పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
3147* వ వేకువలో 25 మంది శ్రమదాన వీరం!
“బుధవారం - 12- 6-24 వ తేదీన ఇందరి సేవలందుకొనే అదృష్టం చల్లపల్లిలో – నాగాయలంక రోడ్డులో - పెట్రోలు నిలయం - మొదలు RTC బస్టాండు వాహన నిష్క్రమణ ద్వారం దాకా!
ఐతే ఇవి సేవలు కానేకావనీ, గ్రామ హక్కులనుభవిస్తున్న తమ బాధ్యతలు మాత్రమే అనీ, సదరు కర్తవ్య పరిపూరణమే తమ అదృష్టమనీ స్వచ్ఛ కార్యకర్తల వాదన!
ఈ గ్రామ భాగాన్ని గత 10 ఏళ్లలో పరిశుభ్ర సుందరీకరించడం ఇది ఏ వందోమారో! ఈ పూట వీధి పారిశుద్ధ్యంలో భాగంగా –
- 150 గజాల సువిశాల వీధిని చీపుళ్లతో క్షుణ్ణంగా ఊడ్చారు,
- రాతి ముక్కల్లో ఇరుక్కున్న తుక్కును బైటకు గుంజడం కోసం దంతెలు వాడడం,
- ఇద్దరు గోకుడు పారలతో పండ్ల దుకాణం ఎదుట బెత్తెడు మందాన పేరుకుపోయిన ఇసుక - మన్ను మిశ్రాన్ని గోకారు గాని - అదింకా సశేషం,
- వాలంటీర్ల పని మెలకువ, చురుకుదనం, ప్రాప్తకాలజ్ఞత చూడాలనుకొంటే - 5.40 - 6.05 నడుమ – కోట ప్రహరీ మలుపు దగ్గర నిలబడితే చాలు - ఆ ఉత్సాహం, ఉద్విగ్నం చూసే వాళ్లక్కూడ అంటుకొంటుంది –
- ఒక ప్రక్క గుడి నుండి వినిపించే ‘హరేరామ - హరేకృష్ణ’ స్తోత్రాలూ కార్యకర్తల మైకు గుండా చైతన్య గీతాలూ, పాతిక మంది నిస్వార్థ, శ్రమదాన దృశ్యాలూ – వీటన్నిటితో బస్టాండు పరిసరాలీపూట సందడే సందడి!
ప్రయాణికులకాసందడే పాటి అనుభూతిని మిగిల్చిందో తెలియదు!
- నిన్న సాయంత్రం NTR పార్కులో బోలెం రామారావు ప్రయోగించిన స్వచ్చ – సుందరోద్యమ సంబంధమైన “పర్యావరణ ప్రాణదాతలు” నాటికను రెండు - మూడు వందల మంది తిలకించారు. ఆ ప్రభావం మాత్రం నేడు కార్యకర్తల సంఖ్య మీద లేదు!
కనీసం 100 - 150 గజాల ప్రధాన వీధి కాలుష్యాలను వదలగొట్టిన కార్యకర్తలు 6.10 తరువాత – తమ శ్రమ ఫలితంగా జీవకళ ఉట్టిపడుతున్న ఆ వీధిని సంతృప్తిగా చూసుకొంటూ – తాము బయల్దేరిన ‘కరీముల్లా బట్టల కొట్టు’ వద్దకు తిరిగి వచ్చి,
జోడు కత్తుల గురవయ్య స్వచ్చ - సుందర నినాదాలకు బదులిచ్చి, అతని సూక్తుల్ని ఆలకించి, DRK గారి సమీక్షా వచనాల్నీ, వచ్చే ఆదివారం వేకువ విజయవాడ నుండి వచ్చే అతిధుల సంగతుల్నీ విని,
ఏ 6.45 కో ఇళ్లకు చేరారు.
రేపటి కార్యకర్తల తొలి కలయిక బస్టాండు వద్దనట!
చాప క్రింద నీరులాగ!
శ్రమజీవన ఋజువర్తన, క్రమశిక్షణ, పరివర్తన
వంటి విలువలొకింతైన స్వచ్చోద్యమ మందున్నవి
గ్రామ సమాజానికి అవి బట్వాడా జరిగినపుడు
శ్రమ సంస్కృతి వేళ్లూనును చాప క్రింద నీరులాగ!
- నల్లూరి రామారావు
12.06.2024