పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
3151* వ వేకువ కూడ 1 వ వార్డు సేవలే!
ఆదివారపు (16.06.2024) సాంప్రదాయానికి భిన్నంగా అవి 27 మందికి పరిమితులే! అందుక్కారణం బహుశా వాన శీలం పట్ల శంకలే! ఈ వచ్చిన వాళ్లైనా ఇళ్ల దగ్గర పనుల్లేక - వేకువనే నిద్ర పట్టక - ఏంచేయాలో తోచీతోచక - సరదాగా వచ్చిన వాళ్లేమీ కాదు!
ఇంటి బాధ్యతల నుండి తీరిక చిక్కుంచుకొని వచ్చిన గృహిణులూ, 60 -70 ఏళ్లు దాటిన పెద్దలూ, పెందలకడే ఉద్యోగ విధులకు పోవలసిన కొందరూ, ఇంకా రైతులూ వగైరాలని గుర్తుంచుకోవాలి. స్వకార్యాలకూ – గ్రామ సామాజిక కర్తవ్యానికీ సమతూకం వేసుకొంటూ – సమన్యాయం చేస్తున్న చతురులన్న మాట!
ఎండ – వానల, చలీ – మంచుల కాలమేదైనా – ఎప్పుడో సకృత్తుగా తప్ప – జీతభత్యాల్లేని ఈ కొలువుకు వీరిలో సగం మంది మాననే మానరు! కాల పరీక్షకు నిలిచిన ఈ శ్రమదానంతోనే గదా – చల్లపల్లి ఈ మాత్రం స్వచ్చ – శుభ్ర – సుందరంగా నిలుస్తున్నది?
నిన్న కురిసిన మెరుపుల – ఉరుముల – గాలి వాన ఫలితంగా బాలికల హాస్టల్ వీధిలో నీళ్ళు నిలిచిన చోటనే – బురదలోనే సగం మంది కార్యకర్తలు పనిచేయవలసి వచ్చింది.
ఈ భారీ వర్షం వల్ల 2 ప్రయోజనాలేమంటే – నేల బాగా నాని నిన్నా ఈ పూటా వీధి హరిత సుందరీకరణ కోసం క్రోటన్, నేరేడు వంటి మొక్కలు నాటడం తేలికయింది. 2-3 రోజులదాక టాంకర్లతో నీళ్లందించే పని తప్పింది. అంతకు ముందు పాతిన సిమెంటు స్తంభాలను పీకేయడం సులువయింది.
ఈ పూట కూడ కొమ్మల్నీ, వీధి తుక్కనూ, పిచ్చి మొక్కల్నీ షెడ్డర్ పొడిపొడి చేసింది. బందరు రోడ్డు దాకా ప్లాస్టిక్ సంచుల, గ్లాసుల సీసాల సేకరణ జరిగింది.
4.15 మొదలు 6.10 దాక శ్రమించిన కార్యకర్తలు కాఫీలు సేవించి, ఏదో సరదాగా జొన్నవిత్తుల వ్రాసి, శేషు పాడిన
“నన్ను పీక్కు తిందువటే వన్నెల భార్యామణి?
అన్నంలో నంజుకొందు నిన్నే నా భర్తా!”
అనే పేరడీ కొందరి విమర్శలకు గురయింది!
ఈ పూట స్వచ్ఛ సుందర నినాదాలు పలికిన వారూ, శ్రమదాన ఖర్చులకు 2,000/- విరాళమిచ్చినవారూ రాయపాటి రాధాకృష్ణ!
వర్షం ప్రవర్తనను బట్టి – మన బుధవారం నాటి శ్రమదాన ప్రదేశం ఉంటుంది - బస్టాండా/1 వ వార్డులోనా అని!
పావన కార్యక్రమమిది!
ఏ ఒక్కని ఆలోచన ఇందరిపై రుద్దడమో
బ్రతిమిలాడి – భయపెట్టీ శ్రమదానం పిండడమో
కాదు - స్వయం ప్రేరణతో కలిసొచ్చిన శ్రామికులే
బాధ్యతగా నిర్వహించు పావన కార్యక్రమమిది!
- నల్లూరి రామారావు
16.06.2024