పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?
3166* వ నాటి శ్రమదానం ముచ్చట్లు!
పై సంఖ్య జులై నెల - 3 వ తేదీకి చెందినది! మొత్తం 25 గురు స్వచ్చ కార్యకర్తలకు సంబంధించినది! అందులో 10 మందైతే మరీ 4.12 కే తొందరపడినది! 3 వీధులకు పరిమితమైనదీ, 6.10 కి ముగిసినదీ!
ఈ పాతిక మంది ప్రయత్నమూ లోకోత్తర ఘనకార్యమూ - అపూర్వమూ - మహామహాద్భుతమూ కాదనే- సంఘ చైతన్యం కల ఎవరైనా చేయవలసిన పనేననే స్పృహ వారిలో ఉన్నది! సమాజంనుండి పొందిన దాన్లో కొంత తిరిగి చెల్లిస్తున్న పనిగానే వాళ్లీ శ్రమదానాన్ని పరిగణిస్తున్నారు.
ఈ బుధవారం వేకువ తలా 2 గంటల వీరి శ్రమవల్ల :
- ఉప్పల వారి వీధిలో కొంత భాగం పరిశుభ్రంగా మారిపోయింది. అదసలే చిన్న ఇరుకు రోడ్డు - రెండు ప్రక్కలా గడ్డీ – పిచ్చి మొక్కలూ - వాటి నడుమ ప్లాస్టిక్ తుక్కులూ పెరిగితే, కనీసం స్వచ్ఛ కార్యకర్తలైనా పట్టించుకోకపోతే ఏమవుతుంది?
2 అడ్డరోడ్ల ఉప్పల - యడ్ల బజార్ల ప్రాంతం - అనగా బైపాస్ మార్గం పైకి బాగానే ఉన్నా, చిల్లర పచారీ కొట్టు ఎదుటా ప్రాత ప్రభుత్వాసుపత్రి ముఖ ద్వారం వద్దా, వీధి ఉత్తరంగా 4 ఇళ్ల దగ్గరగా చెట్ల కొమ్మల - మద్యం సీసాల - పెరిగిన గరికా తుంగల వ్యర్థాలే సగం ట్రక్కు నిండినవి!
ఇక చిల్లర దుకాణం, ఎదుటి ఇరుకు వీధి కూడ కాస్త శుభ్రంగానే ఉన్నా, మహిళా కార్యకర్తల చీపుళ్ల మూలంగా మరింత బాగుపడింది!
ఏ వీధైనా చూడగానే “బాగానే ఉందే” అనిపించడం వేరు -
పాతిక మంది కార్యకర్తల పనుల తర్వాత వచ్చే స్వచ్ఛ- శుభ్ర- సౌందర్యం వేరు!
నేటి వీధి పారిశుద్ధ్యం వల్ల పుట్టుకొచ్చిన వ్యర్థాలు ఏడెనిమిది మంది కష్టంతో బుద్ధిగా ట్రాక్టర్లో చేరి -
డంపింగ్ యార్డు చేరినవి.
ఈ వేళ నినాద ప్రకటనదారుడు, సూక్తి ప్రచారకుడూ అడపా గురవయ్యే! ఈ 35-40 పని గంటల శ్రమ సమీక్షకుడూ, రానున్న 3-4 రోజుల కార్యక్రమ బోధకుడూ DRK వైద్యుడే!
గురువారం వేకువ సైతం మన పనిపాటులు ఈ బైపాస్ వీధిలోని కస్తూర్బాయి ఆస్పత్రి వద్దనే!
క్షేత్రస్థాయి క్రియలు లేక
సిద్ధాంతము చేయవచ్చు, సంకేతము లీయవచ్చు,
‘అస్తి నాస్తి’ విచికిత్సలు అహరహమూ సాగవచ్చు -
మరి- క్షేత్రస్థాయి క్రియలు లేక ఎవరి నుద్ధరించగలవు?
సామాజిక సమస్యలను చక్కదిద్ది పెట్టగలవు?
- ఒక తలపండిన కార్యకర్త
03.07.2024