3141* వ రోజు....... ....           05-Jun-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

సుదీర్ఘ స్వచ్ఛ– సుందరోద్యమంలో 3141* వ రోజు!

          బుధవారం (5-6-24) వేకువలో ముందుగా 11 మంది ఉనికి 4:15 కే! వీరి సేవలందుకొన్న గ్రామ భాగం బెజవాడ మార్గంలోని శివాలయం మొదలు ప్రాత ఇండియన్ బ్యాంకు దాక! వీధి పారిశుద్ధ్య సాధకుల లెక్క చివరకు 28 గా తేలింది.

          ప్రస్తుతానికైతే ఖడ్గధారులకూ, వీధి వృక్ష సుందరీకర్తలకూ, పెద్దగా పని లేదు. చీపుళ్లే ఎక్కువ మందికి హస్త భూషణాలుగా మారినవి. లోడింగు వేళలో మాత్రం డిప్పల అవసరం పడింది.

          ఒక వరుస క్రమంలో నేటి 200 గజాల గ్రామ భాగ స్వచ్ఛ శుభ్ర చర్యల్ని చెప్పాలిసొస్తే:

1) 40-50 గజాల రోడ్డు మీద మందంగా పేరుకుపోయిన ఇసుక-దుమ్ము మిశ్రమాలను ఊడ్చి, పారలతో చెక్కి, ప్రోగులు పెట్టి, ట్రాక్టర్ లో నింపుకొని, వీధి మార్జిన్ గుంటలు పూడ్చడమే మొదటిది - దీని వల్ల మితిమీరిన ద్విచక్ర వేగవంతులు పడిపోయే ప్రమాదమూ తప్పింది, ఎదురు పడ్డ వాహనాలు తప్పుకోగల సౌకర్యమూ కల్గింది.

2) అసలు దేవాలయమూ - పరిసరమూ ఎంత స్వచ్ఛ – శుభ్ర - సుందరంగా ఉండి, ఆధ్యాత్మిక ప్రశాంతత కల్గించాలి? మరి ఈ పురాతన ప్రముఖ శివాలయమూ, ప్రక్కన చెరువూ, ఎదుటి దుకాణాలూ అట్లున్నవా?

          10 మంది కార్యకర్తల కృషితో తెల్లారేసరికి అవెంత ఆహ్లాదమయంగా ఉన్నదీ గమనించండి.

3) పాల విక్రయ కేంద్ర పరిసరాలూ, మూతబడిన కోట గోడ దుకాణాల దుస్థితీ ఈ ఏడెనిమిది మంది గంటకు పైగా శ్రమిస్తేనే గదా బాగుపడింది?

          అందుకే గదా దశాబ్ద కాలంగా మనం “నిస్వార్ధ శ్రమయేవ జయతే” అని నమ్మేది!

          6.20 వేళ - కాఫీల సేవనానంతర సమీక్షా సమావేశంలో స్వగ్రామ స్వచ్ఛ - సుందరీకరణ ప్రతిజ్ఞ వినిపించినవారు - వేముల షణ్ముఖ శ్రీనివాసులవారు; ‘ప్రభుత్యాల మార్పిడితో సంబంధం లేకుండ మన సామాజిక  బాధ్యత మనదే’ నని గుర్తు చేసిన వారు DRK వైద్యుల వారు;

          ఐతే - బెజవాడ రోడ్డు మీద జరిగిన ఈ 10 నిముషాల సభకు నేపథ్యంగా ఉన్న క్రొంగొత్త ‘వీడుకోలు వాహనాన్ని గమనించారా? నాలుగైదు లక్షల ఖరీదు చేసే ఈ తుదియాత్రా రధం మీద అన్నపురెడ్డి రాజ్యలక్ష్మి, సత్యనారాయణల పేర్లేమిటంటే – తన జననీ జనకుల స్మృత్యర్ధం చల్లపల్లి ప్రాంత జనములకు Dr. A.V. గురవారెడ్డి వితరణన్న మాట!

          రేపటి వేకువ మన శ్రమదానం ‘విజయ’ పాల దుకాణం నుండి అని తెలిసింది!

              స్వచ్ఛ కర్మల నిత్య సందడి

రమారమిగా తొమ్మిదేళ్లట శ్రమ త్యాగం మొదలు కాబడి

సుమారుగ ఒక దశాబ్దంగా స్వచ్ఛ కర్మల నిత్య సందడి

గ్రామ మందలి మార్పు కన్నా గ్రామ పౌరుల మార్పు చిన్నది

స్వచ్ఛ సైనిక సంఖ్య కన్నా స్వచ్ఛ కర్మల వాసి దొడ్డది!    

- నల్లూరి రామారావు

   05.06.2024