3146* వ రోజు....... ....           11-Jun-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

సుందరీకరణ దళంగా మారిన 3146* వ నాటి రెస్క్యూటీమ్!

ఎప్పటి కెయ్యది ప్రస్తుత

మప్పటికా పనులు చేయు....స్వచ్ఛ కార్యకర్తలు గదా!

ఈ స్వచ్ఛ సుందర కార్యకర్తలు శ్మశాన సంస్కర్తలుగా, మొక్కల ప్రతిష్టాపకులుగా, మురుగు తోడే పనివాళ్లుగా, ఊరి రహదార్ల రక్షకులుగా - ఒక్క మాటలో తేల్చేయాలంటే గ్రామ కాలుష్య నివారకులుగా ఎన్ని అవతారాలెత్తలేదు? కొన్ని కొన్ని సందర్భాల్లో ఎన్ని గాయాలపాలు కాలేదు?

            ఈ మంగళవారం వేకువ కూడ అంతే - ఎప్పుడు మేల్కాంటారోగాని, ఎక్కడెక్కడ తమ నివాసాలో గాని ఏ 4.20 కో గస్తీ గది వద్దకు వచ్చారు - గంగులవారిపాలెం రోడ్డు భద్రత వాయిదా వేసి, గస్తీ గది మొదలు ఆస్పత్రి వరకూ చెట్ల, పూల మొక్కల సుందరీకరణకు పూనుకొన్నారు - 

            అసలు సిసలు మెరికల్లాంటి రాటు తేలిన రెస్క్యూ వాలంటీర్లైతే  నలుగురే! అందులో నిన్నో - మొన్నో తన ఇంటావిడకు కంటి ఆపరేషన్ జరిగిన కార్యకర్త ఒకరు! వీళ్లకు మంచి మద్దతుదార్లం మరో ముగ్గురం! 6.15 తర్వాత గాని - తమకు నచ్చినట్లు తరు శాఖల్ని తొలగించి, అక్కర్లేని తీగల్ని ఖండించి, వాటన్నిటినీ ట్రక్కులోకెక్కించి, మిగిలిన వాటిని వీధికడ్దం లేకుండా దాచి గాని - పని విరమించలేదు!

            మీక్కావాలంటే - ఆశ్చర్య వినోదాలు కోరుకొంటే - నిచ్చెన చివరి మెట్టు మీద ఒంటి కాలిపై నిలిచి, కరెంటు తీగల్ని తప్పించుకొంటూ కొమ్మల్ని కోస్తున్న ఇద్దర్ని చూడండి! చూస్తే మీకదొక వింత - వాళ్ళకు మాత్రం ఆనందం!

            వీళ్ళకు పని సాధనంగా ఒక ట్రాక్టరు - దాన్లో ఎత్తు పీట - దాన్నెక్కి వృక్ష సౌందర్యానికి ప్రయత్నిస్తున్న కార్యకర్తలు!

            తూములూరి లక్ష్మణ మహాశయుడే నేటి, స్వచ్చోద్యమ నినాదకర్త!

            బుధవారం వేకువ మనం కలుసుకోదగింది - వర్షం లేకుంటే బస్టాండు మలుపులో ఉంటే ప్రభుత్వ బాలికా వసతి గృహం ముంగిటా!

           రంధ్రాన్వేషణ లెందుకు?

ప్రతి వేకువ పబ్లిక్ గా శ్రమ వేడుక జరుగునపుడు

స్వచ్ఛ శుభ్ర - హరిత శోభ వీధుల్లో పెరుగునపుడు

వచ్చి తలొక చెయ్యేయక పది మందితో కలసిపోక

రంధ్రాన్వేషణ లెందుకు? గందర గోళాలెందుకు?

- నల్లూరి రామారావు

   11.06.2024