3150* వ రోజు....... ....           15-Jun-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

స్వచ్చ స్వగ్రామ తయారీలో ఇది 3150* వ ప్రయత్నం!

            శనివారమైనందునేమో (15.6.24) - ఏదో విధంగా – ఎంతో కొంతగా ఆ ప్రయత్నం చేసిన వారు 33 మంది! సదరు సామూహిక శ్రమదాన రంగస్థలం 1 వ వార్డుకు చెందిన బాలికల వసతి గృహం వీధి! ఇటీవల పాపులర్ డైలాగ్ తగ్గేదేలే అన్నట్లుగా నేటి వీధి వ్యర్థాలు కూడ ట్రక్కు నిండుగా.  

            మరి - స్థానిక గృహస్తులెవరైనా క్రొత్తగా పాల్గొన్నారా? స్వచ్చ కార్యక్రమానికి సంఘీభావం తెలిపారా? అంటే - అదేమీ లేదు! 150 గజాల వీధి భాగాన్నీ, హాస్టల్ ఎదుటి డ్రైన్ నూ, కొన్ని వృక్షాల్ని బాగుపరచిందీ, తీర్చిదిద్దిందీ, సుందరీకరించిందీ నికరంగా పాతిక మందే!  చెమటల్తో తడిసి, దుమ్ము కొట్టుకొన్నది వాళ్ల బట్టలే! సంతోషమే సగం బలం అన్నట్లుగా గ్రామ సామాజిక కర్తవ్య నిర్వహణ సంతృప్తితో మెరుగ్గా ఉన్నవి వాళ్ల ఆరోగ్యాలే!

            హాస్టల్ ముంగిట సందడిగా శుభ్ర సుందరీకరణంతో ఆహ్లాదం పొందే వారూ, రహదారి హరిత వనాలతో స్వస్తపడే స్థానికులూ ఎందుకు అంటీముట్టనట్లున్నారనేది సమాధానం లేని ప్రశ్నే!

            వీధి కాలుష్యాల్ని పరిహరిస్తున్న పాతిక మంది రకరకాల పనులూ, వ్యర్ధాల్ని పొడి కొట్టే షెడ్డర్ యంత్ర ధ్వనులూ అక్కడి వాళ్ళను నిద్ర లేపే ఉండాలి! వేరే వార్డులు - గ్రామాల స్వచ్చ కార్యకర్తలు తమ వీధిని శుభ్రపరుస్తుంటే పట్టనట్లు మిన్నకుండటం గౌరవప్రదం కాదని మనవి!

            నేటి వేకువ సైతం డజను మందితో 4.16 కే వసతి గృహం వీధిలో పారిశుద్ధ్య కృషి ప్రారంభం. 6.20 కి 33 మందీ పసుపులేటి ధనలక్ష్మీ ప్రకటిత త్రివిధ నినాదాలతోనూ,

            వచ్చే శుక్రవారం NTR పార్కులో జరిగే సామూహిక యోగా కార్యక్రమానికి ఆహ్వానించవచ్చిన యోగా గురువు మాటలతోనూ,

            పుట్టింటి సంబంధిత పుట్టెడు దుఃఖాన్ని మూట గట్టుకొన్న సర్పంచి గారి విచారాన్ని కార్యకర్తలు పంచుకొనడంతోనూ

            రేపటి వేకువ కూడా మనం ఇదే చోట - అనగా బాలికల హాస్టల్ పద్ద కలుద్దామనే DRK గారి ప్రతిపాదనతోనూ.....

నేటి శ్రమదాన పరిసమాస్తి!

        కదన కుతూహలము

స్వచ్చోద్యమ చల్లపల్లి జరుగు గొప్పకాలంలో

ఉత్సాహం తరగలేదు - ఉడుం పట్టు సడలలేదు

కాలుష్యం రక్కసిపై కదన కుతూహలమున్నది

సాహసాలు ఒక వంకన - సంయమనం మరోవంక!

- నల్లూరి రామారావు

   15.06.2024