) అతనివే గాక – గురవయ్య గారి సూక్తులూ,

3) SBI మాజీ ఉద్యోగి పృథ్వీశ్వరరావు గారి శ్రీ శ్రీ - ఘంటశాలల “నా హృదయంలో నిదురించే చెలీ” సినీ గీతమూ,

         రేపటి వేకువ కూడా మన తొలి గమ్యం HDFC బ్యాంకు అవరణే అనే నిర్ణయమూ.....

        యదార్థ సంఘటనమె

గాలి మేడ కట్టడమో - గాలిని ప్రోగేయడమో

కనికట్టులు చేయడమో – గ్రాఫిక్కులు చూపడమో

కాదయ్యా! చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం

చెమటలు క్రక్కే యదార్థ సంఘటనమె ప్రతినిత్యం!

- నల్లూరి రామారావు

   30.05.2024