3176* వ రోజు..............           14-Jul-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

                 వర్తమాన సామాజిక చైతన్య శ్రమదాన వాహిని - @3176*

ఆదివారం (14.7.24) నాటి సదరు వాహిని 40 మంది నికర శ్రమదాతలతోనూ, పాతికమంది అతిథి శ్రమదాతలతోనూ, గంగులవారి పాలెం వీధి లో ప్రవహించినది! ఆ పిదప పద్మాభిరామంలో మండలి బుద్ధ ప్రసాదు గారు పాల్గొన్న సభలోనైతే 90 మంది కనిపించారు!

          ఈ సమావేశం గాని, చల్లపల్లి పౌర సమాజ కరదీపికగా జరిగిన వీధి పారిశుద్ధ్య శ్రమ వేడుక గాని, పదేళ్ల నుండి నిర్విఘ్నంగా నెరవేరుతున్న స్వచ్చ కార్యకర్తల దీక్షలు గాని - MLA గారు చెప్పినట్లు- కేవలం చల్లపల్లి లో మాత్రమే జరిగే వింతలు!

          ముఖ్యంగా గత పాతికేళ్ల చరిత్రను పరిశీలించండి – పరీక్షలొచ్చి విద్యార్థులు కొందరు గెలుస్తారు; ఎన్నికలొచ్చి  పోటీదారులు నెగ్గుతుంటారు; వ్యాపార వ్యవహారాలలో కొందరు లాభిస్తుంటారు గాని చల్లపల్లిలో వలె ఈ మాత్రంగా సామాజిక బాధ్యత ఎక్కడైనా నెగ్గుకొచ్చిందా? స్వార్థాన్ని ధిక్కరించి త్యాగం ముందడుగు వేసిందా?

          అన్ని ఊళ్లలో లాగే ఈ 100-150 మంది కార్యకర్తలూ చేతులు ముడుచు క్కూర్చొంటే - ఈ స్వచ్చ సుందర ఉద్యానాలూ, రహదారి హరితవనాలూ, స్టార్ హోటళ్లలో లాగా సౌకర్యమైన పబ్లిక్ టాయిలెట్లూ, పిక్నిక్ స్పాట్స్ లాంటి శ్మశానాలూ, చుట్టూ ఎటు వెళ్లినా 10 హరిత సుందర రహదార్లూ సమకూరేవా?

          సామాజిక బాధ్యతంటే ఏమిటో  ఈ ఊళ్లోనే బోధపడుతుంది; “శ్రమ యేవజయతే” అనే సామెత ఇక్కడే సార్థకమౌతుంది; సామాజిక సామూహిక శ్రమ జీవన సౌందర్యం చూడాలనుకొంటే ఇక్కడికొస్తేచాలు; ఏ కాస్త స్పృహ ఉన్న వాళ్లకైనా నిజమైన స్ఫూర్తి ఇక్కడ ఉచితంగా దొరుకుతుంది!

          ఒక క్రమశిక్షణ, ఒక సమైక్యతా శక్తి, నేటి తరానికి కావలసిన దార్శనికత ఈ స్వచ్ఛ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమం లో కనిపిస్తుంది!

          ఇందుకే ఈ పూట గంటసేపు జరిగిన సభ ప్రత్యేకమైనది. ఒకరకంగా ఈ సభకు  కారణం – నేటి 5 లక్షల విరాళంతో సహా ఇప్పటికే 24 లక్షలు తన గ్రామ సంక్షేమానికి సమర్పించిన-93 వ ఏట ప్రవేశించిన ఒక వ్యాయామోపాధ్యాయుడు దాసరి రామమోహనరావు గారి జన్మదినం !

          ఇలాంటి వ్యక్తుల స్ఫూర్తిగాని, స్వచ్ఛ కార్యకర్తల శ్రమ దీక్షలు గాని, వీటి విజయాలను గానం చేసిన నందేటి వాని  ఉత్సాహం గాని, దిన దిన ప్రవర్ధ మవ్వాలని కోరుకుందాం!

          లయన్స్ క్లబ్ వారి ప్రమాణస్వీకారానికి హాజరౌదాం!

          రేపటి వేకువ శ్రమదానం కోసం మళ్లీ ఇదే గంగులవారిపాలెం వీధిలో పద్మాభిరామం వద్దనే కలుద్దాం!

           చల్లపల్లిలో లేనివ?

లోకోత్తర త్యాగాలను - శ్లోక మహత్కార్యాలను-

సాదాసీదా మనుషుల సామాజిక బాధ్యతలను-

మొక్కవోని పట్టుదలను ఎక్కడెక్కడో వెదకుట

అవసరమా - స్వచ్ఛోద్యమ చల్లపల్లిలో లేనివ?

- ఒక తలపండిన కార్యకర్త

   14.07.2024