3142* వ రోజు...........           07-Jun-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

మరొక స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణ విజయగాథ - @3142*

          ఆ గాథ శుక్రవారం – 7.6.2024 నాటి వేకువ సమయానిది - ఆ కథా రచయిత్రులూ, రచయితలూ 26 మందే కావచ్చు – అందులో 9 మంది మరీ 4:15 కే అగ్రహారం వీధి - బెజవాడ రహదారి కూడలి దగ్గర జాలీగా కనిపించవచ్చు - మరికాస్త వ్యవధిలో పొరుగూరి కార్యకర్తలు కూడ వారితో కలవడమూ, చేతొడుగులతో బాటు పారలూ, డిప్పలూ, చీపుళ్లూ ధరించి వీధి పారిశుద్ధ్య పనికి దిగడమూ మామూలే!

          మరి ఈ విద్యాధికులూ, ప్రస్తుత - మాజీ ఉద్యోగులూ, రైతులూ, గృహిణులూ పూనుకొని 6:05 దాక చేసిన పనులేమి? నెలకొల్పిన ప్రమాణాలేమి? సుఖంగా ఇంటి వద్ద పరుండక ఈ మురుగు గుంటలపూడికలెందుకు? రకరకాల చెత్త నుండి, దుమ్ము నుండి, ప్లాస్టిక్ ఛండాలాల నుండి 200 గజాల గ్రామ వీధి విముక్తులేల?

          మీడియా అంతా తమ మీద ఫోకస్ పెట్టాలనీ, జాతీయంగా తమ పేర్లు మారుమ్రోగాలనీ ఈ స్వచ్ఛ కార్యకర్తలాసిస్తే గదా,

          ఈ సుదీర్ఘ స్వచ్ఛ - సుందర - శ్రమదానోద్యమాన్నడ్డం పెట్టుకొని స్వార్ధ ప్రయోజనాలాసిస్తే గదా,

          5000 గృహస్తుల్లో చాల మంది తమకు సహకరించనందుకు నిరాశ చెందితే గదా - వీళ్లు కాడి దించేది?

          ప్రాత ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు భవనాల దగ్గరి  ఉచ్చకంపుల్లోనూ, కొన్ని మూతబడిన దుకాణాల తుక్కుల్లోనూ, నిన్నటి వానకు నిండిన దోమల నీటి గుంటల్లోనూ, తడీ - పొడీ రోడ్ల మీది - వీధి మార్జిన్లకతుక్కొన్న ఇసుకా - మట్టీ ఆకులలముల్ని ఊడుస్తూనూ, స్వచ్ఛ కార్యకర్తల శ్రమ విన్యాసాలెట్టివో - ఆ పనుల్లో వాళ్ల సంతృప్త వదనాలెందుకో ఎన్ని పేజీలైనా వ్రాయవచ్చు!

          శ్రమ వితరణ సంగతలా ఉంచి, నగదు - వస్తువితరణల సంగతికొస్తే - 6.25 సమయంలో - బృందావనుడి ప్రతిజ్ఞా నినాదాల కాలంలో -

1) అమెరికా ప్రవాసి – నాదెళ్ల సురేష్ పంపిణీ చేయించిన పెద్ద మామిడి పళ్ళూ,

2) హన్సికా చౌదరి పాలకేంద్రం తరపున వేమూరి బాలాజీ గారి నాణ్యమైన బిస్కట్లూ  

3) షణ్ముఖ శ్రీనివాసుల వారి 500/- నగదూ కొన్ని ముఖ్య విశేషాలు!

          నిన్నటి వలె కాక – నేటి పనులు ముగిసేదాక సహనం వహించిన వర్ష పురుషునికి కృతజ్ఞతలు!

          రేపటి వేకువ కూడ మనం కలువదగింది 3 రోడ్ల ముఖ్య కూడలి వద్దనే కాని – వర్షాన్ని బట్టి మార్పు ఉంటే మన వాట్సప్ చూసుకోగలరు!

          చెమట చుక్కలు క్రక్కవలె గద!

సామవేదం వల్లెవేసిన – జనగణలుఎన్నేళ్లు పాడిన

ఉత్సవాలను నిర్వహించిన - ఉపన్యాసాలెన్ని దంచిన

కార్యరంగంలోన నిలబడు కార్యకర్తలు కావలెను గద!

బొట్టు బొట్టుగ ఊరి కోసం చెమట చుక్కలు క్రక్కవలె గద!

- నల్లూరి రామారావు

   07.06.2024