3144* వ రోజు....... ....           09-Jun-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

ఆదివారం ప్రభావంతో 33 మంది వీధి సేవలు - @3144*

          పై 2 అంకెలూ చాలు – చల్లపల్లి శ్రమదానం తాననుకొన్నది సాధించడానికి ఎంత దూరం వెళ్తుందో చెప్పుడానికి! ఈ సంగతిని కొంత మంది గ్రామస్తులూ, సొంతూరికి దూరంగా - సుదూరంగా ఉన్న కొద్దిమంది సూక్ష్మగ్రాహులూ తొలి వందనాళ్ళకే గ్రహించారు! - వాళ్లకు తోచినట్లుగా వాళ్లు సహకరిస్తూనే ఉన్నారు కూడ!

          ఈ 9.6.24 వేకువ కార్యకర్తలు గ్రామ స్వచ్ఛ - శుభ్రతలకు పాటుబడాలనుకొన్నది దుకాణ సముదాయాలున్న నాగాయలంక - RTC బస్ స్టాండు ప్రాంతంలోనే. కాని, వాన రాకడతో ఆ అదృష్టం 1 వ వార్డు - బాలికల వసతి గృహం దగ్గర 2 రోడ్లకు దక్కింది. పదేళ్లనాడు ఈ ప్రాంతం స్వచ్ఛ - శుభ్రతల పరంగా ఒక భూలోక భయంకర నరకం – పూతిగంధహేయం – ఆ నాడది గంగులవారిపాలెం వీధితో “నువ్వా – నేనా’ అని పోటీ పడిన స్థలం!

          తక్కిన ఊరి వీధులొక ఎత్తు – కార్యకర్తలకు అగ్ని పరీక్షలు పెట్టిన - మల మూత్ర – జంతు కళేబర దుర్గంధాల ఈ 2 వీధులొక ఎత్తు! అన్ని పరీక్షల్లో స్వచ్చంద శ్రమదానం ఉత్తీర్ణమయిందనేకంటే - నెమ్మదిగానైనా చల్లపల్లి పౌర సమాజం గెలుపు బాటలో ఉన్నదనేది వాస్తవం!

స్వచ్ఛ కార్యకర్తల నేటి 3144* వ ప్రయత్న విషయానికొస్తే:

1) 3 రోజుల్నాటి క్రొత్త కార్యకర్త  శ్రీ అంబటి శంకర్రావు గారు కాక – ఈ వేకువ కొంగ్రొత్త కార్యకర్త చెన్నై నివాసి బళ్లా సురేష్ కుమార్!

          అతని ఆలోచన, వివేచన, సొంతూరి మంచి పని పట్ల అభినివేశం నేను దగ్గరగా చూశాను!

2) బాలికల వసతి గృహ ద్వారం వద్ద అంబటి - కోడూరు వారి కష్టార్జితమైన పెద్ద వ్యర్ధాల గుట్టను గమనించాను.

3) ఏడెనిమిది మంది గట్టి కార్యకర్తలు ఇనుప తీగల మెష్ లను పెద్ద చుట్టలు చుట్టిన కష్టాన్ని అంచనా వేశాను.   

4) పారల్తో గడ్డి చెక్కిన ఉత్సాహాన్నీ, నిచ్చెనలెక్కి చెట్ల సుందరీకరణనూ, ఇద్దరు పల్నాటి వారి ఐదారు చెట్ల పాదుల సవరణనూ చూసి మురిశాను.

5) 6.25 కు శేషు మహాశయుడు పాడిన సి.నా.రె. తెలుగు వాడి పాటా విన్నాను.

6) DRK గారి మే నెల ఆయ – వ్యయాల పట్టికా ప్రకటనా,

7) చాల రోజుల్తర్వాత వచ్చిన అంజయ్య గారు చేసిన ఉద్యమ నినాద గర్జనా,

8) ఈ సుదీర్ఘ శ్రమదాన ప్రభావం గురించి బళ్లా సురేష్ కుమార్ స్పందనా,

9) శంకర శాస్త్రి కృత తినుబండారాల వితరణా అన్నీ గుర్తుంచుకొన్నాను.

10) బుధవారం వేకువ బస్టాండు ప్రాంతంలోనో లేక బాలికల హాస్టల్ వీధిలోనో మనం కలుసుకోవాలనుకోవడం విన్నాను.  

          లీలగ కనిపిస్తుంటవి

నాకెందుకొ స్వచ్చోద్యమ కారుల నవలోకిస్తే –

తొమ్మిదేళ్ల స్వచ్చోద్యమ పల్లెను గమనిస్తుంటే –

గాంధీలూ, గువేరాలు, గౌతమ బుద్ధుల అంశలు

లీలగ కనిపిస్తుంటవి - త్యాగం మురిపిస్తుంటది!

- నల్లూరి రామారావు

   09.06.2024