పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
3148* వ నాడు కూడా..
అనగా జూన్ మాసపు రెండో గురువారం – 13 వ తేదీ వేకువ 4.18 కే వీధి పనులు మొదలైనవి. అప్పుడు 10 మందితో నాగాయలంక రోడ్డులో ప్రారంభమై, మరో 14 మంది వచ్చి కలిసి, వెరసి 24 మంది 6.05 వరకూ నెరవేర్చుకొన్న కర్తవ్యాల పట్టిక :
- ముందుగా కోదండరాముని, షిరిడీవాసుని గుడుల పరిసరాలను పరిశుభ్రపరిచి,
- అటు మీదట పడమట దిశగా సాగి, కోట దక్షిణ ప్రవేశ ద్వారము వరకూ, మరో ప్రక్క బస్ ప్రాంగణ ప్రవేశద్వారం దాక,
- కోట ముందట ఎన్ని మురుగునీటి చెలమలున్నాయో చూచితిరా?
- దక్షిణగాన నిలవ మురుగు డ్రైన్ ఘాటు వాసన పీల్చిన వాళ్చకే గదా అర్ధమయేది?
- ఈ 100 గజాల బాట కిరుప్రక్కలా డ్రైన్ నుండి పంచాయతి వారు తోడించిన చిక్కటి మురుగు ఎండి-బిగిసి-ఎన్నాళ్లుగా అక్కడ పడి ఉండేనో గాని – ఈ ఉదయమే వాటికి పరిష్కారం దొరికింది.
- సుమారు 10 మంది – పలుగుల్తో త్రవ్వే వాళ్ళు త్రవ్వి, డిప్పల్తో ఎత్తి ట్రక్కులో నింపే వాళ్లు నింపి, చివరికా మృత్తిక కోటగుమ్మం దగ్గరి మురుగుగుంటల పూడికకు పనికొచ్చింది.
- దక్షిణం ప్రక్కన – RTC ద్వారం దగ్గర - ఐదుగురు కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా గంగరావి చెట్ల కొమ్మల్ని తొలగించాలని చూసినా - ఆ తీగల్నుండి నిప్పుకణికలు ఎగసిపడనే పడ్డాయి!
- మూతబడ్డ మోషే హోటలు ఎదుటి మురుగుకాల్వ తుక్కునూ, గట్టు మీది పిచ్చి మొక్కల్నీ తీసేసే పనిలో నలుగురైదుగురు!
- ముగ్గురు సుందరీకర్తలు గేటు కిరు వైపులా పల్లాలను చదును చేశారు!
“అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తియ్యనుండు......” అని వేమన చెప్పినట్లు – ఈ మురుగు పని చేస్తున్నకొద్దీ కొందరు కార్యకర్తలకు ఇష్ట కార్యక్రమంగా మారింది!
ఇంచుమించు 2 గంటల పారిశుద్ధ్య కృషి తర్వాత – 6.15 సమయంలో - చుట్టం చూపుగా వచ్చిన దేసు మాధురి గతంలో కంటే భిన్నంగా నిలకడగా పలికిన స్వచ్చ సుందరోద్యమ నినాదాలతోనూ –
రేపటి – ఎల్లుండి ఉదయాల్లో కూడా మన గమ్యం బస్టాండు అవరణే అనెడి నిర్ణయంతోనూ ఈ సమీక్షా సభకు ముగింపు!
చల్లపల్లి స్వచ్చోద్యమం ఖర్చులకు గాను ఒక క్రమం తప్పని నెలవారీ విరాళ ప్రదాత శ్రీ కోడూరు వేంకటేశ్వరరావు నిన్న ఆసుపత్రిలోనే సమర్పించిన 520/- కి ధన్యవాదములు.
పారదర్శకమే గాని
స్వచ్చోద్యమ చల్లపల్లి సదాజరుగు క్రమంలోన
నిశ్చల నిశ్చితమెతప్ప నిరాశ – నిస్పృహలెక్కడ?
ఉత్సాహపు ఉరక తప్ప ఉద్రిక్తత ఎక్కడుంది?
పారదర్శకమే గాని రహస్యమేమున్నది?
- నల్లూరి రామారావు
13.06.2024