3167* వ రోజు..............           04-Jul-2024

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

మూడు వేల నూట అరవయ్యేడవ* శ్రమదానం!

            సదరు శ్రమఘట్టం గురువారం వేకువ  సుమారు 2 గంటల పాటు సాగర్ టాకీసు బైపాస్ వీధికి ఉత్తర - దక్షిణాలుగా జరిగింది. దానికర్తలు 26 మంది. ఇందులో పారల్తో మట్టి దిబ్బల్ని కుమ్మేసిన ముగ్గురూ, కేవలం దంతెలు మాత్రం వాడుకొన్న నలుగురూ, కత్తికీ - కత్తెరకూ పని చెప్పిన వారూ, చీపుళ్ల మీద ఆధారపడిన నలుగురు మహిళామణులూ!

            మైకు పాటల సౌకర్యమున్నా సరే - పనిలో లీనమై శ్రమ తెలియకుండా సొంతంగా కూనిరాగాలు తీసేవారూ,

            చెత్తలోడింగో - వీధి గుంటల పూడికో - మట్టి డిప్పలు మోసేదో మురుగు గుంటలో దిగేదో__ఎప్పుడే పని పడినా సిద్ధంగా ఉండే ఐదారుగురు ఆల్ రౌండర్లూ,

            మధ్యలో మంచి నీళ్లు, చివర్లో కాఫీలందించే వారూ, వయసు మీరుతుండడం వల్ల జాగ్రత్తగా నడుం వంచి పనిచేసే పెద్దలూ..

            ..ఇలా ప్రతి వేకువా ఏదొక వీధిలో ఇదొక స్వయం సహాయక - స్వయం సమృద్ధ - గ్రామ ప్రయోజనకర కార్యకర్తల సంఘమన్నమాట!

            అసలిలా దశాబ్దకాలంపాటు - ఏ కోన్ముఖ లక్ష్యంతో నిలకడగా పనిచేసుకుపోయే పాతిక - ముప్పై - నలభై కార్యకర్తల బృందం బహుశా దేశంలో మరెక్కడా ఉండకపోవచ్చు!

            నేటి పని వివరాలు కావాలంటే - మన వాట్సప్ లోని 5.45 తరువాతి చిత్రాల్ని చూస్తే చాలు అటు ఉప్పల వారి వీధి మొదలు ఇటు షాబుల్ వీధి దాక బైపాస్ మార్గం ఎంత ముచ్చటగా కనిపిస్తుందో!

            మధ్యలో 2-3 చోట్ల రోడ్డు శ్రేయస్సు కోసం రాతి ముక్కల్తో పల్లాల్ని పూడ్చిన వైనం!

            అసలదొక సామాజిక సామూహిక శ్రమానందం!

            తోటి గ్రామస్తుల పట్ల కార్యకర్తల బాధ్యతాంశం!

            కస్తూర్భాయి ప్రాత ఆస్పత్రి గేటు - ఎలక్ట్రానిక్ దుకాణాల మధ్య 6.25 సమయంలో జాస్తి V - జ్ఞాన ప్రసాదుని నినాదాలూ,

            నేటి 45 పనిగంటల సమీక్షా,

            రేపటి వేకువ మనం కలువదగిన చోటు సాగర్ టాకీసు వెనుక వీధి మొదట్లో అనే నిర్ణయాలతో ముగిసిన గురువారం నాటి పనులూ,

            పనిలోపనిగా నెలవారీ చందా - 520/- సమర్పించిన కోడూరు వేంకటేశ్వరరావు గారి విరాళమూ,

            ప్రకృతి ముఖమున మందహాసం

సాహసికులది శ్రమోల్లాసం సమాజానికి మనోల్లాసం

వృక్ష సంపద - పుష్ప సంపద ప్రయాణికులకు మహోల్లాసం

వ్యర్ధములతో ఎరువు చేయుట ప్రకృతి ముఖమున మందహాసం

చల్లపల్లి స్వచ్ఛ సుందర శ్రామికులదే మహా విజయం!

- ఒక తలపండిన కార్యకర్త

   04.07.2024