పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
బస్ ప్రాంగణ పరిశుభ్రతా చర్యలు - @3149*
శుక్రవారం వేకువ 4.19 నుండీ 6.10 దాక RTC ప్రయాణికుల సాక్షిగా జరిగిన ఆ చర్యలు అనిదంపూర్వములు, అనితర సాధ్యములు! 23 మంది అలసటనూ చెమటనూ కళ్లజూసిన ఆ మకిలి చేష్టలు ఈ నాటివి కావు - 3149* రోజులుగా జరుగుతున్నవే!
బస్టాండు కావచ్చు, శంకరగిరి మాన్యాలు కావచ్చు, మురుగుగుంట కావచ్చు, పంటకాల్వ గట్టు కావచ్చు, గ్రామ వీధులే కావచ్చు - ఎక్కడ మలినాలుంటే - అసౌకర్యాలు బైటపడితే - గ్రామ జనారోగ్య భంగకరాలు కనిపిస్తే - హరిత సౌందర్యాలు లోపిస్తే...... అక్కడ ప్రతి వేకువా ఈ పాతిక - ముప్పై -నలభై మంది వాలిపోతారు! ఆయా ప్రదేశాల మెరుగుదలకు చాతనైనంత శ్రమిస్తారు!
అలా - నిన్న ఉదయం వీధులూడ్చుకొంటూ, గుంటలు పూడ్చుకొంటూ పోతున్న స్వచ్ఛ కార్యకర్తల కంటబడిందే ఈ RTC బస్టాండు ముందు భాగాన మూతబడిన - పిచ్చి కంపలు పెరిగిన - ప్లాస్టిక్ చెత్తలు నిండిన మోషే హోటల్ స్ధలం!
ఈ వేకువ 100 నిముషాల పాటు సదరు ఎగుడుదిగుడు స్థలమే 15 మంది కార్యకర్తల చేతి కత్తులకూ, దంతెలకూ ఊపిరి సలపని పని కల్పించిన ఆరేడు సెంట్లు!
వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా 6.00 కల్లా చూడముచ్చటగా కన్పించిన పబ్లిక్ క్షేత్రం! అందుకు సాక్ష్యం – పెద్ద ట్రక్కునిండా ప్రోగుబడ్డ రకరకాల వ్యర్ధాలు!
మిగిలిన ఏడెనిమిది మందికీ పని కల్పించింది సైకిల్ స్టాండు! అక్కడ డజన్ల కొద్దీ డిప్పల తుక్కు కూడ కార్యకర్తల చీపుళ్లు చెప్పినట్లు విని, మర్యాదగా ట్రక్కులోకి చేరాయి! ఆలస్యంగా నిద్రలేచిన సైకిల్ స్టాండు యువకుడు 20 నిముషాలపాటు స్వచ్ఛ కార్యకర్త అవతార మెత్తాడు!
అడపావారిపాలెం నుండి మిలటరీలో పనిచేస్తున్న ఒక వ్యక్తీ, వేములపల్లి నుండి వచ్చిన ఇంకో మనిషీ నిన్న శ్రమదాన సంగతికి ఆశ్చర్యపడి - ఆరా తీసిన విషయాన్ని Dr. DRK ప్రస్తావించే ముందు - బస్ ప్రాంగణం దద్దరిల్లేలా శ్రమదానోద్యమ నినాదాలు పలికింది కోడూరు వారు,
తన వ్యసనాన్ని కొనసాగిస్తూ - కార్యకర్తలకు తినుబండారాలందించినది పల్నాటి అన్నపూర్ణ నామధేయురాలు,
రేపటి వేకువ సైతం మనం బాగుచేయవలసింది RTC బస్ ప్రాంగణమేనట!
ఈ నాటి విశేషమేమంటే – ఎక్కడినుండో, ఎవరో గాని ఒక అజ్ఞాత దాత 10 మాప్లను, 20 బ్రష్ లను నిన్న సాయంత్రం ఆసుపత్రి గేటు లోపల పెట్టి వెళ్లారు. దాని లోపల ఉన్న చీటీ ఇట్లున్నది.
“ఈ వస్తువులను స్వచ్ఛ సుందర టాయిలెట్ల పరిశుభ్రతకు వాడుకొనవలసిందిగా మనవి”.
ఈ సహృదయ అజ్ఞాత వదాన్యతకు స్వచ్ఛ కార్యకర్తల ధన్యవాదములు.
సృజనశీల పరవశమే
స్వచ్చోద్యమ చల్లపల్లి సాగుతున్న తరుణంలో
ప్రతి పనిలో సృజనశీల పరవశమే మిగులుతోంది
అప్పుడపుడు చిరుగాయాలౌతున్నా పనులాపరు
ఎండలు - వానలు - మంచులకేనాడూ జంకలేదు!
- నల్లూరి రామారావు
14.06.2024