3138* వ రోజు....... ....           02-Jun-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

                      3138 *వ నాటి వరుస సందడులు!

ఈ ఆదివారం(2.6.24) వేకువ 4.18 కే వాటిని ప్రారంభించిన  కార్యకర్తలు 13 మంది. మరో 23 మంది కాలక్రమాన శ్రమ జీవన స్రవంతిలో కలిశారు. ఈ సందళ్ళ వేదిక విజయవాటిక బాటలోని శ్రీమంతుల క్లబ్బు ప్రాంతం. 6.00 దాక - ఓ ప్రక్క మైకు నుండి ఉత్సాహకర – ప్రోత్సాహకర గీతాలూ, పార పనుల గరగరలూ, అక్కర్లేని పిచ్చి చెట్లను నరుకుతున్న కత్తి విసుర్లూ, వ్యర్ధాలను గుట్టలుగా పేరుస్తున్న దంతెల చప్పుళ్లూ రోడ్లూడుస్తున్నచీపుళ్ల గురగురలూ... ఇవే ఆ సందళ్లు!

         తాగితందనాలాటలూ, రచ్చబండల వద్ద గంటల గంటల ఎన్నికల వాదోపవాదాలూ, గెలుపోటముల జూదాలూ..... ఈతరహా సందళ్ళక్కడ ఉండవు.  కులాల కుంపట్లు వెలిగించే, మతోద్రేకాలు తెచ్చుకొనే తీరిక స్వచ్చ కార్యకర్తలకు లేదు.

         వేకువ ఏ 3 ½ కో లేవడం, ముందురోజు నిర్దేశించుకొన్న వీధి పారిశుద్ధ్యం కోసం 4.30 కు ముందే చేరుకోవడం, ఊరి కోసం తమ వంతు బాధ్యత తీర్చుకోవడం, శారీరకంగా అలసిపోతున్నా  మానసికంగా ఉత్తేజితులు కావడం, గంటన్నర తర్వాత కాఫీలతో - నేటి తమ కృషిని గూర్చిన శ్రమ ముచట్లతో గడపడం, అందరూ సమైక్య కంఠంతో  తమ సుదీర్ఘ శ్రమదానోద్యమ సంకల్పాన్ని నినదించడం ఈ స్వచ్చ కార్యకర్తల దైనంనందిన  - సదభ్యాసం.  

         "ఎవరూ వ్రేలెత్తి చూపజాలని ఈ సాత్త్విక సామాజిక ప్రయోగం చల్లపల్లి అదృష్టం! ఈ వేకువ సమయాన:

- పాడు బడిన త్రుప్పు  మోటార్ల - కంపుగొడుతున్న మురుగుకాల్వల మధ్య దీక్షగా శుభ్ర పరుస్తున్న RTC డ్రైవర్ గారిని చూసినా,

- క్లబ్బు తూర్పు, ఉత్తర మినీ ఉద్యానాల్లో చొరబడి, కష్టపడుతున్న టీచర్లను, రైతుల్ని గమనించినా,

- దండమూడి కస్తూరి మామ్మగారి ఉద్యానాన్నీ, దాని వెనక డ్రైన్ నూ శుభ్ర- సుందరీకరించిన డాక్టరమ్మ, సర్సమ్మల్ని పరిశీలించినా,

- రోడ్డు మార్జిన్ల గుంటల్ని పూడుస్తున్న 5 గురి ప్రయత్నాన్ని పరికించినా,

సామాజిక కర్తవ్యమంటే ఏమిటో- ఎందుకో తెలిసొస్తుంది!

రేపో- మాపో  అమర గాయక బాల సుబ్రహ్మణ్యుని జన్మదినమట – అందుగ్గాను ఒక విలక్షణ RMP - శేషు కార్యకర్తలకు బిస్కట్లునూ, దైనందిన కాఫీ ఖర్చుల 500/- విరాళాన్ని "శివరంజనీ ! నవరాగిణీ ! "పాటనూ అందించగా- కందిమళ్ల వెంకటేశ్వరరావు గారు మరొక 500/-, పల్నాటి భాస్కరుల వారు 2000/- నూ అందించారు!  

         ఈ ఆదివారం కార్యకర్తల శ్రమను మరపిస్తూ, పృధ్వీశ్వర రావు గారి శ్రావ్యమైన గీతం కూడా వినిపించింది.

         త్వరలో అమెరికా వెళుతున్న గోళ్ల వెంకటరత్నం గారు గట్టిగా నినాదాలను పలికించారు.

మన బుధవారం నాటి పని పాటులు బెజవాడ వీధిలోని శివాలయం వద్ద ప్రారంభమగునని ఇందుమూలంగా తెలియజేయడమైనది!

            అందరికి ఆదర్శ పురుషులు !

ఎవరు ఊరును మార్చి వేసిరొ వీధులెవ్వరు శుభ్రపరచిరొ

 ఎండనక వాననక ఎవ్వరు మురుగుకాల్వలు బాగు పరచిరొ

పర్యావరణం కొరకు ఎవ్వరు పెంచుచుండిరొ వేల చెట్లను

ఆ మహోన్నత కార్యకర్తలె అందరికి ఆదర్శ పురుషులు !

- నల్లూరి రామారావు

   02.06.2024