3143* వ రోజు....... ....           08-Jun-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

25+1+2 మంది వీధి పారిశుద్ధ్యం - @3143*

          శనివారం - 8.6.24 వేకువ సమయపు సదరు గ్రామ పారిశుద్ధ్య ప్రయత్నం చిన్నా - చితకా రకం కాదు; పై సంఖ్యలో +1 అంటే నేటి కొంగ్రొత్త కార్యకర్త రిటైర్డ్ ఇంజనీర్ అంబటి శంకరరావు+2 అనగా కళాకారుడు బోలెం రామారావు, వారి శ్రీమతి నాగమణి వీళ్లిద్దరి రాక కారణం జూన్11, 12 తేదీల్లో NTR పార్కులో జరిగే వివిధ కళారూపాల ప్రదర్శనకు స్వచ్ఛ కార్యకర్తలకు సగౌరవాహ్వానం!

          ఇంతకీ 25+1 కార్యకర్తలు వేకువ 4.20 - 6.05 నడుమ చేసిన ఘనకార్యములేవంటే - చూపిన వీధి సమస్యల పరిష్కారములేవంటే – పదేళ్ల శ్రమదానం ఒరవడి కాయా - పండా అంటే:

- అటు ప్రాత ఇండియన్ బ్యాంకు దాక, ఇటు బందరు వీధి పెట్రోలు బంకు పర్యంతం, మూడో వీధిగా నాగాయలంక వైపు మరొక ఇంధన నిలయం మేర - 3 బజార్లు బాగుపడడం,

- బట్టల దుకాణాల - అపోలో ఫార్మసీల దగ్గరి పూడిపోయిన పిల్ల మురుగు కాల్వ పూడిక తొలగి, రాబోయే వాన నీటి పరుగులకనుకూలించడం,

- రోడ్డు మార్జిన్ల దుమ్మూ – ధూళీ - ఇసుకా ఆరేడుగురి పారల, గోకుడు పారలతో వదలిపోయి ఆ ప్రోగులు ట్రాక్టర్లోకి చేరి, వేరొక చోట మార్జిన్ల గుంటల పూడికకై తరలిపోవడం,

- స్వీట్ షాపుల, శీతల పానీయాల, పచారీ కొట్ల ఎదుటి వ్యర్ధాలు అదృశ్యమై వీధి సౌందర్యం ఇనుమడించడం,

- ఇక ఎప్పటిలాగే తమ కనీస సామాజిక కర్తవ్య పరిపూర్తి పట్ల పాతిక మంది కార్యకర్తలూ సంతృప్తి చెందడం,

- ఆడపాదడపా - ముఖ్యంగా ఆదివారాల పాక్షిక సమయ కార్యకర్త తోట నాగేశ్వర్రావు, బస్ కండక్టరూ బస్ దిగి మరీ కార్యకర్తలకు సంఘీభావం తెలపడం

- ఏ కార్యకర్త ముఖంలోకి చూసినా – “ఏదో మొగమాటానికో – మొక్కుబడికో వచ్చినట్లు” గాక – అదేదో తమ విద్యుక్త ధర్మమన్నంతగా మురికి - దుమ్ము పనులు చేసుకుపోవడం.......

          - ఇవన్నీ శనివారం నాటి విశేషాలే మరి!

          ఇవి గాక, నిన్నటి షణ్ముఖుల వారి విరాళం గాక,

          ప్రాతూరి శంకర శాస్త్రి గారి 5,000/- వితరణ మరొక విశేషం    

          రేపటి వేకువ సైతం మన బాధ్యతా నిర్వహణా స్ధలం నాగాయలంక రోడ్డుకు చెందిన పెట్రోలు బంకు ప్రాంతమే!

          మన గ్రామ శ్రమదానోద్యమం..

సుస్వరముగ – శుభకరముగ – సుందరముగ - హాసముగా

జాగృతముగ - సృజనముగా – సహర్షముగ - వింతగా

వినూత్నముగ - వివేచనగ - ప్రమోదముగ - ప్రజ్ఞగా

సమాజ ప్రయోగశాలగ - తొమ్మిదేళ్ల అద్భుతముగ.....!

- నల్లూరి రామారావు

   08.06.2024

ప్రాతూరి శంకర శాస్త్రి గారి 5,000/- వితరణ