3140* వ రోజు....... ....           04-Jun-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

3140* రెస్క్యూ శ్రమల్ని చిత్తగించండి!

          మంగళవారం శుభోదయాత్పూర్వమే 4:20 కే (తేదీ పుకారంగా 4.6.24) నలుగురు బందరు రోడ్డు ప్రక్కన గంగులవారిపాలెం వీరి గస్తీ గది దగ్గర - ఏకరూప దుస్తుల్లో ఎందుకు నిలబడి ఉన్నారో ఆలోచించండి! ఆ తరువాత ఇంకా ఇద్దరు వత్తాసుగాళ్లం వాళ్లతో చేరామనుకోండి!

          ఇక ఆపైన జరిగిన గ్రామ ప్రయోజనాత్మక శ్రమదానం విశేషాలు వినండి!

- బందరు రహదారికి ఉత్తరాన జలశుద్ధియంత్ర గృహం తూర్పున - పెద్ద మట్టిగుట్ట ఫొటోలో కన్పిస్తున్నదా? దాని పనే ఈ వేకువ ఈ 4+1 కార్యకర్తలు పూర్తి చేసింది.

          మీరెవరైనా ఈ రోజుల్లో - అనగా ఎన్నికల జాతర సమయంలో ఆ మన్ను దిబ్బను అక్కడికి దూరంగా ఉన్న పూలమొక్కల పాదుల్లో సర్దడానికెంత కూలి ఔతుందో వాకబు చేయండి వాళ్ల మూడ్ నుబట్టి - 7/8/10 వేల దాకా అడిగితే ఆశ్చర్యపోకండి!

          సరే - డబ్బు ఖర్చులా ఉంచి - ఈ నలుగురు కార్యకర్తలు శ్రద్ధతో చేసినట్లు చేస్తారో లేదో పోల్చండి!

          - గంటన్నర సమయంలో సదరు మట్టిమిట్ట నెత్తాలనగానే వీళ్లు బెదర లేదు పూర్వం NTR అనే మొండి బండ పని రాక్షసుడు వేకువ వ్యాయామంలో ఇలాంటి పనులు చేశాడట! అది 5060  ఏళ్ల నాటి సంగతి ఇప్పుడు తమ కోసం కాక ఊరి అహ్లాద భద్రతల కోసం అలాంటి బరువు పని ప్రత్యక్షంగా చూశాను!

          6.00 తర్వాత ఆ కార్యకర్తల బట్టలు చెమటతో నాని ఉండడాన్నీ, అలసటతో మఖాలు వ్రేలాడడాన్ని గమనించాను!

          నాలుగైదార్రోజుల్నుండి శ్రమదాన దూరుడైన BSNL నరసింహ దివ్యనామధేయుడు పలికిన స్వచ్చ సుందరోద్యమ నినాదాలతో నేటి సార్ధక శ్రమదానం ముగిసింది.

          రేపటి వేకువ మన గమ్య స్ధానం బెజవాడ రోడ్డులోని శివాలయం పరిసరాలే!

          స్వార్ధ క్రీడలుండ విచట!

ఇది శ్రమదానం పోకడ ఇది సామాజిక బాధ్యత

ఊరికొరకు తయారైన నిత్య శ్రామికులు వీరు

సామూహిక హితం తప్ప - స్వార్ధ క్రీడలుండ విచట

అందుకె ఇది చల్లపల్లి స్వచ్ఛోద్యమ ఘనచరిత్ర!

- నల్లూరి రామారావు

   04.06.2024