పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?
సాఫీగా - సవ్యంగా రెస్క్యూ పనులు - @3165*
జులై 2 వ రోజు వేకువ - మంగళవారం పూట – 4.20 – 6.10 మధ్యస్ధాలైన సదరు పనులు మరొకమారు గంగులవారిపాలెం వీధిలోనివే! హాజరైన గట్టి+మెతక కార్యకర్తలు 5+2 మందే! ఆ గంటా ఏభై నిముషాల పనుల కొలతలివే!
- పద్మావతి వైద్యశాల ఎదుట మళ్లీ విస్తరిస్తున్న 2 చెట్ల కొమ్మల్ని అదుపులో పెట్టడం,
- సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు మొదటి 3 చెట్ల శాఖలూ పైన విద్యుత్ శాఖల్లో దూరక ముందే విద్యుత్ కార్మికులకు పనిభారం తగ్గిస్తూ వాటి ఖండనమూ - తద్ ద్వారా ఆ చోటున హరిత మండనమూ,
- ఇంకా అస్మద్ గృహ ప్రవేశ మార్గమందలి కొన్ని మొక్కల కొమ్మల - తీగల సంస్కరణమూ....వగైరాలు!
వాన గాని, ఉక్క పోతగాని లేనట్టి - రెస్క్యూ పనులకు ప్రోత్సాహకరమైన సమ - సుఖ శీతోష్ణ పరిస్థితిలోనే ఈ వేకువ వీధి శుభ్ర - సుందరీకరణ కృషి!
ఈ నలుగురైదుగురి శ్రమనూ, ఊరి కొరకు పడుతున్న కష్టాన్నీ – ఏ చిటికెడు సామాజిక స్పృహ ఉన్న - ఏదోసెడు ఉత్సాహం ఉన్న గ్రామస్తులు చూసినా - ఆలోచించినా స్వచ్చ కార్య కర్తల దైనందిన బాధ్యతల్ని పంచుకొనే క్రొత్త వాళ్ల సంఖ్య అమాంతం పెరిగిపోవాలి! అదెంత వరకు నిజమని మనం కాలాన్ని అడగాలి!
6.25 కాలంలో పద్మాభిరామం ఎదుట ఈ కార్యకర్తల బృందం - బ్యానర్ సాక్షిగా తూములూరి లక్ష్మణుని నినాద రూపంలో తమ ఆశయాన్ని ప్రకటించారు - కాఫీలు సేవించారు.
రేపటి ప్రత్యూష పననాల నడుమ వేకువ శ్రమానందం కోసం కలువవలసిన చోటు - బైపాస్ వీధిలోని యడ్ల వారి బజారు దగ్గర!
సమకాలిక ప్రపంచాన
మహర్షులనో - తపస్వులనో - యశస్వులనో పిలువదగిన
స్వచ్చ కార్యకర్తల దైనందిన శ్రమదానానికి
సమకాలిక ప్రపంచాన సాటి వచ్చువారెవ్వరు?
అట్టి శ్రమ త్యాగానికి సాష్టాంగ ప్రణామాలు!
- ఒక తలపండిన కార్యకర్త
02.07.2024